తెలంగాణ

ఆదిలాబాద్ అతలాకుతలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 9: భారీ వర్షాలు, వరదలు ఆదిలాబాద్ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం కూడా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముంచెత్తిన వరద విపత్తు కారణంగా మారుమూల ప్రాంతాల ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో సోమవారం రెండు గేట్లు ఎత్తివేసి 12506 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ఈ ప్రాజెక్టులోకి 11320 క్యూసెక్కుల నీరు వచ్చిచేరగా ప్రస్తుత నీటిమట్టం 697.700 స్థాయిలో కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగా నదులు పరవళ్లు తొక్కుతుండడంతో పరిసర నదీపరివాహక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వేమనపల్లి మండలం నిల్వాయి వద్ద గొర్లపల్లివాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో మొర్ల సమ్మయ్య (59) అనే వృద్ధుడు గల్లంతయ్యాడు. సాయంత్రం వరకు ఆయన ఆచూకీ లభించలేదు. బ్యాంక్ పనికి వెళ్ళి తిరిగి వస్తుండగా వరదల్లో కొట్టుకుపోయాడని స్థానికులు తెలిపారు. ఇదిలా ఉంటే.. బెజ్జూర్ మండలంలోని ప్రాణహిత చేవెళ్ళ కెనాల్ భారీ వర్షానికి సాయంత్రం తెగిపోవడంతో సలుగుపల్లి, అడవి, తీగలవొర్రె గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సాయంత్రం పోలీసులు అష్టకష్టాలు పడ్డారు. మరోవైపు భైంసా మండలం పల్సికర్‌రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపుకు గురికావడంతో గుండెగాం గ్రామం వరద నీటిలో మునిగిపోయింది. మంత్రి జోగురామన్న, కలెక్టర్ ప్రశాంతి అక్కడికి చేరుకొని నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు. వెంటనే 35 కుటుంబాలను భైంసాలోని ఎస్సీ వసతి గృహానికి తరలించి, సహాయ చర్యలు చేపట్టారు. కనె్నపల్లి మండలం మిట్‌పల్లి పంచాయతీ పరిధిలోని దిందాస్‌పల్లి జలదిగ్బందంలో చిక్కుకుపోవడంతో 15 ఇళ్లను ఖాళీచేసి మెట్‌పల్లి ఆవాస కేంద్రానికి తరలించారు. బెజ్జూర్ మండలంలోని పెంచికల్‌పేట్ రహదారిపై తీగలవొర్రె ఉప్పొంగి ప్రవహించడంతో బస్సుల రాకపోకలు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పెంచికల్ పేట్ మండలంలోని పెద్దవాగు, లోడ్‌పల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జన్నారం మండలం ఇందన్‌పల్లి కల్వర్ట్ అప్రోచ్ రోడ్డు తెగిపోవడంతో ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది.
అంధకారంలోనే కౌటాల, బెజ్జూర్ మండలాలు
భారీ వర్షాలకు విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో 45 గ్రామాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి. బెజ్జూర్, కౌటాల, రవీంద్రనగర్ విద్యుత్ సబ్‌స్టేషన్లలో అంతరాయం కారణంగా చింతలమానెపల్లి మండలంలోని గూడెం, కేతిని, దిందా, చిత్తం, శివపల్లి, బూరుగూడ, కోయపల్లి, మాగెపల్లి, మూగవెళ్ళి, గ్రామాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి. కౌటాల, బెజ్జూర్ మండలాల్లో రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి గ్రామస్థులు ఎమ్మెల్యే కోనప్పకు విన్నవించారు. ఆదిలాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.

చిత్రం..కనె్నపల్లి మండలం దిందాస్‌పల్లి జలమయం కావడంతో సురక్షిత ప్రాంతానికి తరలివెళ్తున్న గ్రామస్థులు