తెలంగాణ

సర్పంచ్‌లకు దక్కని ‘గౌరవం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూలై 14: దేశప్రగతికి పట్టుకొమ్మలైన గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గౌరవవేతనం సక్రమంగా అందడంలేదు. బకాయి వేతనాల కోసం ప్రజాప్రతినిధులకు సైతం ఎదరుచూపులు తప్పడం లేదు. సర్పంచ్‌ల పదవీకాలం ఈనెల 31వతేదీతో ముగియనుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీ నుండి ప్రత్యేక అధికారుల పాలనకు ఆమోదం తెలుపుతూ ఆదేశాలిచ్చింది. ఈ పరిస్థితుల్లో పెండింగ్ వేతనాలు ఈలోగా వస్తాయో? రావోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. జిల్లావ్యాప్తంగా 323 మంది సర్పంచ్‌లకు ఏడు మాసాల గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2015 ఏప్రిల్ నుండి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు గౌరవవేతనం అమలుచేస్తూ జీవో నెంబర్ 53ను జారీ చేసింది. ప్రజల కోసం సేవలు అందించే ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు ఇస్తే మరింత చిత్తశుద్ధితో సేవలు అందిస్తారని భావించి ప్రభు త్వం ఈ నిర్ణయం తీసుకుంది. మేజర్, మైనర్ పంచాయతీ సర్పంచ్‌లకు ప్రతినెల రూ.5వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తామని ప్రకటించినా ఆచరణలో సక్రమంగా చెల్లింపులు జరగలేదు. సర్పంచ్‌ల వేతనాన్ని రూ. వెయ్య నుండి రూ.5వేలకు పెంచడంతో సంబురపడ్డ సర్పంచ్‌లు సక్రమంగా చెల్లించకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. గౌరవ వేతనం చెల్లించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటుచేసిన ప్రభుత్వం ప్రారంభంలో మూడు మాసాలకోరి వేతనాలు చెల్లించినా ఆ తర్వాత నెలల తరబడి పెండింగ్‌లో ఉంచి ఏడాదికోసారి చొప్పున వేతనాలు ఇచ్చినట్లు సర్పంచ్‌లు పేర్కొంటున్నారు. మరో పక్షం రోజుల్లో తమ పదవీకాలం పూర్తవుతుండడంతో పంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లుల మాట దేవుడెరుగు ప్రభుత్వం తమకు ఇచ్చే గౌరవ వేతనం సంగతి ఏమిటో తెలియని పరిస్థితి నెలకొందని పలువురు సర్పంచ్‌లు వాపోతున్నారు. పదవీకాలం పూర్తవుతుండటంతో ఆర్థికంగా ఉన్న ప్రథమ పౌరులు ఇక తమ పలుకుబడికి కాలం చెల్లుతుందని మదన పడుతుండగా అంతంత మాత్రంగా ఆర్థిక పరిస్థితులు ఉన్న సర్పంచ్‌లు పదవీకాలం ముగిసిన తర్వాత పెండింగ్ వేతనాలు ఇచ్చే అవకాశం ఉంటుందో, ఉండదోనన్న సందిగ్ధంతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే తమకు చెల్లించాలని సర్పంచ్‌లు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారిని కలిసి విన్నవించారు.
జిల్లాలో కోటిపైగా బకాయిలు
నూతనంగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాలో 323 పంచాయతీలు ఉండగా సర్పంచ్‌లకు కోటి 13లక్షల 50వేల రూపాయల బకాయిలు ఉన్నాయి. 2017 డిసెంబర్ వరకు సర్పంచ్‌ల వేతనాలను చెల్లించారు. 2018 జనవరి నుండి ఇప్పటి వరకు ఏడు మాసాల గౌరవవేతనాలు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన ఒక్కో సర్పంచ్‌కు రూ.35వేల గౌరవభృతి అందాల్సి ఉంది. కాగా సర్పంచ్‌ల గౌరవ వేతన చెల్లింపులు జిల్లాకో తీరున ఉందని, కొన్ని జిల్లాలో తక్కువ నెలలు బకాయిలు ఉండగా మరికొన్ని జిల్లాలో ఎక్కువ నెలల వేతనాలు చెల్లించాల్సి ఉందని, ఈ విధానం సరికాదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పదవీకాలం ముగిసే సమయానికి వచ్చే గౌరవభృతితో కొంతైనా తమకు ఆర్థిక వెసులుబాటు లభిస్తుందనే ఆశలో సర్పంచ్‌లు ఉన్నారు. పంచాయతీ జనరల్ అకౌంట్‌లోనే సర్పంచ్‌లకు గౌరవవేతన సొమ్మును తీసుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కాగా ఈ మొత్తాన్ని ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటు ద్వారా అకౌంట్‌లో వేస్తేనే సర్పంచ్‌లు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. తమ పదవీకాలం ముగుస్తున్న దరిమెల పెండింగ్ వేతనాలు చెల్లించి తమను ప్రభుత్వం గౌరవంగా సాగనంపాలని పలువురు సర్పంచ్‌లు కోరుతున్నారు.