తెలంగాణ

సుధాకర్ పైప్స్ అధినేత మీలా కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూన్ 25: ప్రముఖ పారిశ్రామికవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, సుధాకర్ పీవీసీ పైప్స్ అధినేత, మాజీ మున్సిపల్ చైర్మన్ మీలా సత్యనారాయణ (89) అనారోగ్యంతో కన్నుమూశారు. వృద్ధాప్యం వల్ల ఉత్పన్నమైన అనారోగ్య సమస్యలతో గత పక్షం రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. నిరుపేద కుటుంబంలో జన్మించి శ్రమనే నమ్మి చమట చుక్కలనే పెట్టుబడిగా పెట్టి నిరంతరం పరిశ్రమించి పారిశ్రామికవేత్తగా ఎదిగారు. దేశ స్వాతంత్య్ర పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని ప్రజల పక్షాన పోరాడారు.
స్వాతంత్య్రం అనంతరం రెండు పర్యాయాలు మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసి వేతనంతోపాటు ఎలాంటి సదుపాయాలను వినియోగించుకోకుండా పనిచేసి నిస్వార్ధ నేతగా పేరుగడించారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1931 జనవరి 31న సూర్యాపేట మండలం సోలిపేట గ్రామంలో మీలా రామయ్య, రామనర్సమ్మ దంపతులకు జన్మించారు. ప్రాధమిక విద్యను గ్రామంలో పూర్తిచేసి ఆ తర్వాత సూర్యాపేట, హైదరాబాద్‌లో విద్యనభ్యసించారు. 14 ఏళ్ల వయస్సులోనే నిజాంకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1956లో సూర్యాపేటకు వచ్చి చిరు వ్యాపారాలు చేశారు. ఆ తర్వాత రైస్, అయిల్ మిల్లుల్లో భాగస్వాములుగా చేరారు. 1970 ఆగస్టు 15న రూ.28 వేల పెట్టుబడితో ముగ్గురు కార్మికులతో సుధాకర్ పీవీసీ పరిశ్రమను స్థాపించారు. రైతులకు నాణ్యమైన పైపులను అందిస్తూ అనతికాలంలోనే వినియోగదారుల మన్ననలు పొందారు. అలా నిరంతరం శ్రమిస్తూ అంచెలంచెలుగా పరిశ్రమను విస్తరించారు. నేడు ఈ పరిశ్రమ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, ఒడిసాలకు విస్తరించి పాతికవేల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ రూ.800 కోట్ల వ్యాపారసంస్థగా రూపాంతరం చెందింది. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ అభిమానిగా ఉన్న ఆయన అదేపార్టీలో పలు పదవులను చేపట్టారు. ఏఐసీసీ సభ్యుడిగా కొనసాగడంతో పాటు 1988, 2006లలో సూర్యాపేట మున్సిపాల్టీ చైర్మన్‌గా రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. చైర్మన్‌గా వేతనం తీసుకోకుండా మున్సిపాల్టీ నుండి వాహనం తదితర ఎలాంటి బిల్లులను పొందకుండా తన సొంత ఖర్చులతోనే పనిచేసి అరుదైన గుర్తింపును పొందారు. సూర్యాపేటలో నెలకొన్న నీటి ఎద్దడి నివారణకు వాటర్ గ్రిడ్‌ను నిర్మించారు. ముక్కుసూటి మనస్తత్వంగా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడే వ్యక్తిత్వం ఆయనది. సూర్యాపేటతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నో ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలకు భారీ ఎత్తున విరాళాలు అందించి సామాజిక సేవకుడిగా గుర్తింపు పొందారు. ఉత్తమ పారిశ్రామికవేత్తగా మోక్షగుండం విశే్వశ్వరయ్య అవార్డుతోపాటు పలు అవార్డులు, సత్కారాలను పొందారు. అదేవిధంగా స్వాతంత్య్ర సమరయోధునిగా మాజీ రాష్టప్రతి ప్రతిభాపాటిల్ చేతులమీదుగా సత్కారం పొందారు. నిత్య శ్రామికునిగా, ఆదర్శనేతగా పేరున్న మీలా మృతిచెందిన వార్త ఈ ప్రాంతవాసులకు తీవ్ర విషాదాన్ని నింపింది.
మీలా అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మీలా మృతిపట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం, సీపీఎం జిల్లా కార్యదర్శి ములకలపల్లి రాములు, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్, డీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావులతోపాటు పలు పార్టీల నేతలు, వ్యాపారవేత్తలు, వివిధ సంఘాల నాయకులు సంతాపం తెలిపారు. మీలా మృతికి సంతాప సూచకంగా గురువారం పట్టణంలోని ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.