తెలంగాణ

డబ్బు భక్తులది..పేరు సర్కారుది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది నిట్టనిలువునా రెండు భాగాలుగా చీలిపోవడంతో ఆలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా కొనసాగుతోంది. దేవాలయాల నిర్వహణలో సంస్కరణలు తీసుకువస్తామంటూ గత దశాబ్దకాలంగా ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఎలాంటి సంస్కరణలకు ఈ శాఖ నోచుకోవడం లేదు. ప్రస్తుత దేవాదాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కూడా దేవాలయాల్లో సంస్కరణలు తెస్తామంటూ పలుపర్యాయాలు ప్రకటించినప్పటికీ, ఇప్పటి వరకు ఒక్క కొత్త పథకం కానీ, కొత్త కార్యక్రమం కానీ చేపట్టలేకపోయారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖలో ఒకవైపు ప్రభుత్వ పెత్తనం కొనసాగుతుండగా, మరోవైపు ఈ శాఖలో వేళ్లూనుకున్న కొంత మంది సిబ్బంది సంస్కరణలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దాంతో సంస్కరణల గాలి ఆలయాలవైపు రావడం లేదు. ఈ పరిస్థితిలో కఠినంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం నిర్లిప్తతగా ఉంటోంది. తెలంగాణ రాష్ట్రంలో 12 వేలకు పైగా దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల నిర్వహణకు, సిబ్బంది వేతనాలకు భక్తులు వివిధ రూపాల్లో ఇచ్చే డబ్బునే వాడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, మతపరమైన ఉద్యోగులు అంటూ ఆలయాల్లో పనిచేసే సిబ్బందిని ప్రభుత్వం రెండు భాగాలుగా విడదీయడంతో వీరి మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. ప్రతి దేవాలయంలో ఈ విధానం నడుస్తోంది. దేవాదాయ కమిషనర్‌తో సహా ఆలయాల్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వరకు పనిచేస్తున్న వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందారు. ఆలయాల్లో పాటించాల్సిన ఆచారాలు, వ్యవహారాలు, శాస్త్రాలేవీ వీరిలో చాలా మందికి తెలియవు. ఆలయాల్లోకి వెళ్లే భక్తులకు చాలా ఆలయాల్లో ‘డ్రెస్‌కోడ్’ (హిందూ సంప్రదాయ దస్తులు ధరించడం) అమల్లో ఉంది. భక్తుల డబ్బుతో వేతనాలు, ఇతర భత్యాలు తీసుకుంటున్న సిబ్బందికి మాత్రం ఎలాంటి డ్రెస్‌కోడ్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. డ్రెస్‌కోడ్ అంటేనే వీరంతా నామోషీగా భావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి అవుతున్న వారిలో చాలా మంది బొట్టుకూడా పెట్టుకోవడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిలో కొంతమంది హిందూయేతరులు అక్రమ మార్గంలో చేరారు. వీరిగురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆలయాల్లో పనిచేసే అర్చకులు, భక్తులపై ఇఓలతో సహా ఇతర ప్రభుత్వ సిబ్బంది పేరుతో పనిచేసే వారు పెత్తనం చేసేందుకు ప్రతిక్షణం పాటుపడుతున్నారు. దేవాలయాల నుండి ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థను తొలగించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉన్నప్పటికీ, అది అమల్లోకి రావడం లేదు. వీరికి ప్రభుత్వ ఖజానా నుండి వేతనం ఇస్తున్నప్పటికీ, ఈ మేరకు డబ్బును ఆలయాల ఆదాయం నుండి ప్రభుత్వం తీసుకుంటోంది. ఆలయాలకు వచ్చే ఆదాయంలో 12 శాతం నిధులను ఈ ఉద్యోగుల వేతనాలు, ఇతర అలవెన్స్‌ల కోసం ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం పరిధిలో దాదాపు 40 శాఖలున్నాయి. ఈ శాఖల్లో పనిచేస్తున్న వారికి ప్రభుత్వమే వేతనాలు చెల్లిస్తోంది. దేవాదాయ శాఖలో పనిచేసే ప్రభుత్వ సిబ్బందికి మాత్రమే ప్రభుత్వం బడ్జెట్ నుండి వేతనాలు ఇవ్వడం లేదు. ఆలయాల ఆదాయం నుండి వేతనం చెల్లిస్తూ, ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి చేయించడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
ఆలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది, అర్చకులు కూడా తమకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆలయాల్లో పనిచేసే ప్రభుత్వ సిబ్బందికి భక్తులు ఇచ్చే డబ్బును వినియోగిస్తూ, ట్రెజరీ ద్వారా ఇస్తుండగా, తమకు అదే విధానంలో ఎందుకు చెల్లించరంటూ అర్చకులు, ఇతర ఆలయ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది కాలంగా దాదాపు ఆరువేల మంది అర్చకులు, ఇతర సిబ్బంది ఆందోళన చేస్తున్నారు. రెండు పర్యాయాలు సమ్మెకూడా చేశారు. అర్చకులు, ఆలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కెవి రమణాచారి, ఇన్‌చార్జి కమిషనర్ శివశంకర్ వద్ద పలు పర్యాయాలు సమావేశాలు జరిగినా స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం ప్రకటించలేకపోయింది. ఇప్పటికైనా తమ డిమాండ్‌కు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అర్చక సంఘం అధ్యక్షుడు భానుమూర్తి, మరో ప్రతినిధి అంబప్రసాద్ (కర్మన్‌ఘాట్ హనుమాన్ మందిర్ పూజారి) కోరారు. వారు ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ ట్రెజరీ ద్వారా వేతనాలను ఇవ్వాలని కోరుతున్నామని, అలా కాని పక్షంలో మధ్యేమార్గంలో తమ వేతనాల అంశాన్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.