తెలంగాణ

మల్లన్నసాగర్ ఉద్యమం ఉధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూన్ 22: మెదక్ జిల్లా తొగుట మండలంలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూముల ముంపు బాధితులు నిర్వహిస్తున్న ఉద్యమాలకు వివిధ పార్టీల నేతలు సంపూర్ణ మద్దతు పలుకుతుండడంతో ఉద్యమాలు ఉధృతరూపం దాల్చనున్నాయి. బుధవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు కొండపాక మండలం ఎర్రవల్లి, సింగారం గ్రామాల్లో పర్యటించి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు పోరాటాలకు విశ్రమించకూడదని ముంపు బాధితులకు పిలుపు నిచ్చారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్‌తో పాటు పలువురు నేతలు ముంపు గ్రామాల్లో పర్యటించి ప్రజలను బాధిత ప్రజలను జాగృతం చేసారు. తొగుట మండలం వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, కొండపాక మండలం పల్లెపహాడ్, వేముల ఎర్రవల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. బిజెపి నేతలు వస్తున్నారని తెలియడంతో గ్రామాలకు చెందిన మహిళలు, వృద్ధులు, పిల్లలు అనే తేడా లేకుండా సభా కార్యక్రమాల వద్ద పిల్లాపాపలతో తరలివచ్చి వేచి ఉన్నారంటే బాధితుల ఆవేదన ఏమిటో స్పష్టమవుతుందని నేతలు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ఎవరిని కదిలించినా తమ గ్రామాలను ముంపునకు గురికావడం అంగీకరించమంటూ ఘంటాపథంగా తేల్చిచెబుతున్నారు. వేములఘాట్‌లో బిజెపి నేత లక్ష్మణ్ ప్రసంగం ప్రారంభించడంతో దొమ్మాట యాదమ్మ అనే వృద్ధురాలు బోరున విలపిస్తూ తరతరాలుగా కలిసి మెలసి సహజీవనం సాగించిన తమ గ్రామ ప్రజలన విడదీయకుండా కాపాడాలంటూ వేడుకోవడంతో పలువురిని కంట తడిపెట్టించింది. చిన్నప్పటి నుంచి చదువుకున్న మా పాఠశాల ప్రాజెక్టులో ముంపునకు గురవుతుందని, ఎట్టిపరిస్థితుల్లో తమ పాఠశాలను పోనివ్వకూడదని విద్యార్థులు బిజెపి నేతలకు విద్యార్థులు వినతిపత్రం సమర్పించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉందని, తాము సమర్పించిన వినతిపత్రాన్ని మీ ద్వారా నేరుగా ప్రధాన మంత్రికి అందజేయాలంటూ విద్యార్థులు లక్ష్మణ్‌కు విజ్ఞప్తి చేసారు. వర్షం పడుతున్నా లెక్కచేయకుండా నాయకులు ప్రసంగించే వరకు వందలాది మంది ఓపికతో కూర్చున్నారంటే వారి గ్రామాలను పరిరక్షించుకోవాలన్న తపన ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఏటిగడ్డ కిష్టాపూర్‌కు చెందిన నర్సమ్మ అనే మహిళ మాట్లాడుతూ ప్రాజెక్టును ఎందుకు కడుతున్నారో సిఎం కెసిఆర్‌కు తెలియదు, తమకు కూడా అంతకంటే తెలియదని, ప్రాణాలు పోయినా సరే ప్రాజెక్టును కట్టనిచ్చే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ఇదిలావుండగా ఆయా గ్రామాల్లో బాధితులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు తెలుగుదేశం పార్టీకి చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష నేత రేవంత్‌రెడ్డి ఈ నెల 25, 26 తేదీల్లో 48 గంటల పాటు నిరాహార దీక్షలు చేపట్టడానికి నిర్ణయించారు. మరుసటి రోజు నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు 27, 28, 29 తేదీల్లో 72 గంటల పాటు నిరాహార దీక్షలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. వరుసబెట్టి మొత్తం 120 గంటల పాటు నాయకులు నిరాహార దీక్షలు నిర్వహించడానికి సిద్ధం కావడంతో ముంపు గ్రామాల్లో ఆందోళన కార్యక్రమాలు మరింత ఉద్ధృత రూపం దాల్చడం తథ్యమని చెప్పవచ్చు. కాగా, మంగళవారం మంత్రి హరీష్‌రావు సంగారెడ్డిలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో 2013 చట్టం ప్రకారం పరిహారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించినా బాధితుల్లో మాత్రం ఏమాత్రం మార్పు కనిపించడం లేదు.

వేములఘాట్ పరిసరాల్లో పుష్కలమైన సాగునీటి వనరులు ఉన్నాయని, దాదాపు 5500 ఎకరాల్లో ప్రతిసారి రెండేసి పంటలను దిగుబడి చేసుకుంటున్నామని, ఇంతటి సౌలభ్యం ఉన్న మా గ్రామాన్ని ముంపునకు గురిచేయడం దేనికో అర్థం కావడం లేదంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.

మెదక్ జిల్లా కొండపాక మండలం వేములఘాట్‌లో రోదిస్తున్న వృద్ధురాలిని ఓదార్చుతున్న
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్