తెలంగాణ

ప్రజల్లో పట్టు లేకనే బస్సు యాత్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 20: ప్రజల్లో పాత్ర లేక కాంగ్రెస్ నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, వారికి ఎలాంటి ప్రతిపక్ష అవకాశం కల్పించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నందున రాజకీయ ఉనికి ప్రమాదంగా మారిందనే ఉద్దేశంతోనే బస్సుయాత్రల పేరిట ప్రజలముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు తెలంగాణలోని ఆ పార్టీ నాయకులంతా తలోబస్సు తీసుకుని యాత్రలు చేసినా వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అధికారంలో ఉన్నప్పుడు ఏమి ఒరగబెట్టారని ప్రజలు కాంగ్రెస్ నాయకులను నిలదీయాలంటూ మంత్రి పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో మహిళా సంఘం భవనం ప్రారంభోత్సవం, వరిధాన్యం కొనుగోలు కేంద్రం, రైతుబజార్ ప్రారంభానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా బాదేపల్లి మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో పాత్రలేకనే కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్సుయాత్రకు పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పనిచేయడం చేతకాని సన్నాసులు ఎవరినీ ప్రజోపయోగ పనులు చేయనివ్వరని అలాంటి కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి అయితే తమకు రాజకీయం లేకుండా పోతుందనే భయంతో కోర్టుల్లో కేసుల మీద కేసులు వేస్తూ పనులకు ఆటంకం కల్పిస్తున్నారని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకుంటున్న వారికి రాజకీయంగా పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో ప్రతిపక్షాలకు ప్రజల్లో ఎలాంటి పనిలేకుండా పోయిందని ఆ అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించడం లేదన్నారు. దీనిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రతిపక్షం తెలంగాణ రాష్ట్రంలో ఉండటం దురదృష్టకరమన్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని రైతాంగానికి అందుబాటులోకి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తుంటే కాంగ్రెస్ నాయకులకు కడుపుమండుతోందని ధ్వజమెత్తారు. జడ్చర్లలో ఒక రైతుబజార్ ఏర్పాటుకు దాదాపు రూ.50లక్షలు కేటాయించామంటే టీఆర్‌ఎస్ ప్రభు త్వం అభివృద్ధిపై ఎంత చిత్తశుద్ధి ఉందో తెలిసిపోయిందన్నారు. పాలమూరును దత్తత తీసుకుని దగా చేసి ప్రజల వలసలకు కారణమైన నాయకులను రాజకీయంగా భూస్థాపితం చేసినప్పుడే పాలమూరు జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చిన వారు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. రైతులకు పెట్టుబడి కింద వచ్చేనెల నుండి ఎకరాకు రూ.4వేలు ఇవ్వడానికి ప్రభుత్వం అంతా సిద్ధం చేసిందని అయితే కాంగ్రెస్ నాయకుల కాళ్ల కింద బీటలు కదులుతున్నాయని వారికి పిచ్చిపట్టి పిచ్చి చేష్టలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మరో పదిహేనేళ్ల పాటు టీఆర్‌ఎస్ పార్టీయే అధికారంలో ఉంటుందని ఎన్ని కొత్త పార్టీలు పుట్టుకువచ్చిన వారు పేరు పెట్టుకుని ఇంట్లో కూర్చోవల్సిందేనని మంత్రి జగదీష్‌రెడ్డి ఆరోపించారు. అందరూ జతకట్టినా కేసీఆర్‌ను ఏమీ చేయలేరని కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు పాతాళానికి పోవల్సిందేనని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రాజెక్టును నిర్మించి తీరుతామని 10లక్షల ఎకరాలకు సాగునీరు అందించి పాలమూరుకు పట్టిన దారిద్య్రాన్ని పాలదోలుతామన్నారు. రైతు కళ్లలో ఆనందాన్ని చూస్తూ పాలమూరు మరో కోనసీమను తలపించేలా కృష్ణాజలాలను తీసుకువస్తామన్నారు. మూడున్నర ఏళ్ల పాలనలో అదనంగా నాలుగున్నర లక్షల ఎకరాల్లో కృష్ణాజలాలను పారించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించిన సభలో మాట్లాడుతున్న మంత్రి లక్ష్మారెడ్డి