తెలంగాణ

బీసీల ఆశాజ్యోతి బీపీ మండల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 25: సామాజిక సంఘర్షణల నుండి సామాజిక న్యాయం దిశగా దేశం పురోగతి సాధించడానికి బీపీ మండల్ సిఫార్సులు బాటలు వేశాయని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కే. కేశవరావు అన్నారు. మెజార్టీ జనాభా అయిన బీసీల సమగ్ర వికాసానికి, ఇంతటి సమున్నత స్థానానికి బీపీ మండల్ సేవలు నిరుపమానమైనవని ఆయన కొనియాడారు. మండల్ తన రాజకీయ జీవితంలో సోషలిస్టు భావాల అలోచనా పరుడిగా, సమసమాజాన్ని కాంక్షించారని, ఈ నేపథ్యంలొనే రాత్రింబవళ్లు కృషి చేసి, సమగ్రంగా ఆమోదయోగ్యమైన సిఫార్సులతో నివేదికను సమర్పించగలిగారని ఆయన పేర్కొన్నారు. మన దేశ సామాజిక న్యాయ చిత్రంలో మండల్ కమిషన్ సిఫార్సులు పెద్ద అలజడి సృష్టించాయని తెలిపారు. ఆదివారం నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్-12లో గల తన క్యాంపు కార్యాలయంలో బీపీ మండల్ 101వ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్.రాములు, సీనియర్ సభ్యుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, రాష్ట్ర యువజన సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఎ.కిరణ్ కుమార్‌తో పాటు పలు సంఘాల ప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్.రాములు రచించిన ‘బీసీల ఆశాజ్యోతి బీపీ మండల్’ పస్తకాన్ని డాక్టర్ కె.కేశవరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్.రాములు మాట్లాడుతూ అమలులో ఉన్న బీసీ రిజర్వేషన్లు పొంది, సముచితమైన అవకాశాలు స్వీకరించి, ఉన్నతమైన స్థానాలను కైవసం చేసుకున్నపుడే బీపీ మండల్‌కు నిజమైన నివాళి అన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ సీనియర్ సభ్యుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ బీసీలు మహోన్నతంగా ఎదగాలని ఆకాంక్షించిన బీపీ మండల్ సిసలైన బీసీల ఆత్మగౌరవ చిహ్నమని అన్నారు. ఆయన వర్థంతి, జయంతులను సామాజిక న్యాయ దినోత్సవంగా వాడవాడలా నిర్వహించుకోవాలని, సెమినార్లు, సదస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు సంగెం సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం...బీసీ కమిషన్ చైర్మన్ రాములు రచించిన బీసీల ఆశాజ్యోతి బీపీ మండల్
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న తెరాస పార్లమెంటరీ పార్టీ నాయకుడు డా. కె.కేశవరావు