ఆంధ్రప్రదేశ్‌

కాటన్ బ్యారేజిపై దొంగలు పడ్డారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 1: తూర్పు గోదావరి జిల్లాలో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఉన్న సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజిపై దొంగలు పడ్డారు. బ్యారేజీ నిర్వహణలో కీలకమైన బ్రేక్ కాయల్స్ మాయమయ్యాయి. ఒక్కొక్కటి సుమారు రూ.10 వేలు విలువచేసే మొత్తం 140 కాయల్స్ మాయమయ్యాయి. గేట్ల ఎత్తివేతలో ఈ బ్రేక్ కాయల్స్ కీలకంగా పనిచేస్తాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు ఆలస్యంగా గుర్తించారు. బ్యారేజి గేట్లలో ఎంతో కీలకమైన బ్రేక్ కాయల్స్‌కే భద్రత లేదంటే ఇక బ్యారేజికి ఎంత భద్రత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదిపై ఉన్న ఎంతో కీలకమైన ఈ బ్యారేజి నిర్వహణలో అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. కీలకమైన బ్రేక్ కాయల్స్ దొంగలు ఎత్తుకుపోయారని ముగ్గురు ఎఇలు బొమ్మూరు, ధవళేశ్వరం, ఆత్రేయపురం పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి.
బ్యారేజి వద్ద నీటి మట్టాన్ని క్రమబద్ధీకరించడానికి గేట్లు ఉపయోగపడతాయి. ఈ గేట్లను పరిస్థితులకు అనుగుణంగా ఎత్తడానికి, దించడానికి బ్రేక్ కాయల్స్ కీలకంగా పనిచేస్తాయి. బ్యారేజిలోని నాలుగు ఆర్మ్‌లలో మొత్తం 175 గేట్లు ఉంటాయి. ఈ గేట్లకు రాగితో తయారుచేసిన బ్రేక్ కాయల్స్ ఉంటాయి. సాంకేతికపరమైన అవగాహన లేకుండా బయటివారెవరూ ఈ బ్రేక్ కాయల్స్ విప్పలేరు. అందువల్ల ఈ వ్యవహారంలో కచ్చితంగా ఇంటి దొంగల సహకారం ఉందని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బ్యారేజికి రూ.28 కోట్లతో మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగానే కాయల్స్ పోయినట్టు గుర్తించి, వాటి స్థానంలో కొత్తవి వేయడానికి బినామీ కాంట్రాక్టర్ పేరుతో బిల్లులు తయారు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఈ బ్రేక్ కాయల్స్ యథాతథంగా ఉన్నాయని, అవి పోయినట్టు కట్టుకథ అల్లి కొత్తవి కొన్నట్టుగా బిల్లులు సృష్టించి, పాతవాటినే మళ్లీ అమర్చాలని ప్రయత్నాలు జరిగినట్టు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మరమ్మతు పనులు చేస్తున్న కాంట్రాక్టు కంపెనీ మరో బినామీ కాంట్రాక్టు సంస్థ పేరుతో కొత్తగా బ్రేక్ కాయల్స్ వేస్తున్నట్టుగా బిల్లులు తయారు చేయడంతో ట్రేసర్ గుర్తించి, వాటిని పెండింగ్‌లో పెట్టినట్టు సమాచారం. దీనితో గత మే నెలలో ఈ బ్రేక్ కాయల్స్ పోయినట్టుగా గుర్తించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఇవికాక మరికొన్ని ఇతరత్రా మరమ్మతులు కలిపి దాదాపు రూ.90 లక్షల వరకు బిల్లులు పెట్టినట్టు తెలుస్తోంది. విజయవాడలో పాతవాటిని కొత్తగా తయారు చేసినట్టు నగిషీలు చెక్కి, అమర్చడానికి రంగం సిద్ధమయ్యిందని, ఈలోగా బిల్లులు ఆగిపోవడంతో అసలు విషయం బయటకొచ్చినట్టు తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ హరిబాబు విచారణకు ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దొంగతనం జరిగిందని ఇందుకు ముగ్గురు ఎఇలను బాధ్యులని పేర్కొంటూ విచారణ జరిపిన ఎస్‌ఇ ప్రాథమిక నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. ఈ ఘటనపై లోతైన విచారణ జరిపిస్తే కాయిల్స్ ఎక్కడున్నాయో, ఎలా తయారు చేసేందుకు ప్రయత్నించారో కూడా బయటపడతాయంటున్నారు. కాగా బ్యారేజి మరమ్మతు పనులపై కూడా విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ముగ్గురు ఎఇల సస్పెన్షన్
బ్యారేజి నిర్వహణలో పాల్గొనే ముగ్గురు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికార్లు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. కాశి సురేష్, కె రాజవౌళి, వి గంగరాజు అనే ఎఇలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని చీఫ్ ఇంజనీర్ హరిబాబు తెలిపారు. బ్రేక్ కాయల్స్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిసింది.