తెలంగాణ

కృష్ణా, తుంగభద్ర నదుల ఉగ్రరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 10: మరోసారి ఈ ఏడాది కృష్ణా, తుంగభద్ర నదులకు వరద వచ్చింది. కర్నాటక, మహారాష్టల్రో కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని నదులకు జల కళ మళ్లింది. కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద ప్రవాహం మరింత పెరిగింది. మంగళవారం కృష్ణా, తుంగభద్ర నదులు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉగ్రరూపం దాల్చాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి తుంగభద్ర నది నుండి సుంకేసుల ప్రాజెక్టు ద్వారా అదేవిధంగా కృష్ణానది నుండి వస్తున్న వరద జూరాల నుండి శ్రీశైలం ప్రాజెక్టుకు దాదాపు 3.65 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. రెండు నదుల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన ఆరు గేట్లు 23 అడుగుల ఎత్తున ఎత్తి నాగార్జునసాగర్ ప్రాజెక్టులో దాదాపు 3.50 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న రాయలసీమ ప్రాంతానికి సాగుతాగు నీరు అందించే పలు ఎత్తిపోతల పథకాల ద్వారా సైతం 31675 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. అందులో ప్రధానంగా పోత్తిరెడ్డిపాడుకు 28500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. హాంద్రీనివాకు 2100 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2400 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి ఎత్తిపోస్తున్నారు. ఇకపోతే కర్నాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు నీటి సామర్థ్యం మొత్తం 129 టీఎంసీలు కాగా ప్రాజెక్టులో దాదాపు 106 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి నారాయణపూర్ ప్రాజెక్టులోకి 2.13 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దాంతో నారాయణపూర్ ప్రాజెక్టు 37 టీఎంసీల నీటి కెపాసిటీకి గాను 35 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి జూరాల ప్రాజెక్టులోకి వరద నీటిని విడుదల చేశారు.
దాంతో జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వస్తుంది. దాంతో జూరాల ప్రాజెక్టుకు సంబంధించిన 23 గేట్లు ఎత్తివేసి శ్రీశైలం ప్రాజెక్టులోకి 2.44 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం పెరగడంతో బీచ్‌పల్లి దగ్గర కృష్ణానది నిండుకుండలా ప్రవహిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద వస్తుండడంతో సోమశిల సంగమం దగ్గర కొండల మధ్య నది ఉగ్రరూపం దాలుస్తూ ప్రవహిస్తుంది. తుంగభద్ర నది నుండి వస్తున్న వరదతో సుంకేసు డ్యాంకు సంబందించిన 22 గేట్లు ఎత్తి దాదాపు 1.10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దాంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి తుంగభద్ర నది ప్రవాహం కూడా వస్తుంది. నది ప్రవాహంతో అలంపూర్ దగ్గర తుంగభద్ర నది నిండుకుండలా ప్రవహిస్తూ శ్రీశైలం ప్రాజెక్టులోకి పరుగులు తీస్తుంది. ఇకపోతే ఈ సీజన్‌లో రెండుమార్లు కృష్ణా, తుంగభద్ర నదులకు వరద రావడంతో రెండు నదులపై గల ప్రాజెక్టులకు జల కళ మళ్లింది. ఆగస్టు మాసంలో ప్రాజెక్టుల గేట్లు తెరుచుకుని కనువిందు చేసిన దృశ్యాలు మరువకముందే మరోసారి రెండు నదులకు వరద రావడం దాంతో ప్రాజెక్టులకు సంబంధించిన గేట్ల ఎత్తివేస్తుండడంతో మళ్లీ ప్రాజెక్టుల జల దృశ్యాలను తిలకించేందుకు ప్రజలు తరలివస్తున్నారు. దాంతో శ్రీశైలం వెళ్లే రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. నల్లమల అటవీ ప్రాంతంలోని ఘాట్‌రోడ్డ దగ్గర వాహనాల రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడింది. జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగా గల ఎత్తిపోతల పథకాల మోటార్లను మళ్లీ ఆన్ చేశారు. మోటార్లు ఆన్ చేయడంతో జూరాల బ్యాక్‌వాటర్‌ను నెట్టెంపాడు ప్రాజెక్టుకు 750 క్యూసెక్కులు, భీమా లీప్ట్-1కు 650 క్యూసెక్కులు, భీమా లీఫ్ట్-2కు 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు 630 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. జూరాల ప్రాజెక్టు ఆయకట్టుకు సంబంధించిన ఎడమ కాల్వకు 900 క్యూసెక్కులు, కుడికాల్వకు 750 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వరద మళ్లీ రావడంతో జిల్లాలోని ప్రాజెక్టులకు జల కళ మళ్లింది. కాగా నది ప్రవాహం పెరుగుతుండడంతో నది తీర ప్రాంత ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేశారు. అయా జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు నది తీర ప్రాంతాలలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారు.
చిత్రం... ఆరు గేట్లు తెరవడంతో నాగార్జునసాగర్‌కు పరుగులు తీస్తున్న కృష్ణమ్మ