తెలంగాణ

‘బోర్డు’ను దార్లో పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: ఇంటర్ బోర్డును సరైన దారిలో పెట్టేందుకు జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గవర్నర్‌ను కోరారు. ఈ మేరకు గవర్నర్ నరసింహన్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ బోర్డు అధికారుల దిద్దుబాటు చర్యలు విద్యార్థులకు ఉపశమనం కలిగించేవిధంగా లేవన్నారు. తప్పులను సరిదిద్దే భరోసా కనిపించడం లేదని రేవంత్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో యూనివర్శిటీలకు ఛాన్సలర్ అయిన గవర్నర్, గాడి తప్పిన విద్యా వ్యవస్థను దారిలో పెట్టాలన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వారి తల్లిదండ్రులతో మాట్లాడాలన్నారు. బోర్డు కార్యాలయం ముందు నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, తల్లితండ్రులను పిలిపించుకుని స్వయంగా మాట్లాడాలని ఆయన గవర్నర్‌కు సూచించారు. ఫలితాల్లో తప్పులు జరిగాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ అంగీకరిస్తుంటే, విద్యాశాఖ మంత్రి అదంతా అపోహ మాత్రమేనని కొట్టిపారేస్తున్నారని కాంగ్రెస్ నేత మండిపడ్డారు. తమ జవాబు పత్రాలు చూపించాలని విద్యార్థులు వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఎవరో చేసిన తప్పుకు విద్యార్థులు క్షోభను అనుభవిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం కరిమల జూనియర్ కాలేజీ విద్యార్థిని జీ నవ్య తెలుగులో 99 మార్కులు సాధిస్తే సున్నా మార్కులు వేశారన్నారు. దీనిపై వివరణ కోరితే మర్నాడు సరిచేశారన్నారు.మొదటి సంవత్సరం అత్యున్నత మార్కులతో పాస్ అయిన విద్యార్థులను ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్ చేశారన్నారు. విద్యార్థుల డేటా సేకరణ, ఫలితాల క్రోడీకరణ బాధ్యతను అర్హతలేని కంపెనీకి అప్పగించడం వల్లనే ఈ సమస్య తలెత్తిందని రేవంత్ పేర్కొన్నారు. గ్లోబల్ ఎరీనా ఏజన్సీపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.