తెలంగాణ

నిరుపేదల బియ్యం దళారులు, స్మగ్లర్లకు వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 14: తెలంగాణ రాష్ట్రంలో ఓపూట తిని మరోపూట పస్తులుండే నిరుపేదల ఆకలితీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపాయికే కిలో రేషన్ బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది. కడునిరుపేదల కడుపునింపేందుకు కోట్లాది సబ్సిడీ దళారులకు, స్మగ్లర్లకు వరంగా మారింది. ప్రభుత్వ ఆశయం నెరవేరకుండానే దొడ్డిదారిన తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్న ‘ప’రేషన్ గత కొంత కాలంగా పట్టిపీడిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కడునిరుపేదల కడుపు నింపేందుకు అక్రమార్కుల ఆటలు కట్టించేందుకు ప్రభుత్వం ఎన్ని ఎత్తులు వేసినా చిత్తుచేస్తూ మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు దళారులు, స్మగ్లర్లు ఆగకుండా రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు. నిరుపేదల బియ్యం మహాతీపిగా దళారులు, స్మగ్లర్లు భావిస్తుండగా అక్రమ మార్గాల్లో ప్రభుత్వ ఆశయానికి గండికొడుతున్న వారికి కొందరు అధికారులు అండగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది. చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న రూపాయికే కిలో లభించే సబ్సిడీ బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు కొన్ని ముఠాలు బయలుదేరాయి. సరికొత్త వ్యాపారానికి తెరతీసాయి. రూపాయికే కిలో లభించే ఆ రేషన్ బియ్యాన్ని రూ.6 నుంచి 10 చెల్లించి ద్విచక్ర వాహనాలపై ఊరూ, వాడ, ఇల్లిల్లు తిరుగుతున్నారు. వాహనాలపై సంచులేసుకుని రేషన్ బియ్యం కొనుగోలు చేస్తామంటూ సందీగొందులు తిరుగుతున్నారు. అక్కడి ఇక్కడ సేకరించిన ఆ బియ్యానే్న రూ.10 నుంచి 15 కు కొందరు దళారులు, స్మగ్లర్లకు విక్రయిస్తున్నారు. ఆ బియ్యాన్ని ఇక్కడి నుండి మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు రవాణా చేసే సరికి రూ.25 నుంచి 30కి చేరుతుంది. ప్రభుత్వం కూడా లబ్ధిదారులకు అందించేందుకు అంతే మొత్తంలో సబ్సిడీ భారం పడుతున్నట్టు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంగా గత కొంత కాలంగా ఆగకుండా సాగుతున్న ఈ దందాపై సీపీ వి.బి.కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ పోలీస్ మెరుపుదాడులు నిర్వహించగా నివ్వెరపోయే నిజాలు వెలుగుచూశాయి. కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లి గ్రామంలో ఒక గోడౌన్‌ను ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుండే ఇతర రాష్ట్రాలకు రేషన్ బియ్యాన్ని లారీలు, వ్యాన్లు, ఆటోలు, ఇతరత్రా వాహనాల్లో సరఫరా చేస్తుండగా ఒకే రోజు దాదాపు రూ.2 లక్షల 50 వేల విలువైన 102.80 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో నిరుపేదలు, మధ్యతరగతికి చెందిన వారు అధిక ధర చెల్లించైనా సరే సన్న బియ్యం కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ బియ్యాన్ని విక్రయిస్తుండగా దళారులు, స్మగ్లర్లకు ఇది వరంగా మారింది. అంది వచ్చిన అవకాశాన్ని ఆర్థికంగా ఎదిగేందుకు అనుకూలంగా మలుచు‘కొని’ తెలంగాణ ప్రభుత్వ ఆశయానికి గండి కొడుతూ దండీగా దళారులు సంపాదిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ సబ్సిడీ బియ్యాన్ని పేదలకు అందకుండా అక్రమ మార్గాల్లో మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు తరలిస్తున్న దళారుల ఆటలు కట్టించేందుకు టాస్క్ఫోర్స్ పోలీసులు ఇకపై డేగకళ్లతో నిఘానియంత్రణ ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి వెల్లడించారు. ఇదే కాక పీడీఎస్ రైస్ స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు ఆధునిక సాంకేతిక పద్దతుల ద్వారా అక్రమార్కుల కదలికలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ అక్రమ రవాణా అడ్డుకుంటూ ప్రభుత్వ సబ్సిడీ బియ్యాన్ని పేదలకు సక్రమంగా అందించేలా అన్నిశాఖల సమన్వయంతో పని చేసేందుకు ప్రభుత్వం సంసిద్దతతో ఉందని, కోట్లాది రూపాయల సబ్సిడీకి గండికొట్టి దండీగా అక్రమ మార్గాల్లో అధిక సంపాదనకు అలవాటు పడిన వారిపై అవసరమైతే పీడీ యాక్టులు ప్రయోగిస్తామని సీపీ వి.బి.కమలాసన్‌రెడ్డి తెలిపారు.