తెలంగాణ

‘ప్రాదేశిక’ పోరుకు భారీ ఖర్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 21: మండల, జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల కోసం ఎంతో ఆసక్తితో ఎదురుతెన్నులు చూసిన ఆశావహులు, ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం వెలువరించిన షెడ్యూల్‌ను చూసి ఒకింత ఆందోళన చెందుతున్నారు. విడతల వారీగా నిర్వహిస్తున్న ఈ ఎన్నికల ప్రక్రియతో తమకు ఖర్చు తడిసిమోపెడవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి రెండు, మూడవ దశల్లో పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లకు చెందిన అభ్యర్థులపై ఎన్నికల ప్రచార ఆర్భాటం ఖర్చు పెను ఆర్థిక భారాన్ని మోపనుందని స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవలే ఇదే తరహాలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో తుది విడత పోలింగ్ జరిగిన గ్రామాలలో అభ్యర్థులు గెలుపు తీరాలకు చేరేందుకు పెద్ద మొత్తంలోనే పైకాన్ని ఖర్చు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్రాదేశిక పోరును కూడా మూడు విడతల్లో నిర్వహించాలని నిర్ణయించిన దరిమిలా, మలి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల ఆశావహులు ఖర్చు విషయంలో లెక్కలు వేసుకుంటున్నారు. తొలివిడతగా నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ ఎన్నికలకు సంబంధించి సోమవారం నోటిఫికేషన్ వెలువరించనుండగా, మే 5వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక చివరి విడతగా ఎంపిక చేసిన ఆర్మూర్ డివిజన్‌లో మే 14వ తేదీన పోలింగ్ జరుగనుంది. అంటే దాదాపు పది రోజుల పాటు ఎన్నికల ప్రచార హంగామా ఖర్చును తుది విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల అభ్యర్థులు భరించాల్సి ఉంటుందని స్పష్టమవుతోంది. మూడు విడతల్లోనూ వేర్వేరుగా నోటిఫికేషన్‌లు వెలువరిస్తున్నప్పటికీ, ఎన్నికల షెడ్యూల్ రాకముందే పల్లెల్లో ప్రాదేశిక సందడి నెలకొంది. దీంతో రెండు, మూడవ విడతలో పోటీ చేసే అభ్యర్థులు పోలింగ్ సమయం వరకు గెలుపు కోసం ముమ్మర ప్రచారం నిర్వహిస్తూ భారీ మొత్తంలోనే చేతిచమురును విదిలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసిన అనంతరం బరిలో నిలిచే అభ్యర్థులెవరన్నది ఖరారవుతుంది. అప్పటి నుండి పోలింగ్ ముగిసేంత వరకు కూడా అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తూ, ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులొడ్డాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు, మూడవ విడత పరిషత్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని అభ్యర్థులు ఖర్చును తల్చుకుని ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్నది బేరీజు వేసుకునే పనిలో పడ్డారు. ప్రస్తుత ఎన్నికల వాతావరణంలో అనేక తాయిలాలను ఆశ చూపిస్తూ ధన బలం కీలకపాత్ర పోషిస్తున్న తరుణంలో, బరిలో నిలిచిన అభ్యర్థులు అన్ని రోజుల పాటు పోలింగ్ పూర్తయ్యే వరకు కూడా మంచినీళ్ల ప్రాయంలా డబ్బులు వెదజల్లక తప్పని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి విస్తృత ప్రచారం నిర్వహించుకునేందుకు మలిదశ ఎన్నికలు జరిగే ప్రాంతాల అభ్యర్థులకు ఎక్కువ రోజుల పాటు వెసులుబాటు లభించనున్నప్పటికీ, అప్పటి వరకు భరించాల్సిన ప్రచార ఖర్చును తల్చుకుని అనేక మంది గుండెలు చిక్కబట్టుకుంటున్నారు. నిజానికి ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు పరిమితికి లోబడే ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ, అది ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదన్నది సుస్పష్టం. జడ్పీటీసీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు గరిష్ఠంగా 4లక్షల రూపాయలు, ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసే వారు అత్యధికంగా లక్షన్నర రూపాయలకు మించి ఖర్చు చేయరాదని ఎన్నికల సంఘం నిబంధనలు సూచిస్తున్నాయి. అయితే దీనికి కనీసం పాతిక రెట్లు ఎక్కువ ఖర్చు చేసేందుకు సైతం పలువురు అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా జడ్పీ చైర్మెన్, ఎంపీపీ పదవుల రేసుల్లో ఉన్న వారు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా పరిస్థితులను తమకు అనుకూలంగా మల్చుకోవాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. తుదివిడత అభ్యర్థులకు ఒకింత ఎక్కువగానే ఖర్చు భారం భరించాల్సి వస్తుందని స్పష్టమవుతోంది.