తెలంగాణ

మొక్కులు తీర్చని సర్కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: తెలంగాణ ప్రభుత్వం నెరవేరని హామీల్లో సిఎం మొక్కులు కూడా చేరిపోయాయి. తెలంగాణ ఏర్పడితే ప్రభుత్వం తరఫున రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రలోని ప్రసిద్ధ దేవాలయాల్లో మొక్కులు, కానుకలు సమర్పించుకుంటామని రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలోనే కెసిఆర్ మొక్కుకున్నారు. ఆయన మొక్కుకున్నట్టే తెలంగాణ ఆవిర్భావంతోపాటు, తెరాస సర్కారే అధికారంలోకి రావడంతో తన మొక్కుల విషయాన్ని బయటపెట్టారు. మొక్కులు తీర్చుకునేందుకు ఏడాది కిందటే ఫిబ్రవరి 24, 2015లోనే జీవో జారీ చేసి, నగల తయారీ కోసం రూ.5.59 కోట్లు విడుదల చేసింది. మూడు నెలల్లో నగలు తయారుచేసి ఇవ్వాల్సిందిగా తయారీ సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం విధించిన గడువులోగానే నగలన్నీ తయారయ్యాయి. చివరిగా ఆరు నెలల కిందట తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరునికి సమర్పించనున్న నగలను తయారు చేసిన కోయంబత్తూరుకు చెందిన సంస్థ తితిదేకు అప్పగించింది. అయితే సిఎం డిసెంబర్‌లో అయుత చండీయాగాన్ని నిర్వహించడంతో అది పూరె్తైన తర్వాత మొక్కులు చెల్లించుకుంటారని అధికారులు భావించారు. యాగం ముగిసాక వచ్చిన ఉప ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు, తర్వాత బడ్జెట్ సమావేశాలు, తర్వాత పార్టీ ప్లీనరీ, పాలేరు ఉప ఎన్నికలు తదితర వాటిలో సిఎం బిజీగా ఉండటంతో మొక్కుల చెల్లింపు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. తెలంగాణ ఏర్పడి రెండేళ్లు గడిచిన సందర్భంగా రాష్ట్రావతరణ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించినప్పటికీ, మొక్కులను మాత్రం చెల్లించలేకపోయింది. నగలు తయారై సిద్ధంగా ఉన్నాయి, వాటిని సమర్పించేందుకు ఎప్పుడు వస్తారని తితిదే అధికారులు సిఎం కార్యాలయాన్ని సంప్రదిస్తున్నా, ఎప్పటికప్పుడు వాయిదాలతో నెట్టుకొస్తోందని తెలిసింది. మొక్కులను వాయిదా వేయడం మంచిది కాదని సిఎంకు చెప్పలేకపోతున్నామని అధికారులు వాపోతున్నారు.
ఏయే మొక్కులు?
తెలంగాణ ప్రభుత్వం మొక్కులకోసం రూ.5 కోట్ల 59 లక్షలను ఖర్చు చేసింది. వీటిలో తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరునికి శ్రీ మూలవర్ల కమలం నమూనా బంగారు శాలిగ్రామ హారం, ఐదు పేటల కంఠాభరణం, పద్మావతి అమ్మవారికి, విజయవాడ కనుకదుర్గ అమ్మవారికి 15 గ్రాముల చొప్పున ముక్కు పుడకల కోసం రూ.45 వేల చొప్పున కేటాయించింది. అలాగే వరంగల్‌లోని భద్రకాళీ అమ్మవారికి రెండు కేజీలతో బంగారు కిరీటం తయారు చేయడానికి రూ.57 లక్షలు ఖర్చు చేసింది. అదే జిల్లాలోని కురవి వీరభద్ర స్వామికి 25 గ్రాముల బంగారు మీసాలను సమర్పించడానికి రూ.75 వేలు ఖర్చు చేసింది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి నగలు తయారు చేసినప్పటికీ మొక్కులు చెల్లించడంలో జాప్యం ఎందుకని అధికార వర్గాలు వాపోతున్నాయి.