తెలంగాణ

పౌరసరఫరాల శాఖను నెం. 1గా అభివృద్ధి చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 10: సివిల్ సప్లై శాఖలో లోపాలకు తావివ్వకుండా తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుపుతానని, కరీంనగర్ అంటేనే సీఎం కేసీఆర్‌కు వల్లమాలిన అభిమానంతోనే రాష్ట్ర కేబినెట్‌లో నలుగురికి చోటిచ్చారని, కేసీఆర్ కళ్లల్లో ఆనందం కలిగే దిశగా మంత్రులమంతా కలిసి కట్టుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, సివిల్ సప్లై, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్,బాబు జగ్జీవన్ రాం, తెలంగాణ తల్లి, జయశంకర్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం మినీ పద్మనాయక కల్యాణమంటపంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ అంటే కేసీఆర్‌కు ఆదినుంచి అమితమైన ప్రేమ ఉందని, అందుకే ఉత్తర తెలంగాణ భవన్ కరీంనగర్‌లో నిర్మించారని, ఇక్కడి నుంచే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి స్వరాష్ట్రం సాధించారనే సెంటిమెంట్ ఉందన్నారు. రాష్ట్రంలో ఇదివరకే ఇద్దరు మంత్రులు ఉండగా, మాజీ ఎంపీ వినోద్‌కు కేబినెట్ స్థాయి పదవి ఇచ్చి రెండోసారి అధికారంలోకి వచ్చాక మంత్రివర్గ విస్తరణలో రెండోసారి మరో ఇద్దరికి మంత్రులుగా చోటు కల్పించారని అన్నారు. తాను టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ పిలుపుమేరకే 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆరు నెలలకే తెలంగాణ వాదాన్ని వినిపించేందుకు ప్రజాపక్షాన నిలిచి పదవిని వదులుకునేందుకు వెనుకాడ లేదనే నమ్మకంతోనే 2014లో తెరాస టికెట్ ఇచ్చిందని, 2018లో కూడా టికెట్ ఇవ్వగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కరీంనగర్ జనం రుణం తీర్చుకున్నందుకు అంకితభావంతో పని చేస్తానన్నారు. 2000లో తొలిసారిగా కౌన్సిలర్‌గా గెలిపించి ఆ తరువాత కార్పొరేటర్, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు ఊపిరున్నంత వరకు సేవ చేస్తానన్నారు. సీఎం కేసీఆర్ అందరినీ డిక్షనరీలా నడిపిస్తారని, మనకు తెలియని ఎన్నో విషయాలు ఆయన్నుంచి నేర్చుకోవచ్చన్నారు. కేసీఆర్ ఓ మానవతావాదని, ప్రజల కష్టాలు, కన్నీళ్లు తుడిచేందుకు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచన చేస్తుంటారన్నారు. ఏడు దశాబ్దాలుగా ఎవరూ చేయని అభివృద్ధి పనులను తెలంగాణ వ్యాప్తంగా చేసి చూపిస్తున్నారని, మానేరుపై కేబుల్ బ్రిడ్జి త్వరలో పూర్తవుతుందని అన్నారు. కరీంనగర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, మంత్రి పదవి వస్తుందని మొదట ఆశించినా దక్కకపోవడంతో నిరాశచెందకుండా నమ్మకంతో పనిచేసే వారికి ఎప్పుడే పదవి ఇవ్వాలో సీఎంకు తెలుసని గంగుల అన్నారు. నగరాభివృద్ధికి ఎన్ని నిధులడిగినా కాదనకుండా ఇచ్చారని, 2018లో కేసీఆర్ బొమ్మతోనే 88 స్థానాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచామన్నారు. ఆయనను చూసే ప్రజలు తమకు పట్టం కట్టారని, ప్రజలకున్న నమ్మకమే ఇందుకు నిదర్శనమని, పార్టీ, ప్రజల కోసం చివరి రక్తం ధారపోయడానికైనా సిద్ధమేనన్నారు. పార్టీకోసం సూసైడ్‌స్క్వాడ్‌గా ఉంటా, ఇంతకాలం మచ్చలేకుండా బతికా, ఇకపై కూడా అలాగే మరింత బాధ్యతతో పనిచేస్తా, మంత్రి ఈటలతో పాటు పార్టీలోని అందరం టీం వర్క్‌తో పనిచేస్తామని అన్నారు. తనకు కేటాయించిన శాఖల పట్ల సంతృప్తిగా ఉన్నానని, వెనుక బడిన కులాల అభివృద్ధికి కృషి చేస్తానని, సీఎం మొఖంలో చిరు నవ్వు కనిపించేలా పనిచేసి నమ్మకాన్ని పెంపొందిస్తారన్నారు. రైస్‌మిల్లర్లు ప్రభుత్వానికి, ప్రజలకు అనుకూలంగా ఉంటే ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని, పౌరసరఫరాలలో అక్రమాలకు పాల్పడి తెలంగాణ సర్కార్‌కు చెడ్డ పేరు తీసుకురావద్దన్నారు. కరీంనగర్‌లో రేపటి నుండి స్మార్ట్ సిటీ పనులు వేగంగా చేపట్టి రోడ్లన్నీ సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. మాజీ ఎంపీ వినోద్ కృషి వల్లే స్మార్ట్ సిటీగా కరీంనగర్ ఎంపికైందని, దసరా లోపు ఐటి టవర్ ప్రారంభించేందుకు ప్రణాళికాయుతంగా ముందుకెళ్తున్నామన్నారు. ఇది పూర్తయితే 3,600 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తాను గతంలో ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటానని, ఆడంబరాలకు దూరంగా, అభివృద్ధికి అంకితభావంతో పని చేస్తానన్నారు.
భవిష్యత్‌లో ఏ ఎన్నికలొచ్చినా కారు జోరే కొనసాగుతోందని, రివర్‌ఫ్రంట్ రూ.506 కోట్లకు జీఓ ఇచ్చారు. ఈసారి క్యారీఫార్వర్డ్ అవుతుందని అన్నారు. కరీంనగర్‌లో మెడికల్ కాలేజీ కోసం కేంద్రం నుంచి ప్రయత్నం చేస్తున్నామని, తన శాఖపై త్వరలో పూర్తిస్థాయిలో అవగాహన తెచ్చుకొని అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా నాణ్యతతో కూడిన అభివృద్ధి పనులను చేపట్టేందుకు సీరియస్ యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తానని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఈ సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, సుడా చైర్మన్ జి.వి.రామకృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్