తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూన్ 12: బడుగు, బలహీన వర్గాల నాయకుడిగా రాష్ట్ర వాల్మీకి నేతగా నడిగడ్డ ప్రజలకు చేరువైన గట్టు భీముడు అలియాస్ బాస్ భీమయ్య బుధవారం కన్నుమూశారు. జిల్లా రాజకీయాల్లో గట్టు భీముడి రాజకీయ ప్రస్థానం సంచలనం. సామాన్య వ్యక్తిగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం సంచలనాలతో రాష్ట్ర నేతగా ఎదిగారు. ఫ్యాక్షన్ జీవితాన్ని కూడ చవిచూసిన గట్టు భీముడు ఎన్నోసార్లు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లి మృత్యువును జయించుకొని ప్రజలమధ్యన నేతగా ఎదిగారు. గట్టు మండలం, బల్గెర గ్రామంలో బాసు తిమ్మయ్య, బాసు తాయమ్మ దంపతులకు 12 మంది సంతానం. వీరిలో 6వ సంతానంగా గట్టు భీముడు. 1952లో జన్మించాడు. అక్షరాస్యతలో దేశంలోనే వెనుకబడిన ఈ ప్రాంతంలో మాచర్ల ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసి అక్కడే బల్గెర గ్రామ పట్వారీగా పనిచేశారు. భీమయ్య ప్రజాజీవితంలో వచ్చేంత వరకు ఫ్యాక్షన్ నేపథ్యంతో గడిపారు. పూర్తిస్థాయి సమాచారం తెలియనప్పటికీ దాదాపు పదేళ్లకు పైగా ఫ్యాక్షన్‌లో ఉండిపోయారు. ఇందుకోసం ఇరువైపులా ఆస్తి, ప్రాణ నష్టాలు కూడా చవి చూడాల్సి వచ్చింది.
బల్గెర అంటేనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఫ్యాక్షన్ కేంద్రంగా పోలీసుల రికార్డుల్లో ఉంది. ఎన్నోసార్లు జైలు జీవితాన్ని కోర్టు కేసులను అనుభవిస్తూ కొన్ని ఏళ్లు రహస్య జీవితాన్ని కూడా గడపాల్సి వచ్చింది. ఒకప్పటి ఫ్యాక్షన్ గ్రామాన్ని శాంతియుతంగా చేసేందుకు భీముడు ఒక అడుగు ముందుకు వేసి ప్రత్యర్థి వర్గంలోని అమ్మాయిని ఇంటికి కోడలిగా తెచ్చుకోవడంతో నేడు బల్గెర గ్రామం ప్రశాంతంగా ఉంది. 1983లో ఎన్‌టీ రామారావు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు.
దీంతో అప్పటి వరకు పరోక్ష రాజకీయాలు నడిపిన గట్టు భీముడు పట్వార ఉద్యోగాన్ని వదిలి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అంతకన్న ముందు డీకే కుటుంబానికి, విజయమోహన్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, ఉప్పల గోపాల్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డిలకు సన్నితంగా ఉంటూ ఆ ఎన్నికల్లో వారి గెలుపుకోసం తనవంతు కృషి చేస్తూ వచ్చారు. 1999లో జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో గట్టు భీముడు తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణపై 4,546 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పటివరకు నడిగడ్డ ఒకే సామాజికవర్గం గుప్పెట్లో ఉండగా బడుగు, బలహీనవర్గాల బీసీ కార్డుతో రాజకీయాల్లోకి వచ్చి గెలుపొంది రికార్డునెలకొల్పాడు. అంతకంటే ముందు గట్టు సింగిల్‌విండో చైర్మన్‌గా, డీసీసీబీ, డీఆర్‌డీఏ డైరెక్టర్‌గా, గట్టు జడ్పీటీసీగా గెలుపొందారు. గట్టు భీముడును ఎన్‌టీఆర్ పేరుతో పిలిచే నాయకుల్లో ఒకరుగా గుర్తింపు ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం 1984లో సంక్షేభంలో ఉన్నప్పుడు గట్టు భీముడుకు ఎన్‌టీఆర్ కీలక బాధ్యతలను అప్పగించారు. టీడీపీ ఎమ్మెల్యేలతో రాయిచూర్‌లోని ఓ హోటల్‌లో క్యాంప్ నిర్వహణ చేపట్టి శభాష్ అనిపించుకున్నారు. అప్పటి గవర్నర్ రాంలాల్ సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యేల బలప్రదర్శన విజయవంతం అయ్యేవరకు భీముడు తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేశారు. లక్ష్మీపార్వతి స్థాపించిన అన్న తెలుగు దేశం పార్టీలో భీముడు కీలక బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆ పార్టీ జెండాను ముందుకు తీసుకుపోవడంలో భీముడు ముందుకొచ్చి మహబూబ్‌నగర్‌లో పార్టీ కార్యాలయం స్థాపించారు. 2009లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరి నేటివరకు పార్టీలోనే కొనసాగుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గట్టు భీముడికి ఎమ్మెల్సీ ఇస్తానని ఇవ్వకపోవడంతో పలు సందర్భాల్లో రాష్ట్ర నేతలను కలుస్తూ ఉండేవారు. ప్రస్తుతం ఆయన సోదరుడు గట్టు తిమ్మప్ప కార్పొరేషన్ చైర్మన్‌గా, మరో సోదరుడి కుమారుడు హనుమంతు బల్గెర సర్పంచుగా, కోడలు శ్యామల గట్టు జడ్పీటీసీలుగా ఉన్నారు. గట్టు భీముడుకు భార్య బాసు భువనేశ్వరి, ఐదుగురు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
పలువురి పరామర్శ
గట్టు భీముడు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందడంతో పలువురు రాష్టన్రేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు పరామర్శించారు.
గద్వాలలో గట్టు తిమ్మప్ప స్వగృహం వద్ద సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఉంచగా ఎమ్మెల్యేల ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డీకే భరతసింహారెడ్డి, దయాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ మంద జగన్నాథం, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్లు గడ్డం కృష్ణారెడ్డి, బండ్ల లక్ష్మిదేవి, నందినె్న ప్రకాష్‌రావు, బీజేపీ నేతలు వెంకటాద్రిరెడ్డి, త్యాగరాజు, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయులుగౌడు, గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ కృష్ణవేణి తదితరులు సందర్శించి నివాళులర్పించారు.
సీఎం సంతాపం
గట్టు భీముడు మృతిపట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్‌రావు సంతాపం ప్రకచించారు.
మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు (ఫైల్ ఫొటో)