తెలంగాణ

కవిత ఓటమికి కారణాలు అనేకం...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 23: దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుండి అధికార టీఆర్‌ఎస్ పార్టీ తరఫున వరుసగా రెండవ పర్యాయం పోటీ చేసిన కల్వకుంట్ల కవిత అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. తొలిసారి సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగి బీజేపీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ధర్మపురి అరవింద్ నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి కుమార్తె, తెరాస సిట్టింగ్ ఎంపీ కవితపై గెలుపు బావుటాను ఎగురవేసిన ఘనతను ఆయన దక్కించుకున్నారు. మరోవైపు కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలిచిన ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ అయితే నామమాత్రంగానైనా పోటీ ఇవ్వలేక మూడవ స్థానానికి పరిమితమై డిపాజిట్‌ను కోల్పోవడం కాంగ్రెస్ దైన్యస్థితిని చాటింది. కాగా, కవిత గెలుపు పట్ల గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ వచ్చిన తెరాస శ్రేణులు, ఆమె ఓటమిని ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. కవిత ఓటమికి స్థానికంగా నెలకొని ఉన్న పరిస్థితులతో పాటు ఇతర అనేక కారణాలు ప్రభావం చూపాయని పరిశీలకులు విశే్లషిస్తున్నారు. ఈ దఫా ఉత్తర తెలంగాణ జిల్లాలలో నరేంద్రమోదీ హవా కొనసాగడం బీజేపీకి కలిసిరాగా, తెరాస పట్ల స్థానిక రైతుల్లో నెలకొన్న వ్యతిరేకత కూడా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయానికి బాటలు వేసింది. ఎర్రజొన్న, పసుపు పంటలకు మద్దతు ధర కోరుతూ ఈ నియోజకవర్గం నుండి మూకుమ్మడిగా 178 మంది రైతులు ఎన్నికల్లో పోటీ చేసిన విషయం విదితమే. సదరు రైతుల్లో అత్యధిక మంది అధికార తెరాసకు వ్యతిరేకంగానే తమ ఓటు హక్కు ద్వారా తీర్పును వెలువరించారని ఫలితాలు తేటతెల్లం చేశాయి. సమస్యల సాధన కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేసినా తెరాస ప్రభుత్వం పట్టించుకోకపోగా, రైతు ప్రతినిధులపై పోలీసు కేసులు బనాయించి అరెస్టులు చేయడం అన్నదాతల్లో ఆక్రోశం పెల్లుబికేందుకు కారణమైందని భావిస్తున్నారు. అన్నింటికీ మించి తెరాస ముఖ్య నేతల అత్యుత్సాహం సైతం అసలుకే ఎసరు తెచ్చిందని పరిశీలకులు నిర్మొహమాటంగా పేర్కొంటున్నారు. గత 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా ఎం.పీ కవిత లక్షా 67వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, ఈసారి ఏకంగా 4లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని తెరాసకు చెందిన మంత్రి మొదలుకుని ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలంతా గొప్పలు చెప్పుకున్నారు. అయితే ఆ స్థాయిలో కవిత గెలుపు కోసం సదరు ఎమ్మెల్యేలు గట్టిగా కృషి చేసిన దాఖలాలు మాత్రం కానరాలేదు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సైతం తన సొంత నియోజకవర్గమైన బాల్కొండ సెగ్మెంట్‌లోనే ప్రచారానికి పరిమితం అయ్యారు. నాలుగు మాసాల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను తెరాస కైవసం చేసుకోగలిగింది. మొత్తం ఏడు శాసనసభ నియోజకవర్గాలను కలుపుకుని ఆ పార్టీకి దాదాపు 4 లక్షల వరకు ఆధిక్యత లభించింది. దీంతో పార్లమెంటు ఎన్నికలోనూ అదే స్థాయి మెజార్టీతో గెలుపొందడం ఖాయమనే భారీ అంచనాలతో తెరాస ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఊహల పల్లకిలో విహరించారు. తీరా ఎన్నికల ఫలితాలు ప్రతీకూలంగా వెలువడడంతో వారంతా కలవరపాటుకు గురి కావాల్సి వచ్చింది. ఇదిలాఉండగా, ఎలాగైనా తెరాసను దెబ్బతీయాలనే లక్ష్యంతో తెర వెనుక కాంగ్రెస్, బీజేపీలు ఏకమై పని చేయడం కూడా కవితకు కోలుకోలేని రీతిలో దెబ్బతీసిందని పోలింగ్ సమయంలోనే ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్‌కు దక్కాల్సిన సంప్రదాయక ఓట్లు సైతం బీజేపీ ఖాతాలో జమ కావడంతో ధర్మపురి అరవింద్ గెలుపు ఖాయమైందని స్పష్టమవుతోంది. మొత్తం మీద తెరాస అభ్యర్థి, సీఎం కుమార్తె కవిత ఓటమికి సవాలక్ష అంశాలు కారణంగా నిలువగా, అవి కాస్త బీజేపీ అభ్యర్థి అరవింద్‌కు అనుకూలంగా మారి ఆయన విజయానికి దోహదపడ్డాయని చెప్పవచ్చు.

టీఆర్‌ఎస్ రాజకీయ వ్యూహానికి భారీ గండి

అసెంబ్లీ ఎన్నికల్లో అప్రతిహతంగా దూసుకువెళ్లిన టీఆర్‌ఎస్ లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయబావుటా ఎగురవేసి మొత్తం 17 స్థానాల్లో ఒక్కటి మినహా 16 స్థానాల్లో విజయం సాధించి తీరుతామనే ధీమాతో ఉన్న టీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలకు మించి విజయం సాధించడం, తెలంగాణ సెంటిమెంట్ పరిపూర్ణంగా ఓట్లను రాబట్టడంతో అదే పరంపర లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగి విపక్ష పార్టీలు లేకుండా చేసుకోవాలన్న టీఆర్‌ఎస్ రాజకీయ వ్యూహానికి భారీ గండిపడింది.
తెలంగాణలో విపక్షాలను కట్టడి చేసిన టీఆర్‌ఎస్, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు ఒక్క సీటు కూడా దక్కకుండా ముందస్తుగా భారీ ప్రణాళికలనే రచించింది. టీఆర్‌ఎస్ దెబ్బకు వైకాపా పూర్తిగా ఎన్నికల బరి నుండి తప్పుకోగా, జనసేన కొద్ది మంది అభ్యర్ధులను రంగంలోకి దించింది. వారంతా పేరుకే పోటీ అన్నట్టు పోటీ చేయడంతో తమకు ఇక తిరుగులేదని టీఆర్‌ఎస్ భావించింది. కానీ బీజేపీ నుండి బరిలోకి దిగిన నేతలు మాత్రం గతానికి భిన్నమైన రీతిలో ప్రచారం చేసి ఫలితాలలో ముందంజలో ఉండటాన్ని టీఆర్‌ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీఆర్‌ఎస్‌కు మొదటి నుండి కంటిలో నలుసుగా ఉన్న రేవంత్ రెడ్డి విజయం కూడా ఆ పార్టీకి చెంపపెట్టుగా భావిస్తున్నారు. కాంగ్రెస్ నుండి బీజేపీలోచేరి తెలంగాణలో మహబూబ్‌నగర్ నుండి పోటీ చేసిన డీకే అరుణ విజయం సాధిస్తే కూడా గణనీయమైన ప్రగతి సాధించినట్టేనని భావించిన బీజేపీ నాలుగు నియోజకవర్గాల ఫలితాల్లో ముందంజలో ఉండటం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సికింద్రాబాద్ నుండి యువనేత కిషన్‌రెడ్డి తనకాళ్లకు బలపం కట్టుకుని ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే యువనేతగా అందరిదృష్టినీ ఆకర్షించిన కిషన్‌రెడ్డి విజయం కూడా ఆ పార్టీకి శ్వాసను అందిస్తోంది.
అమిత్ షా వ్యూహం ఫలించిందని బీజేపీ నాలుగు స్థానాల్లో , కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో , ఎంఐఎం ఒక స్థానంలో ముందంజలో ఉండటంతో టీఆర్‌ఎస్‌కు చివరికి తొమ్మిది స్థానాలే మిగిలాయి. గెలిచిన స్థానాలు కంటే ఓటమి పాలైన స్థానాలే టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా భావించగా, అక్కడే ప్రతికూల ఫలితాలు రావడం టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎవరు అడ్డువచ్చినా గెలిచి తీరుతామని మొదటి నుండి సీఎం సహా అంతా చెబుతూ వచ్చిన కరీంనగర్ కంచుకోటను కోల్పోవడం టీఆర్‌ఎస్‌కు పెద్ద ముప్పుగా పార్టీ నేతలు భావిస్తున్నారు. మరో పక్క పార్టీ నేత కవిత నిజామాబాద్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉండటం అందర్నీ షాక్‌కు గురిచేసింది.
ఎవరు ఎన్ని లెక్కలు వేసుకున్నా, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా 15 మంది కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం రాష్ట్రంలో విస్తృత పర్యటన చేసినా , అనేక బహిరంగ సభల్లో టీఆర్‌ఎస్ పాలన తీరుపై తీవ్రమైన విమర్శలు చేసినా చెక్కుచెదరని ముఖ్యమంత్రి కేసీఆర్ అంతే ధీటుగా వారికి బదులిచ్చారు. అసెంబ్లీలో అనూహ్య విజయంతో అదే మైకంలో ఉన్న టీఆర్‌ఎస్ నేతలు పార్లమెంటు ఎన్నికల్లోనూ తమకు తిరుగులేదని భావించారు, తెలంగాణలోని 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు ఆ స్థాయిలో ఫలితాలు కనిపించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించని జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకోవడం మళ్లీ రాష్ట్రంలో చిగురించడం , 8 చోట్ల ఆ రెండు పార్టీలూ కలిపి ఆధిక్యాన్ని చూపడం టీఆర్‌ఎస్ భవిష్యత్ ఎన్నికల రణరంగానికి మింగుడుపడని అంశమే. మెదక్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించగా, నాగర్ కర్నూల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్ధి రాములు ముందంజలో ఉన్నారు. కరీంనగర్‌లో 9వ రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ 55వేల ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. హైదరాబాద్ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ 85 వేల ఓట్ల ఆధిక్యంతో దూసుకువెళ్లారు. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థ్ధి ఉత్తమకుమార్‌రెడ్డి, మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఆధిక్యతతో ఉన్నారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముందంజలో ఉండగా, సికింద్రాబాద్‌లో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ టీఆర్‌ఎస్ అభ్యర్ధి కల్వకుంట్ల కవితపై ఆధిక్యంతో ఉన్నారు. పెద్దపల్లిలో టీఆర్‌ఎస్ అభ్యర్ధి వెంకటేష్, చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశే్వశ్వరరెడ్డి, ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు ముందంజలో ఉండగా మిగిలిన నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు. ముందంజలో ఉన్నారు.