తెలంగాణ

వచ్చే ఎన్నికల్లో మనదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, త్వరలో చేపట్టనున్న ప్రజా చైతన్య బస్సు యాత్ర ద్వారా తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ సేవాదళ్ సదస్సు సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 26నుంచి ప్రారం భం కానున్న ప్రజా చైతన్య బస్సు యాత్రలో కేసీఆర్ ఒంటెత్తుపోకడలు, అప్రజాస్వామిక విధానాలను జనంలో ప్రచారం చేద్దామన్నారు. నాలుగేళ్లు గడచినా ఇంతవరకు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో తెరాస విఫలమైందన్నారు. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కేసీ ఆర్ మైండ్‌గేమ్ ఆడుతున్నారన్నారు. కాంగ్రెస్ అనుబంధ విభాగం సేవాదళ్‌కు ఘనమైన చరిత్ర ఉందన్నారు. టిక్కెట్ల కేటాయింపులో సేవాదళ్‌తో పాటు అన్ని విభాగాల్లో పనిచేసే నేతలు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. బస్సు యాత్రలో
శ్రేణులంతా చురుకుగా పాల్గొనాలన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాలు మార్చి 12నుంచి ప్రారంభమవుతున్నాయని, కాని దళితులకు మూడెకరాల భూమి, ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుదల, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం హామీలను తెరాస నిలబెట్టుకోలేకపోయందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో దళితులు, మైనార్టీలు, బలహీనవర్గాల ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారన్నారు. అప్రజాస్వామిక విధానాలతో ప్రజల గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఖమ్మంలో రైతుల చేతికి సంకెళ్లు వేయడం ద్వారా కేసీఆర్ రైతు వ్యతిరేకి అని నిరూపించుకున్నారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు రూ.3వేల చొప్పున భృతి చెల్లిస్తామన్నారు. ఏఐసీసీ కార్యదర్శి ఆర్‌సి కుంతియా మాట్లాడుతూ ఆరెస్సెస్ మత రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. సేవాదళ్ లౌకికవాదానికి ప్రతీక అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ఎకె ఖాన్, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ నేత మహ్మద్ షబ్బీర్ అలీ, వి హనుమంతరావు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి, సేవాదళ్ చైర్మన్ కె జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..గాంధీభవన్‌లో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ సేవాదళ్ కార్యక్రమంలో మాట్లాడుతున్న పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి ఆర్‌సి కుంతియా