తెలంగాణ

అభివృద్ధి పేరుతో గ్రామాల ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, జూలై 4: బంగారు తెలంగాణలో మల్లన్నసాగర్ భూనిర్వాసితులను భాగస్వామ్యం చేయకుండా అభివృద్ధి పేరుతో గ్రామాలను ధ్వంసం చేయడం సరికాదని, ప్రజలను ఆగమాగం చేసి పెద్ద ప్రాజెక్టులు నిర్మించడం ఎందుకని ప్రొఫెసర్ హరగోపాల్ ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రజా పోరాటాల ముందు ప్రభుత్వాలు నిల్చిన దాఖలాలు లేవని, న్యాయం కోసం మల్లన్నసాగర్ నిర్వాసితులు చేస్తున్న పోరాటం సైతం అదే తరహాలో విజయం సాధించడం ఖాయమన్నారు. సోమవారం మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డకిష్టాపూర్‌లో సిపిఎం ఆధ్వర్యంలో మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు న్యాయం చేయడానికి చేపట్టిన పాదయాత్ర ముగింపు సభకు ఆయన హాజరై మాట్లాడారు. బంగారు తెలంగాణ అంటే తెలంగాణవాసులంతా వాటి ఫలాలను అనుభవించాలన్నారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు ఆ ఫలాలను అధికంగా అందించాల్సిన ప్రభుత్వం ఆ పరంగా చర్యలు చేపట్టకపోగా విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. దేశంలో ఎక్కడైనా ప్రాజెక్టులు, పరిశ్రమలకోసం ప్రభుత్వాలు సేకరించిన భూములకు ఇప్పటికీ సరైన పరిహారాలు చెల్లించకపోవడం వల్ల ఆ నిర్వాసితులు నేటికీ ఆందోళనలు చేస్తున్నారన్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఆ కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకునే పరిస్థితి ఎక్కడా లేదన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా వారి గ్రామాలను ముంచడం సరికాదన్నారు. నీటిరంగ నిపుణులు పెద్ద ప్రాజెక్టులు వద్దని, గొలుసు కట్ట చెరువులు, కుంటల ద్వారా సాగునీరు అందించవచ్చని చెబుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు సంఘటితంగా ఉండి అక్కడ ప్రాజెక్టు ఏర్పాటుకు వచ్చేవారిని రానివ్వకపోవడం వల్ల ఇప్పటికీ అక్కడ ప్రాజెక్టు జాడలేదని, అదే స్ఫూర్తితో ప్రజలు ఐక్యంగా ఉండి ఎదురుకాబోయే కలిగే నష్టాన్ని అడ్డుకోవాలన్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగేవరకు అండగా ఉంటామన్నారు. లక్ష్యంగా సిఎం కెసిఆర్ చేపట్టిన ప్రభుత్వం ఎంత మొండిగా వ్యవహరించినా న్యాయం ప్రజల పక్షానే ఉంటుందన్నారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం సాగర్ భూసేకరణపై 2013 చట్టాన్ని అమలు చేస్తామని చెబుతూనే 123 జిఓ ద్వారా భూసేకరణ చేస్తూ కోర్టును తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కెసిఆర్ ఎర్రవెళ్లి, నర్సన్నపేట గ్రామాలకే సిఎంగా వ్యవహరిస్తున్నారని, కూతవేత దూరంలో ఉన్న భూనిర్వాసిత గ్రామాల ప్రజలను ఓదార్చడానికి సమయం లేకుండా పోయిందా అని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో తడ్కపల్లి రిజర్యాయర్‌కు 18 వేల కోట్ల ప్రతిపాదనలు చేయగా దాన్ని సిఎం కెసిఆర్ 36 వేల కోట్లకు పెంచారన్నారు. తిరిగి రీడిజైనింగ్ పేరుతో 80 వేల కోట్లకు పెంచి 14 గ్రామాల ప్రజలను ముంచాలని చూస్తున్నారని విమర్శించారు. నిర్వాసితులకు న్యాయం కోసం న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రామయ్య, మాజీ ఎంపి సోలిపేట రాంచంద్రారెడ్డి, ప్రజా తెలంగాణ రాష్ట్ర నేత గాదె ఇన్నయ్య, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి రంగయ్య, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి హైమావతి, భూపోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ తదితరులు మాట్లాడారు.