తెలంగాణ

వౌలిక వసతులకు పదివేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 1: తెలంగాణలో వౌలిక వసతుల ప్రాజెక్టులకు పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టెందుకు మలేసియా ప్రభుత్వానికి చెందిన కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ బోర్డ్(సిఐడిబి) సంసిద్ధత వ్యక్తం చేసింది. మలేషియా పర్యటనలో ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు శుక్రవారం పలు కీలక సంస్థలతో సమావేశం అయ్యారు. సిఐడిబి సిఇఓ అబ్దుల్ లతీఫ్ హిటామ్‌తో సమావేశం అయ్యారు. బోర్డు వద్ద ఉన్న ఫండింగ్‌ను పలు దేశాల్లోని ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు లతీఫ్ సుముఖత వ్యక్తం చేశారు. మలేసియా దేశంలో నిర్మాణ రంగ సేవలు, పెట్టుబడులు, ఎగుమతులను పెంచడం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ సిఐడిబి సంస్థ ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఒక లేఖను సైతం రాసింది. సిఐడిబి సోదర సంస్థ ఆయిన సిఐడిబి హోల్డింగ్స్ ద్వారా తమ ప్రభుత్వం నిర్దేశించిన గోయింగ్ గ్లోబల్ విధానంలో భాగంగా పెట్టుబడులు ఉంటాయని తెలిపింది. పది వేల కోట్ల రూపాయల పెట్టుబడులను దీర్ఘకాలంలో జాతీయ రహదారులు, ప్రజా రవాణా వ్యవస్థ, హౌసింగ్ వంటి వౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు పెడతామని చెప్పారు. తమ సంస్థ ఇప్పటికే రాజస్థాన్‌తో పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయు కుదుర్చుకున్నదని, అదే పద్ధతిలో తెలంగాణలోనూ పెట్టుబడులు పెడతామని తెలిపింది. తమ సంస్థ కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలతోనూ చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. సిఐడిబి భారత దేశంలో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించిన తర్వాత తెలంగాణ పట్ల ఆసక్తి చూపిస్తున్నట్టు సంస్థ సిఇఓ అబ్దుల్ లతీఫ్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలను వివరించిన మంత్రి కెటిఆర్ సిఐడిబి సిఇఒ స్పందన పట్ల హర్షం వ్యక్తం చేశారు. సిఐడిబి పెట్టే పెట్టుబడులతో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఊతం లభించినట్టు అవుతుందని కెటిఆర్ తెలిపారు. ఈ పెట్టుబడులను యాన్యూటీ పద్దతిలో, స్విస్ చాలెంజ్ విధానంలో ఉంటాయని కెటిఆర్ తెలిపారు. సిఐడిబి సంస్థ ప్రతినిధి బృందం త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి వస్తుందని, వివిధ శాఖల్లో చేపడుతున్న ప్రాజెక్టులను పరిశీలిస్తుందని తెలిపారు.
నేషనల్ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రోగ్రామ్ అధినేత, ప్రధాని సలహాదారు డాటో తోకూడా కెటిఆర్ సమావేశం అయ్యారు. మలేషియా దేశాన్ని ఆర్థిక సంస్కరణలు, గవర్నమెంట్ ట్రాన్స్‌ఫర్మేషన్ కార్యక్రమం అనే మూడు అంశాల ఆధారంగా అభివృద్ధి చేసే వినూత్న కార్యక్రమం ‘పెమండు’ పనితీరును కెటిఆర్ అడిగి తెలుసుకున్నారు. ప్రతి శాఖకు ఉన్న ప్రత్యేక డాష్ బోర్డుల ద్వారా వాటి పనితీరును పర్యవేక్షిస్తున్న తీరును మంత్రి అభినందించారు. తెలంగాణలోనూ ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తే నేరుగా అన్ని శాఖలను రోజువారీగా పర్యవేక్షించడానికి వీలు కలుగుతుందని అన్నారు. ఈ డాష్ బోర్డుల వ్యవస్థ ఏర్పాటును పరిశీలించాలని కెటిఆర్ అధికారులను ఆదేశించారు.
మలేషియాలో అతి పెద్ద ఫార్మా కంపెనీ కెమికల్ కంపెనీ ఆఫ్ మలేసియా ఎండి అరిఫ్ అబ్దుల్ షతార్‌తో కెటిఆర్ సమావేశం అయ్యారు. తెలంగాణలో ఉన్న ఫార్మా కంపెనీలు, వాటికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మంత్రి వివరించారు. ఈ సంస్థ ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు ఫార్మా కంపెనీలతో వివిధ రంగాల్లో కలిసి పని చేస్తోంది. వాక్సిన్ల తయారీ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని కంపెనీ ఎండి కెటిఆర్‌కు తెలిపారు. ఎల్‌కెఎల్ ఇంటర్నేషనల్ అనే వైద్య ఉపకరణాల తయారీ సంస్థ ఎండి లిమ్‌కోన్ లియాన్‌తోను మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణలోని మెడికల్ డివైసెస్ మాన్యుఫాక్చరింగ్ పార్కులో పెట్టుబడులు పెట్టాలని కోరారు. తమ సంస్థ త్వరలోనే ఒక ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్‌కు పంపుతుందని ఎండి లిమ్‌కోన్ తెలిపారు. ఏసియా ఏరో టెక్నిక్ సంస్థతో సమావేశమైన మంత్రి ఏవియేషన్ రంగంలో శిక్షణ కార్యకలాపాలకు కలిసి రావాలని కోరారు. మూడు రోజుల పాటు సాగిన సింగపూర్, మలేసియా పర్యటనలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ ఉత్నతాధికారులు మంత్రి వెంట ఉన్నారు.