తెలంగాణ

పులుల సంరక్షణలో వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జనవరి 13: అడవి రాజుకు ఆపదొచ్చింది. పెద్దపులి పేరు చెబితేనే గజ గజ వణికిపోయే రోజులు పోయాయి. అడవిలో మనుషుల్ని చూసి ఏకంగా పెద్దపులులే భయపడి పారిపోవాల్సిన పరిస్థితులు కళ్లెదుటే సాక్షాత్కరిస్తున్నాయి. ఇందుకు కారణం ఇటీవలే ఆదిలాబాద్ జిల్లా టైగర్ జోన్ పరిధిలోని పెంబి అటవీ ప్రాంతంలో కరెంట్ తీగలు అమర్చి పక్కావ్యూహంతో పెద్దపులిని హతమార్చి, పులి చర్మాన్ని విక్రయిస్తూ అడ్డంగా దొరికిపోయిన సంఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఏడాదిన్నర కాలంలోనే ఆదిలాబాద్ జిల్లాలో వేటగాళ్ళ ఉచ్చుకు రెండు పెద్దపులులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇందుకు బాధ్యులైన నలుగురు అటవీ అధికారులను సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయడం గమనార్హం. మరోవైపు కలప స్మగ్లింగ్ ప్రతి రోజూ ఆదిలాబాద్ జిల్లా నుంచి సాగుతోంది. అటవీ సిబ్బంది, అధికారులు లోపాయికారిగా కలప స్మగ్లర్లు, వేటగాళ్ళతో కుమ్మక్కై అటవీ సంపదను కొల్లగొడుతున్నారని స్పష్టమవుతోంది. పొరుగు మహారాష్టల్రో గల తాడోబ, ప్రాణహిత టైగర్‌జోన్ పరిధి నుంచి పెద్దపులులు ఈ జిల్లా అటవీ ప్రాంతానికి వస్తూ తలదాచుకునేవి కాగా ఇక్కడ అధికారులు సంరక్షణపై నిర్లక్ష్యం చూపడం, వేటగాళ్ళకు భయపడి ఈ జిల్లా నుంచి పులులు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నట్లు బయటపడింది. 2014లో పులుల గణన జరగగా కవ్వాల్‌లో రెండు, కాగజ్‌నగర్‌లో అటవీ డివిజన్‌లో 6 పెద్ద పులులు ఉన్నట్లు గుర్తించారు. 2018లో చేపట్టిన జంతు గణనలో 5 పులులు మాత్రమే ఉన్నట్లు నిర్దారణకు వచ్చారు. కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో 6 పులులు ఉన్నట్లు గుర్తించగా ప్రస్తుతం మాత్రం 4 పులులే ఉన్నట్లు అధికారులు తేల్చిచెబుతున్నారు. వీటికి జన్మించిన నాలుగు పులి పిల్లలు ఏడాదికాలానికి ప్రాణహిత దాటి చంద్రపూర్ జిల్లాలోకి వెళ్ళినట్లు అటవీ అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల అడవుల్లో సీసీ కెమెరాలు అమర్చగా కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్‌లోని ఖానాపూర్ రేంజ్ సోమార్‌పేట్ వద్ద పెద్దపులి అడుగు జాడలు బయటపడ్డాయి. నిర్మల్, ఖానాపూర్ రహదారిపై ఒక పులి, ఇటీవల ఇందన్‌పెల్లి రేంజ్ కవ్వాల్ రేంజ్ పరిధిలో మరో పెద్దపులి సంచరిస్తూ అటవీ శాఖ అమర్చిన సీసీ కెమెరాల్లో చిక్కడం గమనార్హం. అయితే వారం రోజుల కిందటా కడెం మండలం పాండ్వపూర్ అడవిలో మేకల మందపై దాడిచేసిన పెద్దపులి ఛాయలను గుర్తించిన వేటగాళ్ళు 8.5 మీటర్ల పొడవున కరెంట్ తీగలను అమర్చి దప్పిక తీర్చుకునేందుకు వెళ్తున్న పులిని మాటువేసి హతమార్చారు. కరెంట్ తీగలతో చనిపోయిన పులి నుండి చర్మాన్ని తొలిచి రూ.25లక్షలకు విక్రయించేందుకు ఇచ్చోడలో బేరం ఆడుతూ గుగ్లావత్ ప్రకాష్ అనే నిందితుడు పట్టుబడ్డాడు. నీలుగాయిని వేటాడి మాంసం విక్రయిస్తున్న కేసులో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు.
కలప స్మగ్లర్లపై పీడీయాక్ట్‌కు రంగం సిద్ధం
కోట్లాది రూపాయల విలువైన కలపను స్మగ్లింగ్ చేస్తూ అటవీ సంపదను కొల్లగొడుతున్న కరడుగట్టిన స్మగ్లర్లపై పీడీయాక్ట్ కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. స్మగ్లింగ్ చేస్తూ కేసులు నమోదైన 12 మంది కలప స్మగ్లర్లపై పీడీ కేసులు నమోదు చేయనున్నామని డీఎఫ్‌వో ప్రభాకర్ తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో 18 మంది కలప స్మగ్లర్లు, మంచిర్యాల జిల్లాలో 12 మంది, నిర్మల్ జిల్లాలో 18 మందిపై పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసేలా పోలీసు, అటవీ శాఖ ప్రణాళిక రూపొందించింది.