రాష్ట్రీయం

హాస్టళ్లలో జాడలేని బయోమెట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 25: విద్యార్థుల సంక్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వ వసతిగృహాల్లో ఏర్పాటుచేసిన బయోమెట్రిక్ విధానం ఆరంభశూరత్వంగానే మారింది. ఆదిలో దీని అమలుపై అధికారయంత్రాంగం ప్రత్యేక శ్రద్దచూపినా, అనంతరకాలంలోఅంతగా పట్టించుకోకపోవటంతో అత్యధిక హాస్టళ్ళలోని సిబ్బంది ఈవిధానాన్ని అటకెక్కించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హాస్టల్ విద్యార్థులకోసం అందిస్తున్న పలు సౌకర్యాలు వారికి అందటంలేదనే భావనతో ఉమ్మడి రాష్ట్రంలోఅప్పటి సంక్షేమశాఖ కార్యదర్శి రేమండ్‌పీటర్ హాస్టళ్ళలో బయోమెట్రిక్ విధానం అమలుకు శ్రీకారం చుట్టారు. దీనిని 23జిల్లాల్లో అమలుచేసేందుకు తగిన నిధులు కూడా విడుదల చేయటంలో కీలకపాత్ర పోషించారు. బయోమెట్రిక్ విధానానికి సంబంధించిన లాప్‌టాప్,సిసిటివి కెమెరాలు, థంబింగ్ మెషిన్లు కూడా జిల్లాలవారీగా సరఫరాచేసి, ముందుగా ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ళలో ఏర్పాటుచేసేందుకు కసరత్తు చేశారు. ఈలోపు రాష్ట్ర విభజన జరగటం, సంక్షేమశాఖ విడిపోవటంతో గత ఆర్దిక ఏడాదిలో ఈవిధానం అమలుచేయటానికి అవాంతరంగా మారింది. అయితే, దీని అమలుకోసం విడుదల చేసిన నిధులు రెండు రాష్ట్రాలు పంచుకోగా తెలంగాణకు రూ.20కోట్లు వచ్చాయి. ఈమొత్తంతో రాష్ట్రంలోని 10జిల్లాల్లోని 1134 ఎస్సీ, ఎస్టీ వసతిగృహాల్లో విధిగా అమలుచేసేలా ఆర్దికమంత్రి ఈటెల రాజేందర్ ప్రత్యేకంగా చొరవతీసుకున్నారు. ఇందుకోసం హాస్టళ్ళవార్డెన్లకు లాప్‌టాప్, థంబింగ్ మిషన్ల వినియోగంపై విడతల వారీగా శిక్షణ కూడా ఇచ్చారు.
అనంతరం దీనిని అమలుచేస్తున్నట్లు అన్ని జిల్లాలనుంచి ప్రకటనలు కూడా వచ్చినా, ఇది ఆరంభశూరత్వంగానే మిగిలింది. ఈవిధానం అమల్లోకి వస్తే ప్రతి విద్యార్థి రోజు రెండుసార్లు థంబింగ్‌చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి సరుకులు వినియోగించాల్సి ఉంటుంది. ఈవిధానం సక్రమంగా అమలైతే ప్రభుత్వానికి ఏటా రూ.40నుంచి రూ.55కోట్ల వరకు ఆదా అవుతుందని గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. వసతిగృహాల అధికారులు ఇష్టారాజ్యంగా సరుకులను వినియోగించే అవకాశం ఉండదు. దీంతో గతంలో మాదిరి అదనపు రాబడి లేకపోగా, నిత్యం హాస్టళ్ళ పర్యవేక్షణ తప్పనిసరిగా మారింది. దీంతో బయోమెట్రిక్‌లో సాంకేతికలోపాలు సృష్టించి వాటిని అటకెక్కిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. దీనిని పసిగట్టిన అవినీతినిరోధకశాఖ అధికారులు రాష్ట్రంలోని పలు హాస్టళ్ళపై అకస్మికదాడులు చేసి లోపాలు గుర్తించారు. అవకతవకలపై ఆయా జిల్లాల కలెక్టర్లకు కూడా నివేదికలందించారు. దీనిపై స్పందించాల్సింది పోయి బిసి సంక్షేమ హాస్టళ్ళలో కూడా అమలుకు కావాల్సిన నిధులు విడుదల చేయాలంటూ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. ఓవైపు ఇప్పటికే ఏర్పాటుచేసిన మిషన్లు నిరుపయోగంగా మారుతుంటే, మరోవైపు కొత్తగా అవసరమంటూ ప్రతిపాదనలు పంపటం నిధుల దుర్వినియోగానికే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.