తెలంగాణ

గుడ్డి వైద్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: జాతీయస్థాయిలోనే ప్రఖ్యాతి చెందిన హైదరాబాద్‌లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రి (ఎస్‌డిఇ ఆసుపత్రి)లో కంటి ఆపరేషన్ (కాటరాక్ట్) వికటించింది. 13 మందికి కంటిచూపు పోయే ప్రమాదం ఏర్పడగా, ఏడుగురిని వైద్యులు రక్షించారు. వీరికి చూపు తిరిగి వచ్చింది. మరో ఆరుగురికి ఇప్పటివరకు కంటిచూపు రాలేదు. సాధారణంగా కాటరాక్ట్ ఆపరేషన్ జరిగిన గంట రెండు గంటల్లోనే చూపు వస్తుంది. ఆపరేషన్ జరిగిన కొద్ది రోజులు రోగులు కంటికి విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్‌డిఇ ఆసుపత్రిలో గతనెల 30న 21మందికి వేర్వేరు థియేటర్లలో శ్రస్తచికిత్సలు నిర్వహించారు. ఆసుపత్రిలో ఏడు ఆపరేషన్ థియేటర్లు ఉంటే, రెండో నెంబర్ థియేటర్‌లో 13మందికి ఆరోజు కాటరాక్ట్ ఆపరేషన్ జరిగింది. రెండోరోజు వీరందరి కంటికి వేసిన ప్లాస్టర్లను తొలగించి చూసిన డాక్టర్లు షాక్ తిన్నారు. వీరికి చూపు రాకపోగా, కంటిలో ‘చీము’ (పస్) ఏర్పడినట్టు గుర్తించారు. దాంతో అందరికీ చూపుపోయింది. వెంటనే కంటివైద్యులు పేషంట్లను అత్యవసర చికిత్స నిమిత్తం ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స చేశారు. 13మందిలో ఏడుగురికి (కిష్టయ్య, సరళారాణి, సత్తయ్య, నాగలక్ష్మి, డొంగూరు, భీములు, పిసి మండల్) అనే వారికి తిరిగి చూపు వచ్చింది. వీరిని ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ చేశారు. మిగిలిన ఆరుగురు (అర్పితాబాయి, నూకాలతల్లి, ఎం ప్రభావతి, ఎస్ అంజిరెడ్డి, సిహెచ్ మాణిక్యం, సత్యనారాయణ) అనే వారికి ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక చికిత్సకు వీరి కళ్లు స్పందిచలేదు. దాంతో గత ఐదురోజుల నుంచి తిరిగి చిన్న ఆపరేషన్లు చేసి కంటిచూపు తెప్పించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. ఎస్‌డిఇలోనే ఈ రోగులకు చికిత్స అందిస్తున్నారు.
జూన్ 30న ఆపరేషన్ జరిగిన సమయంలో కంటిని శుభ్రం చేసేందుకోసం ‘రింగర్ లాక్టేట్’ (ఆర్‌ఎల్) అనే సొల్యూషన్‌ను ఉపయోగించారు. ఈ సొల్యూషన్‌లో క్లెప్సిల్లా బాక్టీరియా ఏర్పడ్డదని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మందును ‘హసీబ్ ఫార్మసీ’ కంపెనీ సరఫరా చేసిందని అధికార వర్గాలు వెల్లడించారు. ప్రభుత్వానికి సంబంధించిన ఆసుపత్రులకు అవసరమైన మందులను సరఫరా చేసే బాధ్యత తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపట్టింది. ఎస్‌డిఇ ఆసుపత్రిలో ఉన్న ఈ తరహా మందులను సీజ్ చేశారు. పరీక్షల కోసం వేర్వేరు లాబోరేటరీలకు పంపించారు. తొలుత అందిన సమాచారం ప్రకారం మందు సీసాలో క్లెప్సిల్లా బాక్టీరియా చేరడమే కంటిచూపు పోవడానికి కారణమని తేలింది.
రోజూ 50 ఆపరేషన్లు: డిఎస్
సరోజినీ ఆసుపత్రిలో రోజూ దాదాపు 50 మందికి కంటి ఆపరేషన్లు చేస్తామని, నెలకు 1000 నుండి 1200 వరకు ఆపరేషన్లు జరుగుతాయని ఆసుప్రతి ఇంచార్జి సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తున్న డిప్యూటీ సూపరింటెంటెంట్ డాక్టర్ రాజేందర్ గుప్తా తెలిపారు. బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తన 31 ఏళ్ల సర్వీసులో ఈ తరహా సంఘటన జరగడం ఇదే తొలిసారన్నారు. ఆపరేషన్ చేసిన వైద్యులది ఎలాంటి తప్పు లేదని, కంటిని శుభ్రం చేసేందుకు ఉపయోగించిన మందు వల్లనే ప్రమాదం జరిగిందని వెల్లడించారు. కంటిచూపు రాని వారందరికీ ప్రత్యేక చికిత్స చేస్తున్నామని, ఇప్పటి వరకు ఏడుగురికి చూపు వచ్చిందని, రెండు కేసులకు సంబంధించి పరిస్థితి విషమంగా ఉందని, మిగతా నలుగురికి చూపు వచ్చే అవకాశాలున్నాయని వివరించారు. ఈ సంఘటనపై విచారణ చేస్తున్నామని ఆసుపత్రి ఇంటర్నల్ విచారణ కమిటీకి సారథ్యం వహిస్తున్న డాక్టర్ ఎస్ రవీందర్‌గౌడ్ మీడియాకు తెలిపారు. ఒకటి రెండురోజుల్లో తాము నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు.

చిత్రం... చూపు కోల్పోయన బాధితులు. ప్రమాదానికి కారణమని భావిస్తున్న రింగర్ లాక్టేట్ సొల్యూషన్‌ను చూపుతున్న వైద్యులు