తెలంగాణ

కొట్టుకుపోయిన కూటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 11: అన్ని రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తూ హోరాహోరీగా తలపడిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ మరోమారు తన ప్రభంజనాన్ని చాటింది. గత 2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను మరోమారు పునరావృతం చేస్తూ ఇంచుమించు అదే స్థాయిలో విజయకేతనాన్ని ఎగురవేసింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు గాను అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఎనిమిది నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మాత్రమే మహాకూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జాజాల సురేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మిగతా అన్ని సెగ్మెంట్ల నుండి తాజామాజీలే తిరిగి శాసనసభ్యులుగా గెలుపొందారు. బాన్సువాడ సెగ్మెంట్ నుండి ఆపద్ధర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాసుల బాల్‌రాజ్‌పై 18,697 ఓట్ల ఆధిక్యతతో విజయాన్ని నమోదు చేయగా, బాల్కొండ నియోజకవర్గం నుండి వేముల ప్రశాంత్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థిగా నిలిచిన బీఎస్పీ అభ్యర్థి ముత్యాల సునీల్‌పై 32,459 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బాల్కొండ సెగ్మెంట్‌లో మహాకూటమి పక్షాన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈరవత్రి అనిల్ మూడవ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డిపై తెరాస తాజామాజీ ఎమ్మెల్యే షకీల్‌ఆమిర్ 8262ఓట్లతో విజయం సాధించగా, ఆర్మూర్ సెగ్మెంట్ నుండి ఆశన్నగారి జీవన్‌రెడ్డి 29,132ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆకుల లలితను ఓడించారు. నిజామాబాద్ అర్బన్‌లో తెరాస అభ్యర్థి బిగాల గణేష్‌గుప్తా తన సమీప ప్రత్యర్థిగా నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి తాహెర్‌బిన్ హందాన్‌పై 26,055ఓట్ల ఆధిక్యతతో, రూరల్‌లో తాజామాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తన సమీప ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూపతిరెడ్డిపై 29,855ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నువ్వానేనా అన్న రీతిలో కొనసాగిన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి గంప గోవర్ధన్ స్వల్పంగా 4468 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థిగా నిలిచిన మండలి విపక్ష నేత షబ్బీర్‌అలీపై విజయం సాధించారు. ఎస్సీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్ అయిన జుక్కల్ నియోజకవర్గం నుండి తాజామాజీ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా 35,625ఓట్ల ఆధిక్యంతో విజయదుందుభి మోగించగా, ఆయన సమీప ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి గంగారాం రెండవ స్థానానికి, బీజేపీ తరఫున బరిలో నిలిచిన మాజీ ఎమ్మెల్యే అరుణతార మూడవ స్థానానికి పరిమితం అయ్యారు. ఇక ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ తరఫున ఏకైక ఎమ్మెల్యేగా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి జాజాల సురేందర్ విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డిపై 35,140 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు అసలే ప్రాతినిథ్యం దక్కకపోగా, ఈసారి కనీసం ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండైనా విజయం లభించడం ఆ పార్టీకి స్వల్ప ఊరటనందించింది. జాజాల సురేందర్ మినహా మహాకూటమి తరఫున అదృష్టాన్ని పరీక్షించుకున్న కాంగ్రెస్ హేమాహేమీలు షబ్బీర్‌అలీ, సుదర్శన్‌రెడ్డి, ఆకుల లలిత, ఈరవత్రి అనిల్, గంగారాం తదితరులంతా తెరాస సునామీలో కొట్టుకుపోయారు.