తెలంగాణ

‘పథకాలు’ ఫలించేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: వరంగల్ ఘన విజయంతో ఊపుమీదున్న తెరాస, రాజధాని గుండె గ్రేటర్‌పై దృష్టిపెట్టింది. జిహెచ్‌ఎంసి ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్న తెరాస, ఇప్పటికే నగరవ్యాప్తగా ప్రభుత్వ పథకాలతో భారీ హోర్డింగ్‌లు ఏర్పాటుచేసి ప్రచారం మొదలుపెట్టింది. సగటున ప్రతి మూడు కుటుంబాల్లో ఒక కుటుంబానికి ఆసరా పథకం కింద నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ అందుతోంది. తెరాసకు ఈ పథకం ఓటు బ్యాంకుగా మారుతుందని ఆ పార్టీ నేతలు విశ్వాసంతో ఉన్నారు. వరంగల్‌లో ఇది పని చేసిందని, ఆ స్థాయిలో కాకున్నా హైదరాబాద్‌లోనూ పథకం పారుతుందని తెరాస నేతలు ఆశిస్తున్నారు. విపక్షాలు ఎంత ప్రచారం చేసినా వరంగల్‌లో తాము ఊహించిన దానికన్నా ఎక్కువ మెజారిటీ రావడంతో, తెరాస శ్రేణులు హైదరాబాద్ ఎన్నికలకు ఉత్సాహంగా సిద్ధమయ్యారు. మిషన్ హైదరాబాద్ పేరిట ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రచారం ప్రారంభించారు. ఆసరా పెన్షన్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం, ఉద్యోగాల నియామకం, కోతలు లేని విద్యుత్, శాంతిభద్రతల పరిరక్షణ, షీ టీమ్స్ ఏర్పాటు వంటివి గ్రేటర్‌లో తెరాస పట్టు సాధించేందుకు ఉపయోగపడతాయని పార్టీ నేతలు చెబుతున్నారు. 20వేల కోట్ల రూపాయల వ్యయంతో విశ్వనగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు రూపొందించిన పథకాలకు సంబంధించి పనులను వేగంగా ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. జనవరి 30నాటికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని ఇప్పటికే సిఎం ప్రకటించారు. కోర్టుకు సైతం ఇదే విషయం తెలిపారు. డిసెంబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితేనే, జనవరి 30నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్‌లోనే హైదరాబాద్ నగరానికి సంబంధించిన కీలక పథకాల శంకుస్థాపనలు చేపట్టాలని నిర్ణయించారు. గోదావరి జలాల తరలింపునకు సైతం ప్రభుత్వం ప్రచారం కల్పిస్తోంది. గోదావరి జలాలు నగరానికి చేరుకోవడంతో గ్రేటర్ నీటి సమస్య చాలా వరకు తీరినట్టే.
అయితే మొదటి నుంచి హైదరాబాద్‌లో తెరాస పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం వల్ల గెలుపు కోసం పథకాలపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. నగరానికి చెందిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, టి పద్మారావు గౌడ్‌లు నగరంలో రోజుకు రెండు మూడు శంకుస్థాపనలు జరుపుతున్నారు. ఐడిహెచ్ కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం పూర్తికావడం వల్ల చాలామందిలో ఆశలు రేకెత్తాయి.
అయితే వరంగల్ వేరు హైదరాబాద్ వేరని, సర్వశక్తులు ఒడ్డి పోరాడాల్సి ఉంటుందని తెరాస నేతలే అంటున్నారు.
మరోవైపు వరంగల్ ఫలితాలతో డీలా పడిన తెదేపా, బిజెపిలు హైదరాబాద్ ఫలితాలతో కోలుకుంటామనే ఆశతో ఉన్నారు. పొరుగు రాష్ట్రానికి చెందిన ఓటర్లు హైదరాబాద్‌లో పెద్దసంఖ్యలో ఉన్నారని, వీరి మద్దతు తెదేపా, బిజెపి కూటమికే ఉంటుందనే ధీమాతో ఆ పార్టీ నేతలున్నారు.
ఇక తెలంగాణ ఇచ్చామనే సంతోషం లేకుండా కాంగ్రెస్‌కు వరస పరాజయాలు తప్పడం లేదు. తెదేపా, భాజపా కూటమిలానే కాంగ్రెస్ సైతం ఇతర రాష్ట్రాల ఓటర్లపై ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. అయితే మొదటి నుంచీ హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్‌కు పట్టుండటంతో గెలుపుపై ఆశలతో ఉన్నారు. వైఎస్సార్ మరణం తరువాత రోశయ్య సిఎంగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లోనూ గ్రేటర్‌లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించింది. ఎంఐఎంతో కలిసి మేయర్ స్థానాన్ని చెరి రెండున్నరేళ్లపాటు పంచుకున్నారు. తెదేపా కోసం ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తెదేపా, భాజపా కూటమికి వేస్తే బిజెపి కోసం ఉత్తరాది ఓటర్లు ఈ కూటమికి ఓట్లు వేస్తారనే నమ్మకంతో ఆ రెండు పార్టీలున్నాయి. రాష్ట్రం ఏదైనా ప్రభుత్వం చేపట్టిన పథకాల వల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఏంతోకొంత శాతం తమను ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నట్టు తెరాస నేతలు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం పథకాల అమలు ద్వారా పరోక్షంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నా, డిసెంబర్ నుంచి అన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నాయి. ఎప్పటి మాదిరిగానే ఎంఐఎం ఈసారీ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకుంది. సాధారణంగా ఎంఐఎం ఎన్నికలకు ముందు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు. ఎన్నికల తరువాతనే పొత్తులు కుదుర్చుకుంటుంది. గతంలో కాంగ్రెస్‌తో సైతం ఇదేవిధంగా ఎన్నికల తరువాత పొత్తు కుదుర్చుకుంది.