తెలంగాణ

రాజుకున్న హుజూర్‌నగర్ ఉప ఎన్నిక సెగలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 13: హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక దగ్గరపడుతున్న నేపధ్యంలో నియోజకవర్గంలోని అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్య పరస్పర రాజకీయ విమర్శల సెగలు రాజుకుంటున్నాయి. హుజూర్‌నగర్ నుంచి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లగొండ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికకావడంతో ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికకు త్వరలోనే నోటిఫికేషన్ రానుండటంతో నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య రాజకీయ పోరు ఉధృతమవుతోంది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా పరిధిలోని ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ గెలుపు బాధ్యత మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిపై ఉండటంతో ఈ నియోజకర్గంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ పోరు కాస్తా జగదీశ్‌రెడ్డి వర్సెస్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నట్లుగా సాగుతుంది. హుజూర్‌నగర్ ప్రజలను ఆకర్షించే క్రమంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్త్తూ బుధవారం ధర్నా నిర్వహించి ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. రాజకీయ ద్వేషంతో నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు పూర్తి చేయడం లేదని, ఠాణాలు, ప్రభుత్వ కార్యాలయాలను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగంతో, ప్రతిపక్ష కార్యకర్తలపై కేసులు బనాయిస్తు ఉప ఎన్నికల్లో గెలుపుకు ఎత్తులు వేస్తున్నారంటు ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై ఉత్తమ్ చేసిన విమర్శలపై ఆగ్రహంతో ఉన్న మంత్రి జగదీశ్‌రెడ్డి శుక్రవారం మేళ్లచెర్వు, మఠంపల్లి మండలాల్లో సాగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి విమర్శలకు దిగారు. ఉత్తమ్ నాయకత్వ వైఫల్యంతోనే హుజూర్‌నగర్ నియోజకవర్గం అభివృద్ధి వెనుకబడిందని, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఒరగబెట్టిందేమీ లేదని, ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎన్నికై, ఇప్పుడు ఎంపీగా ఎన్నికైనా ఏనాడూ ఈ నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికిగాని, మంత్రుల దృష్టికిగానీ తీసుకురాలేదని, వచ్చి ఒక్క వినతి పత్రం ఇవ్వలేదంటూ విమర్శలు గుప్పించారు. ఒక్క రోజు వ్యవధిలో ఉత్తమ్, జగదీశ్‌రెడ్డిల మధ్య రేగిన మాటల యుద్ధం నియోజకవర్గంలో ఉప ఎన్నికల వేడిని ఒక్కసారిగా పెంచేసింది.
గెలుపునకు పోటాపోటీ ముందస్తు వ్యూహాలు
హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన సతీమణి పద్మావతిని నిలిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్ నుంచి గత ఎన్నికల్లో ఉత్తమ్‌కు గట్టిపోటీ ఇచ్చిన పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి శానంపూడి సైదిరెడ్డినే మరోసారి పోటీకి దించవచ్చని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఉత్తమ్‌పై స్వల్ప మెజార్టీతో ఓడిన సానుభూతి ఈ దఫా సైదిరెడ్డి గెలుపునకు దోహదం చేస్తుందని గులాబీ వర్గాలు నమ్ముతున్నాయి. అయితే హుజూర్‌నగర్ బరిలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరు కూడా ప్రచారంలో వినిపిస్తోంది. మరోవైపు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకుని సంచలనం రేపిన బీజేపీ కూడా హుజూర్‌నగర్ నియోజకవర్గం గెలుపు లక్ష్యంతో బలమైన అభ్యర్థిని రంగంలో దించే వ్యూహంతో ఉండటం ఉప ఎన్నికను ఆసక్తికరంగా మారుస్తోంది. టీడీపీ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మద్దతునిస్తుందా? లేక అభ్యర్థిని పోటీకి నిలుపుతుందో వేచి చూడాల్సివుంది. మొత్తం మీద నోటిఫికేషన్ రాకముందే హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఎన్నికల పోరు ఉద్ధృతమవుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.