తెలంగాణ

రోడ్డెక్కిన వేరుశనగ రైతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 22: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో పని చేస్తున్న చాటకూలీలు గురువారం సాయంత్రం నుంచి విధులకు హాజరుకాకపోవడంతో మార్కెట్‌యార్డులోనే వేరుశనగ కుప్పలుగా పడి ఉన్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలేదని, అధికారులు, వ్యాపారులు కుమ్మక్కు కావడంతో అతి తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. తక్కువ ధరకు అమ్ముకుంటున్న పరిస్థితులు నెలకొనివున్నప్పటికీ అడుగడుగునా ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలువురు రైతులు వాపోతున్నారు. సిండికేట్‌గా ఏర్పడిన వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తుండగా, కొనుగోలు చేసిన కుప్పలను సంచులలో నింపేందుకు చాటకూలీలు పని చేస్తున్నారు. స్థానిక మార్కెట్‌యార్డులో 36 కాంటాలు ఉండగా ఒక్కొక్క కాంటవద్ద ఆరుగురు మహిళలు చాట కూలీలుగా పని చేస్తున్నారు. వీరు ఒక సంచి నింపితే ఒక రూపాయి ఇవ్వడం జరుగుతుంది, ఇది సరిపోవడంలేదని గత కొన్ని రోజులనుంచి అధికారులకు, వ్యాపారులకు విన్నవించుకుంటున్నా పట్టించుకోవడంలేదని చాట కూలీలు వాపోయారు. కూలీ గిట్టుబాటు కాకపోవడంతో రైతులు తెచ్చిన ఒక్కొక్క కుప్ప వద్ద మూడు, నాలుగు చాటలు తీసుకొని కుప్పగా పోసి అమ్ముకొని వచ్చిన సొమ్మును పంచుకుంటున్నామని వారు తెలిపారు. ఇదే మాదిరిగా గురువారం సాయంత్రం రైతులవద్ద తీసుకున్న వేరుశనగను కుప్పగా పోయగా, మార్కెటింగ్ అధికారి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలా కుప్పగా వేయడం సరికాదంటూ దానిని ఎత్తివేసి మా నోట్లో మట్టివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఇచ్చే డబ్బులను పెంచాలని, గుర్తింపుకార్డులు ఇవ్వాలని తదితర డిమాండ్లతో గురువారం సాయంత్రం నుంచి విధులకు హాజరుకావడంలేదు. దీనితో మార్కెట్‌లో అమ్మకానికి గురైన వేరుశనగను సంచులలో నింపకపోవడంతో అవి అలాగే ఉండిపోయాయి. దీనితో ఆగ్రహించిన రైతులు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులను నచ్చచెప్పి మార్కెట్‌యార్డు కార్యాలయం వద్దకు తోలుకొని పోయి చర్చలు కొనసాగించారు. మార్కెట్ కార్యదర్శి వచ్చి రైతులతో మాట్లాడగా తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. చాట కూలీలు అందుబాటులో లేరని, వారితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పగా, రైతులు సాయంత్రం వరకు సమస్య పరిష్కారం కాలేదు. రైతులు తెచ్చిన వేరుశనగ కుప్పలు అలాగే మార్కెట్‌లోనే ఉండిపోగా వాటిపై కవర్లను కప్పి రైతులు మార్కెట్‌లోనే ఉండిపోయారు. గత రెండు రోజుల నుంచి మార్కెట్‌లోనే జాగరణ చేయాల్సిన పరిస్థితి నెలకొందని, మాగోడును పట్టించుకునే వారే కరువయ్యారని వారు వాపోయారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.