తెలంగాణ

111 ఏళ్ల తర్వాత...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: ఒకవైపు మా ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బంద్‌లు, ఆందోళనలు సాగుతుండగా, మరోవైపు జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. జూన్ రెండవ తేదీనే కొత్త జిల్లాల పేర్లు ప్రకటించాలని తొలుత భావించినా, శాస్ర్తియంగా అధ్యయనం చేసి కొత్త జిల్లాలకు రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దసరా నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి వచ్చే విధంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
కొత్త జిల్లాలపై వివిధ జిల్లాల్లో బంద్‌లు, ఆందోళనలు ముమ్మరం అయ్యాయి. దీనిని రాజకీయ అంశంగా మార్చేందుకు కొందరు ప్రయత్నిస్తుండగా, ముఖ్యమంత్రి మాత్రం పాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఆ దిశగానే అన్ని కోణాల్లో కసరత్తు సాగిస్తున్నారు. 1905 తరువాత జిల్లాల పునర్విభజనకు తనకు అవకాశం లభించిందని, హడావుడిగా కాకుండా పగడ్బందీగా జిల్లాల పునర్విభజన ఉండాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దసరాకు ఇంకా ఐదునెలల గడువు ఉంది. ఈలోగా అన్ని కోణాల్లో కసరత్తు పూర్తి చేయడం పెద్ద సమస్య ఏమీ కాదని అధికార వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ రీ ఆర్గనైజేషన్ ఆక్ట్ 1968 చట్టం ప్రకారం కొత్త జిల్లాలలను ఏర్పాటు చేస్తారు. దసరా నుంచి కొత్త జిల్లాలు అమలులోకి వస్తే 111 ఏళ్ల తరువాత తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిపినట్టు అవుతుంది.
దేశంలో వివిధ రాష్ట్రాలు జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిపినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మాత్రం చేయలేదు. గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండి, ఆంధ్రప్రదేశ్ అవతరణతో మహారాష్ట్ర, కర్నాటకలో కలిసిన ప్రాంతాలతో పాటు మొత్తం హైదరాబాద్ రాష్ట్రంలో 1905లోనే అప్పటి నిజాం రాజు జిల్లాలను పునర్విభజన చేశారు. ప్రస్తుతం తెలంగాణలోని పలు జిల్లాలు అప్పుడు రూపుదాల్చినవే. రంగారెడ్డి జిల్లాను 1978లో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నాలుగు వందల ఏళ్ల నుంచి రాజధాని నగరంగా ఉంది. మిగిలిన తెలంగాణ జిల్లాలన్నీ 1905లో జిల్లాల పునర్విభజనతో ఏర్పడినవి. అయితే వరంగల్ జిల్లా నుంచి కొంత భాగాన్ని చేర్చి కొత్తగా ఖమ్మం జిల్లాను తరువాత ఏర్పాటు చేశారు.
గతంలో సుభాలు పాలనా కేంద్రాలుగా ఉండేవి. 1905లో జిల్లాల పునర్వీభజనలో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలిపి సుభాగా వరంగల్‌ను కేంద్రంగా నిర్ణయించారు. 1905లో పరిపాలనా సౌలభ్యం కోసం నిజాం రాజు జిల్లాలను పునర్వ్యవస్థీకరించారు.
దేశంలో ప్రస్తుతం 681 జిల్లాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక్కో జిల్లా సగటు జనాభా 19లక్షలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, బెంగాల్‌లో జిల్లాల పునర్విభజన జరగక పోవడం వల్ల సగటున ఒక్కో జిల్లాలో 29 లక్షల మంది ప్రజలు ఉన్నారు. దేశంలో జిల్లాల జనాభా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. చత్తీస్‌ఘడ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో సగటున ఏడు లక్షల మంది ఒక్కో జిల్లాలో ఉన్నారు.
మహారాష్టల్రోని నాందెడ్, యవత్మాల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కలిపి 1905లో నిజాం ఆదిలాబాద్ జిల్లాను ఏర్పాటు చేశారు. తొలుత జిల్లా కేంద్రం ఆసిఫాబాద్‌లో ఉండేది. తరువాత అదిలాబాద్‌కు మారింది. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణతో ఆదిలాబాద్ జిల్లాలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్టల్రో కలపగా, ప్రస్తుతం ఉన్న ఆదిలాబాద్ ఏర్పడింది. పునర్విభజనలో భాగంగా కొత్తగా ఈ జిల్లాలోని కొన్ని ప్రాంతాలతో మంచిర్యాల పేరుతో మరో జిల్లా ఏర్పాటు చేయనున్నారు.
గతంలో కరీంనగర్‌కు ఎలగందు కేంద్రంగా ఉండేది. 1905 ఆరవ నిజాం మహబూబ్ అలీఖాన్ కరీంనగర్ కేంద్రంగా జిల్లాగా ఫర్మానా జారీ చేశారు. అప్పుడు కరీంనగర్ ఒక చిన్న గ్రామం. అంతకుముందు జిల్లాను ఎలగందు జిల్లాగా వ్యవహరించే వారు. వరంగల్ జిల్లా పరకాలలోని కొన్ని ప్రాంతాలను కరీంనగర్‌లో కలిపారు. లక్సెట్టిపేట, చెన్నూరు తాలుకాలను ఆదిలాబాద్‌లో కలిపారు. సిద్దిపేట తాలుకాను మెదక్ జిల్లాలో కలిపి అప్పటి ఏడు తాలుకాలతో కరీంనగర్ కేంద్రంగా 1905లో కరీంనగర్ జిల్లా ఏర్పడింది.
ఇక మహబూబ్‌నగర్ జిల్లా పాత పేరు పాలమూరు. నిజాం మీర్ మహబూబ్ అలీ పాషా జ్ఞాపకార్థం జిల్లా పేరును మహబూబ్‌నగర్ జిల్లాగా నిర్ణయించారు. ఈ జిల్లాలో వనపర్తి, నాగర్ కర్నూల్ పేరుతో రెండు కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయి.
నల్లగొండ జిల్లా సైతం జిల్లాల పునర్విభజనలో 1905లో ఏర్పడింది. పాత పేరు నీలగిరి. 1961 వరకు జిల్లా స్వరూపంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం భువనగిరి, లేదా యాదాద్రి పేరుతో కొత్త జిల్లా ఏర్పడే అవకాశం ఉంది.
1905లోనే నిజాం పేరుతో నిజామాబాద్ జిల్లా ఏర్పడింది. ఇప్పుడు దాదాపు అన్ని జిల్లాల్లో కొత్త జిల్లాలు ఏర్పడుతున్నా ఈ జిల్లాకు మాత్రం అలాంటి అవకాశం కనిపించడం లేదు. జిల్లా సైజు దృష్ట్యా కొత్త జిల్లా ఏర్పడే అవకాశం కనిపించడం లేదు. అయితే జిల్లాలోని కొన్ని ప్రాంతాలు కొత్తగా ఏర్పడే జిల్లాలో కలిసే అవకాశాలు ఉన్నాయి. నిజాం పాలనా కాలంలో మూడు జిల్లాలకు కేంద్రంగా సుభాగా విలసిల్లిన వరంగల్ 1953 అక్టోబర్ ఒకటిన ఏర్పడింది. ఈ జిల్లాలో కొత్తగా రెండు జిల్లాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో భూపాలపల్లి జిల్లాతో పాటు జనగామ లేదా మహబూబాబాద్ పేరుతో మరో జిల్లా ఏర్పడనుంది. నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల హైదరాబాద్ జిల్లా క్రమంగా విస్తరిస్తూ పోతోంది. 2017లో గ్రేటర్ హైదరాబాద్‌గా రూపు మార్చుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటులో హైదరాబాద్‌ను రెండు జిల్లాలుగా చేసే అవకాశం ఉంది.
తెలంగాణలోని జిల్లాల్లో అతి పిన్న వయసు గల జిల్లా రంగారెడ్డి. 1978లో ఈ జిల్లా ఏర్పడింది. పేరుకు రంగారెడ్డి జిల్లా అయినా హైదరాబాద్‌లోనే జిల్లా కేంద్రం ఉండడం వల్ల రంగారెడ్డి జిల్లా ఒక జిల్లాగా రూపు సంతరించుకోలేదు. కొత్త జిల్లాల ఏర్పాటులో వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా ఉంటుంది. ప్రస్తుతం ఖైరతాబాద్‌లో ఉన్న కలెక్టరేట్‌ను తొలగిస్తారు. వికారాబాద్‌లోనే నూతనంగా కలెక్టరేట్‌ను నిర్మించనున్నారు. 1953 అక్టోబర్‌లో ఖమ్మం జిల్లా ఏర్పడగా, ఆ తరువాత 1959 ప్రాంతంలో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న భద్రాచలం, నూగురు తాలుకాలను ఖమ్మంలో కలిపారు. రాష్ట్ర విభజన సమయంలో 46 మండలాలు ఉండగా, అనంతరం ఆంధ్రలో ఐదు మండలాలు విలీనం చేశారు. భద్రాచలం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. 1956లో వివిధ ప్రాంతాలను కలిపి సంగారెడ్డి కేంద్రంగా మెదక్ జిల్లాను ఏర్పాటు చేశారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి పేర్లతో మూడు జిల్లాలుగా జిల్లా స్వరూపం మారే అవకాశం ఉంది.