తెలంగాణ

అప్రజాస్వామిక వైఖరి వల్లే కవితను ఓడించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 26: టీఆర్‌ఎస్ పార్టీ అవలంబి స్తున్న అప్రజాస్వామిక వైఖరి వల్లే నిజామాబాద్ జిల్లా ప్రజలు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను పార్లమెంటు ఎన్నికల్లో ఓడించి అధికార పార్టీకి గుణపాఠం చెప్పారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ రామచంద్ర కుంతియా అభిప్రాయపడ్డారు. తెరాస ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో నెలకొని ఉన్న వ్యతిరేకత కారణంగానే నిజామాబాద్, కరీంనగర్, సికిందరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో బీజేపీ గెలువగలిగిందని ఆయన విశే్లషించారు. ఈ ఫలితాలతోనైనా కేసీఆర్‌కు కనువిప్పు కలుగుతుందని ఆశిస్తున్నామని, లేనిపక్షంలో టీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ భవన్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి కుంతియా ముఖ్య అతిథిగా హాజరవగా, రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యులు షబ్బీర్‌అలీ, పొన్నం ప్రభాకర్, కుసుమ్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి ఆర్‌సీ.కుంతియా మాట్లాడుతూ, గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై అనేక సందేహాలు నెలకొని ఉన్నాయని, ప్రధానంగా ఈవీఎంల పనితీరు విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. బ్యాలెట్ పద్ధతిన జరిగిన శాసనమండలి పట్ట్భద్రుల నియోజకవర్గం ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి జీవన్‌రెడ్డి 50 వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారని, ఇది కూడా ఈవీఎంలపై అనుమానాలకు తావిస్తోందన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీలు ప్రజలను తప్పుడు వాగ్దానాలతో ఆకట్టుకుని, డబ్బులు వెదజల్లి రెండవసారి అధికారంలోకి వచ్చాయని ఆక్షేపించారు. అయినప్పటికీ తెరాస అధినేత కేసీఆర్ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలనే కుట్రతో ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. వ్యక్తిగత, స్వార్ధ ప్రయోజనాల కోసమే తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరారని, వారిని టీఆర్‌ఎస్ నేతలు ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేస్తూ అప్రజాస్వామికంగా పార్టీలో విలీనం చేసుకున్నారని విమర్శించారు. దళితవర్గానికి చెందిన భట్టివిక్రమార్క ప్రతిపక్ష నేతగా ఉండకూడదనే భావనతోనే కేసీఆర్ సర్కార్ కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని తెరాసలో విలీనం చేసుకునేలా పావులు కదిపిందని ఆరోపించారు. ఈ తరహా వైఖరి కారణంగానే నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో కవితను ప్రజలు ఓడించారని అన్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో ప్రస్తుత మోదీ ప్రభుత్వం కంటే అత్యధిక మెజారిటీతో మూడు పర్యాయాలు అధికారం చేపట్టిందని, ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లోనూ ఇందిరాగాంధీకి దేశ ప్రజలు భారీ మెజారిటీతో పట్టం కట్టారని కుంతియా గుర్తు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఏమాత్రం అధైర్యపడకుండా, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని, ఈ విషయంలో తమకెలాంటి అనుమానాలు లేవన్నారు. ఈనెల 29న నాగార్జునసాగర్‌లో కీలక సమావేశం నిర్వహించి బల్దియా ఎన్నికల్లో సత్తా చాటేలా కార్యాచరణ రూపొందించనున్నామని తెలిపారు. రాష్టస్థ్రాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను జిల్లా, మండల, గ్రామ కమిటీలకు వివరిస్తూ అవి అమలయ్యేలా చూడాలని జిల్లా కాంగ్రెస్ నాయకులకు సూచించారు. మైనార్టీ నేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ, తెరాస నిజాం షుగర్స్ హామీని విస్మరించడంతో కవితను ఓడించి జిల్లా ప్రజలు తెరాసకు తమ సత్తా ఏమిటో చాటి చెప్పారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో హంగామా చేస్తున్న కేసీఆర్ సర్కార్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని 20, 21, 22వ ప్యాకేజీల పనులకు 10 వేల కోట్ల రూపాయలను కేటాయించాలని, లేనిపక్షంలో పాదయాత్ర చేపట్టి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అసెంబ్లీని కూల్చివేస్తామంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ముందుగా అసెంబ్లీ ఆవరణలో గల రెండు మసీదులు, మైసమ్మ ఆలయం గురించి తన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. వీటి గురించి స్పష్టత ఇవ్వకుండా సెక్రటేరియట్ భవనాలను కూల్చివేస్తే తెరాస తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, టీ.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కనపెట్టి, ప్రతిపక్ష పార్టీలను బలహీనపర్చడమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ పని చేస్తోందని ధ్వజమెత్తారు. టీ.పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు కుసుమ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, తాహెర్‌బిన్ హందాన్, అనే్వష్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, కైలాస్ శ్రీనివాస్, కాసుల బాల్‌రాజ్, జావెద్ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీయే కొనసాగాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.