తెలంగాణ

గంజాయి స్మగ్లింగ్‌లో కి‘లేడీ’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 20: గంజాయి రవాణాకు రుచిమరిగిన స్మగ్లర్లు తమ దందాను యథాతథంగా కొనసాగించేందుకు అనేక ఎత్తుగడలు అవలంబిస్తున్నారు. ఇటీవలి కాలంలో అటు ఆంధ్రాతో పాటు ఇటు తెలంగాణలోనూ గంజాయి స్మగ్లింగ్‌పై ఎక్సైజ్, పోలీస్ అధికారుల నిఘా తీవ్రం కావడంతో గంజాయి నిల్వలను సరిహద్దులు దాటించేందుకు సరికొత్త మార్గాలను అనే్వషిస్తున్నారు. తనిఖీల పర్వం నుండి తప్పించుకునేందుకు వీలుగా ‘అతివల’ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్టు ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న సంఘటనలను బట్టి స్పష్టమవుతోంది. గంజాయి రవాణాలో వేళ్లూనుకుపోయిన బడా స్మగ్లర్లు తెర వెనుకే ఉంటూ, మహిళలచే గంజాయిని మహారాష్టక్రు చేరవేయిస్తున్నట్టు తాజా ఉదంతాలను బట్టి తెలుస్తోంది. ఆంధ్రాలోని వైజాగ్, పశ్చిమగోదావరి తదితర సుదూర ప్రాంతాల నుండి నిజామాబాద్ మీదుగా మహారాష్టక్రు చేరవేయాల్సి రావడంతో, మార్గమధ్యంలో ఎదురయ్యే తనిఖీలను దాటుకుని ముందుకు వెళ్లేందుకు వీలుగా మహిళల ద్వారా గంజాయి రవాణా చేయిస్తున్నారు. గత రెండు రోజుల క్రితమే నిజామాబాద్ జిల్లా గాంధారి మీదుగా ఇండికా కారులో గంజాయిని తరలిస్తుండగా, పోలీసులు వెంబడించడంతో స్మగ్లర్లు వాహనం వదిలి పారిపోయారు. పోలీసుల కళ్లెదుటి నుండే వాహనం డ్రైవర్ సహా, గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు మహిళలు తప్పించుకుపోయారు. సదరు వాహనంతో పాటు 30కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా, నిజామాబాద్ జిల్లాకు ఆనుకుని ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర వద్ద రైల్వే పోలీసులు సోమవారం తనిఖీలు నిర్వహించిన సందర్భంగా మరో ఇద్దరు మహిళలు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వారి వద్ద నుండి 60కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇదే తరహాలో విశాఖలోని పాడేరుతో పాటు పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ఇటీవలి కాలంలోనే గంజాయి రవాణా చేస్తున్న పలువురు మహిళలు పట్టుబడ్డారు. ఈ ఉదంతాలను బట్టి చూస్తే గంజాయి రవాణా కోసం స్మగ్లర్లు తెర వెనుక ఉంటూ మహిళలను ఈ పనికి పురమాయిస్తున్నట్టు స్పష్టమవుతోంది. తనిఖీల సమయంలో పోలీసులు కానీ, ఎక్సైజ్ అధికారులు మహిళల వద్ద కట్టుదిట్టంగా సోదాలు నిర్వహించబోరనే ధీమాతో తమ స్మగ్లింగ్ కార్యకలాపాలకు అతివలను వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా మహారాష్టక్రు ఆనుకుని ఉండడంతో ఏ ప్రాంతం నుండైనా గంజాయి ఇందూరు మీదుగానే రవాణా అవుతోంది. ప్రధానంగా వైజాగ్, పశ్చిమగోదావరితో పాటు ఒడిషా రాష్ట్రం నుండి కూడా మహారాష్టల్రోని నాసిక్, పుణె, నాందేడ్, ముంబై తదితర ప్రాంతాలకు యథేచ్ఛగా గంజాయిని రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్మగ్లర్లు అందిస్తున్న డబ్బులకు ఆశపడి కొంతమంది మహిళలు గంజాయి రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. వంద కిలోల గంజాయిని ఆంధ్రా ప్రాంతం నుండి తెచ్చి తెలంగాణ సరిహద్దులు దాటించి మహారాష్టక్రు చేరవేస్తే సుమారు 10 నుండి 15వేల రూపాయల వరకు ముట్టజెబుతుండడంతో అనేక మంది గంజాయి రవాణాకు సాహసిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా మహిళలు, యువతులను గంజాయి రవాణాకు పురిగొల్పుతూ స్మగ్లర్లు మాత్రం పెద్ద మొత్తంలో లాభపడుతున్నారు. ఇటీవలి కాలంలోనే ఎక్సైజ్, పోలీసులు జరిపిన దాడుల్లో జిల్లాలో అనేక చోట్ల గంజాయి నిల్వలు పట్టుబడడం స్మగ్లింగ్ ఉద్ధృతిని చాటుతోంది. గత మే మాసంలో బాల్కొండ మండలం దూద్‌గాం వద్ద కారులో అక్రమంగా రవాణా చేస్తున్న 135కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి కొద్దిరోజుల ముందు ఇందల్వాయిలోని టోల్‌ప్లాజా వద్ద పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టగా, నాలుగు బస్తాల నిండుగా గంజాయి లభ్యమైంది. వాస్తవానికి గంజాయి సాగు, రవాణాకు గత దశాబ్ద కాలం క్రితం వరకు కూడా నిజామాబాద్ జిల్లా ముందు వరుసలో నిలిచేది. ఆ సమయంలో నక్సల్స్ కదలికలు ఎక్కువగా ఉండడంతో అటవీ ప్రాంతాలు, గిరిజన తండాలకు ఆనుకుని ఉండే తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పెద్దఎత్తున గంజాయిని సాగు చేసేవారు. చివరకు అటవీ భూములు, అసైన్డ్ స్థలాల్లోనూ గంజాయిని అంతర పంటగా పండించేవారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఎక్సైజ్ పోలీసులు అక్కడికి వెళ్లేందుకు ఒకింత తటపటాయించేవారు. క్రమేణా జిల్లాలో నక్సల్స్ ప్రాబల్యం పూర్తిగా తగ్గుముఖం పట్టడం, అటవీ ప్రాంతం సైతం పల్చబడడంతో గంజాయి వనాలపై దాడులను ముమ్మరం చేశారు. ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ శాఖలను సమన్వయపరుస్తూ గంజాయి సాగును తుదముట్టించడంలో అప్పటి జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి చాలావరకు నియంత్రించగలిగారు. ప్రస్తుతం గుట్టుగా కొన్నిచోట్ల స్థానికంగా గంజాయిని సాగు చేస్తున్నప్పటికీ, ఆంధ్రా ప్రాంతం నుండే పెద్దఎత్తున గంజాయి నిల్వలను నిజామాబాద్ మీదుగా మహారాష్టక్రు మహిళల ద్వారా చేరవేస్తున్నట్టు తెలుస్తోంది.

తండ్రిని కడతేర్చిన కిరాతకుడు

పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన హంతకుడు

కౌడిపల్లి, జూన్ 20: కన్నతండ్రిని కర్కశంగా కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. మమకారం మరచి ఏ మాత్రం కనికరం లేకుండా తండ్రిని హతమార్చిన ఆ కిరాతకుడు ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ తాలుకా మండల కేంద్రమైన కౌడిపల్లిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కౌడిపల్లికి చెందిన చాకలి శేఖులు (45) కులవృత్తితో పాటు వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి భార్య సుశీల, డిగ్రీ చదువుతున్న పెద్దకుమారుడు సిద్ధార్థ (22), ఇంటర్ పూర్తిచేసిన నవీన (18), ఇటీవలే పదవతరగతి పాసైన కుమారుడు నరేందర్ (16) ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఇంట్లో ఆర్థికపరమైన గొడవలు, కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. వారం రోజుల క్రితం తండ్రిపై పెద్దకొడుకు సిద్దార్థ దాడి చేయడంతో స్వల్పగాయాలయ్యాయి. ఈనెల 19న తమ అక్క, బావ, గ్రామపెద్దలు చాకలి శేఖులు ఇంట్లో పంచాయతీ నిర్వహించి గొడవలు పడవద్దని, సమస్యలు అందరికీ ఉంటాయని సర్దుకోవాలని సూచించారు. ఇంతజరిగినా సోమవారం ఉదయం ఇంట్లో పెద్ద కుమారుడు సిద్దార్థ రోకలితో తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అనంతరం సిద్దార్థ, మృతుని భార్య సుశీల, చిన్న కుమారుడు నరేందర్ ముగ్గురు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. మృతుడి కుమార్తె నవీనకు తమ మేనఅల్లుడుతో ఇటీవలే పెళ్ళి నిశ్చితార్థం జరిగింది. పెళ్లి ఆగస్టు (శ్రావణమాసం)లో జరగాల్సి ఉంది. విషయం తెలుసుకున్న ఎస్.ఐ ప్రభాకర్‌రెడ్డి, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మృతుని కుమార్తె నవీన, అక్క, బావ, కాబోయే అల్లుడిని విచారించారు. శవాన్ని క్షుణ్నంగా పరిశీలించి శవ పంచానామా నిర్వహించారు. నర్సాపూర్ సి.ఐ తిరుపతిరాజు ఘటనా స్థలానికి చేరుకుని ఎస్.ఐ ప్రభాకర్‌రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహన్ని పోస్టుమార్టం కోసం నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని అక్క చాకలి లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ. తిరుపతిరాజు తెలిపారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో
బుల్లెట్ కలకలం
విశాఖ వాసి అరెస్టు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 20: హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం రేపింది. సోమవారం ఉదయం దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి శంషాబాద్ పోలీసులు బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ వాసి కృష్ణప్రసాద్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు డిఆర్‌ఐ అధికారులు తెలిపారు

దొంగను చంపిన గ్రామస్థులు
తూప్రాన్, జూన్ 20: దొంగతనానికి వచ్చిన వ్యక్తిని కొట్టి చంపిన సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామపంచాయతీ పరిధిలోని హైదర్‌గూడలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదర్‌గూడ గ్రామానికి చెందిన చెండి పోచయ్య ఇంటికి ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఓ వ్యక్తి దొంగతనానికి వచ్చాడు. తలుపు చప్పుడు విని పోచయ్య చుట్టుపక్కలవారిని లేపడంతో అందరూ కలిసి దొంగను కర్రతో బాదారు. దీంతో ఆగంతకుడు వెంటనే స్పృహ కోల్పోయాడు. జరిగిన సంఘటనను ఎస్‌ఐకు ఫోన్‌లో సమాచారమివ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి స్పృహ కోల్పోయిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతిచెందాడు. అతని వద్ద మహారాష్టక్రు చెందిన పోలీస్ మిత్రకార్డు ఉంది. నాందేడ్ జిల్లా నర్సీగాం గ్రామానికి చెందిన బాజీరావుపాటిల్ అని ఉందని అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు.

దొంగల ముఠా అరెస్టు

కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 20: బంగారానికి మెరుగు పెడతామని నమ్మించి మోసం చేస్తున్న దొంగల ముఠాను హైదరాబాద్ ఈస్ట్‌జోన్ పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకొని ఒక కెజి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బీహార్‌కు చెందిన ఈ ముఠా హైదరాబాద్‌లో మకాం వేసి గత మూడు నెలలుగా బంగారు, వెండి ఆభరణాలతోపాటు రాగి, ఇత్తడి వంటి పాత్రలను కడుగుతామని అమాయక ప్రజలను మోసగిస్తున్నారు. సోమవారం ఈస్ట్‌జోన్ డిసిపి డాక్టర్ రవీందర్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. బీహార్‌కు చెందిన రంజీత్ సా, కన్హయ్య ప్రసాద్, సునీల్ కుమార్, బంబం సా, అజయ్ మండల్, ముఖేష్‌లు హైదరాబాద్ మంగళ్‌హాట్‌లో మకాం వేశారు. మూడు నెలలుగా హైదరాబాద్, సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ రాగి, ఇత్తడి వంట పాత్రలకు కలాయి వేస్తున్నారు. దీంతో పాటు ధనికులు నివసించే ప్రాంతాల్లో బంగారు, వెండి ఆభరణాలకు మెరుగు పెడతామంటూ నమ్మిస్తూ అమాయక ప్రజలను మోసగిస్తున్నారు. బంగారు, వెండి ఆభరణాలను కడిగినట్టు నటిస్తూ నకిలీ ఆభరణాలు అంటగడుతున్నారు. గత నెల 27న అంబర్‌పేట, బతుకమ్మకుంటకు చెందిన వనజాల కనకమ్మ తన బంగారు ఆభరణాలకు మెరుగు పెడతామంటూ నకిలీ ఆభరణాలు ఇచ్చి మోసగించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదివారం గోల్డ్ పాలిష్ వాలా అంటూ తిరుగుతుండగా అనుమానించిన పోలీసలు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితుల మోసాలు బయటపడ్డాయి. ఇప్పటి వరకు వీరిపై హైదరాబాద్‌లో పరిధిలోని 11 పోలీసు స్టేషన్లలో, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు, పుణె కమిషనరేట్ పరిధిలో నాలుగు కేసులు నమోదై ఉన్నాయి. అదేవిధంగా నిజామాబాద్, నాగపూర్, నాసిక్‌లలో ఎనిమిది కేసులు ఉన్నాయి. ఈస్ట్‌జోన్ పోలీసులు ఆరుగురు సభ్యుల ముఠాలోని ఐదుగురిని అదుపులోకి తీసుకోగా పరారీలో ఉన్న ముఖేష్‌ను గాలిస్తున్నట్టు డిసిపి డాక్టర్ రవీందర్ తెలిపారు. వీరిపై ఐపిసి 459, యు/ఎస్ 406, 420, 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు డిసిపి తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ప్రత్యేక బృందంలోని కె నాగేశ్వర రావు, పి రాజు, ఎం రామకృష్ణలను డిసిపి అభినందించారు.