తెలంగాణ

ఐక్యత చాటిన సీఎం దత్తత గ్రామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 13: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు దత్తత తీసుకున్న నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని మోతె గ్రామంలో సర్పంచ్ సహా వార్డు మెంబర్ స్థానాలన్నీ ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మోతె గ్రామానికి ప్రభుత్వం ప్రకటించిన పది లక్షల రూపాయల ప్రత్యేక నజరానా అందనుంది. తొలివిడత ఎన్నికలు జరుగుతున్న ఆర్మూర్ డివిజన్ పరిధిలోని మోతె గ్రామంలో సర్పంచ్ స్థానాన్ని ఆశిస్తూ పలువురు పోటీలో నిలిచినప్పటికీ, ఆదివారం నాటి నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసే నాటికి ఒక్క నామినేషన్ మాత్రమే మిగిలింది. దీంతో బరిలో మిగిలిన రజిత మోతె గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెతో పాటు మిగతా వార్డు స్థానాలను కూడా గ్రామ కమిటీ చొరవతో ఏకగ్రీవంగా ఎన్నుకుని, అందరి ఆమోదంతో ఉప సర్పంచ్ ఎన్నికను కూడా ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. గ్రామ ఉప సర్పంచ్‌గా కళ్లెం రాజేష్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఏకగ్రీవాలు చేసుకుని ఆదర్శంగా నిలిచిన మోతె గ్రామంపై కేసీఆర్ వరాల జల్లులు కురిపిస్తారని స్థానికులు ఆశిస్తున్నారు. వాస్తవంగానే మొదటి నుంచీ మలివిడత తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ చేపట్టడానికి ముందు మోతె గ్రామాన్ని సందర్శించి ఇక్కడి మట్టిని ముడుపుగా కట్టుకుని తీసుకెళ్లడం జరిగింది.
ప్రత్యేక రాష్ట్రం సాధించిన తరువాతే ఈ ముడుపు చెల్లించుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు 2014లో తెలంగాణ ఆవిర్భావం జరిగిన మీదట కేసీఆర్ ప్రత్యేకంగా మోతె గ్రామాన్ని సందర్శించి తన ముడుపును చెల్లించుకోవడం జరిగింది. ఈ పల్లెను తానే స్వయంగా దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించి ఇప్పటికే పలు ప్రగతి పనుల కోసం పెద్దఎత్తున నిధులను మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ గ్రామంలో సర్పంచ్ సహా అన్ని వార్డు స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో మోతె అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.