తెలంగాణ

మిగిలింది ‘ఒక్కరే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒకే ఒక్క పార్లమెంటు సభ్యుడు మల్లారెడ్డి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించడంతో, ఇక ఆ పార్టీ ఉనికి కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మల్కాజిగిరి పార్లమెంటుసభ్యుడు మల్లారెడ్డి మహానాడు ముగిసిన రెండోరోజునే పార్టీ ఫిరాయించి టిడిపికి షాక్ ఇచ్చారు.చివరిరోజున పార్టీకి విరాళం ఇచ్చి, బాబుతో ఫొటో కూడా దిగిన మల్లారెడ్డి, హైదరాబాద్ వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరటం పార్టీ నేతలు ఖంగుతినిపించింది. గతంలో ఇదేవిధంగా బాబు సమక్షంలో జరిగిన టిటిడిపి విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యేలు.. అది ముగియకుండానే బయటకు వచ్చి, నేరుగా కేసీఆర్ వద్దకు వెళ్లి టీఆర్‌ఎస్ తీర్థం తీసుకోవడం టిడిపి నాయకత్వాన్ని విస్మయపరిచింది.
తాజాగా పార్టీకి ఉన్న ఒకే ఒక్క పార్లమెంటుసభ్యుడయిన మల్లారెడ్డి కూడా ఫిరాయించడంతో, ఇక లోక్‌సభలో టిటిడిపికి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. నిజానికి మల్కాజిగిరిలో కేసీఆర్ హాజరైన సభలో కేసీఆర్ సీఎం కావడం తెలంగాణ ప్రజల అదృష్టమని మల్లారెడ్డి బహిరంగంగా మాట్లాడినప్పుడే త్వరలో ఒక వికెట్ పోవడం ఖాయమన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపించాయి.
దీంతో ఇక పార్లమెంటులో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ఒక్కరే మిగిలినట్టయింది. సాంకేతికంగా అయితే దేవేందర్‌గౌడ్ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, నాయకత్వ విధానాలపై అసంతృప్తితో ఆయన చాలాకాలం నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. చివరకు పొలిట్‌బ్యూరోసమావేశాలు, పార్టీ ఆఫీసుకు రావటం లేదు. చివరకు మహానాడు కార్యక్రమాలకూ హాజరుకాలేదు. తనయుడు వీరేందర్‌గౌడ్ మాత్రం తెలుగుయువత అధ్యక్షుడిగా చురుకుగా పాల్గొంటున్నారు. చివరకు బాబు ఢిల్లీ వచ్చినా దేవేందర్ గౌడ్ ఆయనను కలుస్తున్న సందర్భాలు లేవు. మరో రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆమె పదవీకాలం కూడా ముగియనుంది. ఆమె కూడా ఇప్పటివరకూ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్న దాఖలాలు లేవు. ఇక రాజ్యసభలో మిగిలిన సభ్యుడు గరికపాటి మోహన్‌రావు ఒక్కరే చురుకుగా పాల్గొంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఆయనొక్కరే పెద్దదిక్కుగా మారారు. బాబుకు అత్యంత సన్నిహితుడు, ఆయన కుటుంబానికి విశ్వాసాత్రుడు, పార్టీ నిర్వహించే భారీ కార్యక్రమాలను ఆయనే ముందుండి నడిపిస్తున్నారు.
అసెంబ్లీలో కూడా రాజకీయంగా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. 15 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించగా, రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఆర్.కృష్ణయ్య ముగ్గురే పార్టీకి మిగిలారు. వీరిలో ఆర్.కృష్ణయ్య చాలా కాలం నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, బీసీ ఉద్యమాలపైనే దృష్టి సారిస్తున్నారు. కాబట్టి, కృష్ణయ్య పార్టీలో ఉన్నా లేనట్టే లెక్క.
అదేవిధంగా మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరిస్థితి కూడా సందేహంగా ఉందని చాలాకాలం నుంచి పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పాలేరు ఉప ఎన్నిక ముందు చేరికపై వచ్చిన పార్టీ మార్పు వార్తలపై మాత్రం ఆ స్థాయిలో ఖండించలేదు. పైగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మాత్రమే చెప్పడంతో పార్టీ వర్గాలు ఇప్పటికీ సందేహంలోనే ఉన్నాయి. ఓటుకునోటు కేసులో ఆయన ముద్దాయిగా ఉన్నందుకే, టీఆర్‌ఎస్ నాయకత్వం కొద్దిగా వెనుకంజవేస్తోందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆయన కొనసాగినా, పెద్దగా చురుకైన పాత్ర పోషించే అవకాశాలు లేవు. ఇక మిగిలిన రేవంత్‌రెడ్డి పార్టీకి ఏకైక దిక్కుగా మారారు. అసెంబ్లీలో, బయట ఆయనొక్కరే కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ప్రతిపక్షమంతా వౌనంగా ఉంటే రేవంత్ ఒక్కరే ధైర్యంగా సర్కారును సవాల్ చేయగలుతున్నారు. ప్రస్తుతం టిడిపి నాయకత్వం కూడా ఈ విషయంలో రేవంత్‌రెడ్డి ఒక్కరిమీదే ఆశలు పెట్టుకుంది. మాస్ ఫాలోయింగ్ ఉన్న రేవంత్.. నిర్జీవంగా మారిన టిడిపికి మళ్లీ జీవం పోసి, వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు సాధించగలరన్న ఆశలు పెట్టుకుంది.

chitram రేవంత్‌రెడ్డి