తెలంగాణ

గ్రంథాలయంలో పాఠకులకు ఉచిత భోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 15: నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పాఠకుల సౌకర్యార్థం ఎంపీ కల్వకుంట్ల కవిత తన సొంత ఖర్చులతో ఉచిత భోజన వసతిని ఏర్పాటు చేయించారు. ఇప్పటికే గడిచిన ఎనిమిది మాసాలకు పైగా జిల్లా జనరల్ ఆసుపత్రిలో రోగుల బంధువులకు ఉచిత అన్నదానం కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగిస్తున్నారు. దీనికి కొనసాగింపుగా బోధన్ ఏరియా ఆసుపత్రిలోనూ ఈ సేవలను ప్రారంభించారు. ఇటీవలే ఆర్మూర్ ఏరియా ఆసుపత్రికి కూడా ఉచిత భోజన వసతి సేవలను విస్తరించగారు. తాజాగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలోనూ ఉచిత భోజన వసతికి శ్రీకారం చుడుతూ ఎంపీ కవిత తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నిజామాబాద్ పర్యటనకు హాజరైన సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ఎంపీ కవిత, ఎమ్మెల్సీలు వీ.గంగాధర్‌గౌడ్, ఫారూఖ్‌హుస్సేన్, కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావు తదితరులతో కలిసి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అనేక మంది యువతీ, యువకులు, ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు అనునిత్యం పెద్ద సంఖ్యలో సెంట్రల్ లైబ్రరీని సందర్శిస్తూ ఉదయం నుండి సాయం త్రం వరకు పుస్తక పఠనంలో నిమగ్నమవుతారు. ఈ క్రమంలో వారు ఇళ్లకు వెళ్లి భోజనం చేసేందుకు వీలుపడక పలువురు ఆకలితోనే కాలం వెళ్లదీస్తుంటారని, అలాంటి వారి కోసం ఈ ఉచిత భోజన కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఇప్పటికే ఆసుపత్రుల్లో ఉచిత భోజన పథకాన్ని అమలు చేస్తున్న ఎంపీ కవిత, గ్రంథాలయానికి కూడా తన సేవలను విస్తరింపజేయడం అభినందించదగ్గ విషయమని అన్నారు. సెంట్రల్ లైబ్రరీకి కీ.శే. డాక్టర్ సి.నారాయణరెడ్డి, దాశరథి కృష్ణమాచార్యులు వంటి మహనీయుల పేర్లు పెట్టాలనే ప్రతిపాదనలు పరిశీలించదగినవనేనని, ఈ దిశగా నిర్ణయం తీసుకుంటే మహనీయులను కూడా సముచితంగా గౌరవించినట్లవుతుందని పేర్కొన్నారు. ఎంపీ కవిత మాట్లాడుతూ, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పాఠకులకు అందించే భోజనం నాణ్యతతో పాటు ప్రతి రోజూ మెనూను కూడా పర్యవేక్షించే ఏర్పాట్లు చేశామని అన్నారు. తన సొంత పిల్లలకు భోజనం పెట్టిన తరహాలోనే గ్రంథాలయంలోనూ రుచికరమైన పౌష్టికాహారం అందించేలా నిర్వహణ కమిటీకి బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. కేవలం పాఠకులే కాకుండా మధ్యాహ్న సమయానికి లైబ్రరీకి ఎవరు వచ్చినా వారికి భోజనం అందించాలని సూచించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటు బోధన్, ఆర్మూర్‌లలోని లైబ్రరీలను కూడా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
త్వరలోనే నిజామాబాద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని భర్తీ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరతామన్నారు. గ్రంథాలయంపై అంతస్తులో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణను అందించేందుకు వీలుగా హైదరాబాద్ నుండి నిష్ణాతులైన ఫ్యాకల్టీని రప్పిస్తున్నామని అన్నారు. కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు మాట్లాడుతూ, ఉచిత భోజన సదుపాయాన్ని విద్యార్థులు, పాఠకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గ్రంథాలయం ద్వారా మరింత విజ్ఞానాన్ని సముపార్జించుకోవాలని, పోటీ పరీక్షల్లో అధిక సంఖ్యలో అభ్యర్థులు ప్రతిభను చాటుకుని తమ భవిష్యత్తుకు చక్కటి బాటలు వేసుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆకుల లలిత, కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన
సందర్భంగా పాఠకులకు భోజనం వడ్డిస్తున్న ఎంపీ కవిత