తెలంగాణ

చర్చ ఇదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శాసనసభ నిబంధనలు, నియమావళికి లోబడే చర్చ జరుగుతోందా? అన్న అంశంపై అధికారపక్షం, కాంగ్రెస్ పక్షం సభ్యుల మధ్య మంగళవారం అసెంబ్లీలో తీవ్ర వాగ్వివాదం జరిగింది. కాంగ్రెస్ పక్షం సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతుండగా రెండు పక్షాలకు చెందిన సభ్యులు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఒక దశలో స్పీకర్ కూడా జోక్యం చేసుకుని సభ్యులను చల్లబరిచారు.
శాసనసభలో వివిధ డిమాండ్లపై జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పాల్గొంటూ, కేసీఆర్ హయాం లో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు. వివిధ ప్రాజెక్టుల పనులకు సంబంధించి రూ.25 వేల కోట్లు బకాయిలుగా ఉన్నాయని, వీటిని చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. బడ్జెట్ లేకపోయినా టెండర్లు పిలిచి పని అప్పచెబుతున్నారని, శివన్నగూడా ప్రాజెక్టుకు సంబంధించి రైతుల భూములకు డబ్బు చెల్లించలేదని గుర్తు చేశారు.
ఈ దశలో టీఆర్‌ఎస్ సభ్యుడు దానం నాగేందర్ జోక్యం చేసుకుంటూ అన్ని దేశాలు అప్పు ల్లో ఉన్నాయని అన్నారు. డిమాండ్లపైనే కోమటిరెడ్డి మాట్లాడాలంటూ సూచించారు. దాంతో కాంగ్రెస్ పక్షం
నాయకుడు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, దానం నాగేందర్ మంత్రి అని అనుకుంటున్నారేమో? ఆయన తన హద్దులు ఎరిగి మాట్లాడాలన్నారు. ఈ దశలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ, కోమటిరెడ్డి బ్రదర్స్‌కు పబ్లిసిటీ పిచ్చి ఉందని, రాజగోపాల్‌రెడ్డి కన్‌ఫ్యూజన్ మాస్టరన్నారు. దాంతో రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తలసాని ఒక పార్టీ నుండి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవి చేపట్టారన్నారు. గజ్వేల్, సిద్ధిపేట, సిర్సిల్లా, చింతమడక, ఎర్రవెల్లి గ్రామాలు, పట్టణాలపై ప్రత్యేక ప్రేమ చూపిస్తూ భారీగా నిధులు ఇస్తున్నారని, రాష్ట్రంలోని ఇతర గ్రామాలు, పట్టణాలకు కూడా అదే రకంగా నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చింతమడక గ్రామస్తులకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల, 20 లక్షల రూపాయల చొప్పున ఇస్తూ, ఇతర గ్రామాలను విస్మరిస్తున్నారన్నారని ఆరోపించారు.
ఈ దశలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకుంటూ రాజగోపాల్‌రెడ్డి సబ్జెక్ట్ నుండి దారిమళ్లుతున్నారని, అలా దారిమళ్లితే మైక్ కట్ అవుతుందని హెచ్చరించారు.
మళ్లీ కోమటిరెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరాన్ని డల్లాస్ (అమెరికా), ఇస్తాంబుల్ తరహాలో అభివృద్ధి చేస్తామంటూ మున్సిపల్ వ్యవహారాల మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. మూసీ నది అభివృద్ధి కోసం 4000 కోట్ల రూపాయలు వ్యయం చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేస్తూ, మూసి అభివృద్ధి ఎందుకు చేయలేదని నిలదీశారు.
ఈ దశలో మంత్రి తలసాని మరోపర్యాయం అడ్డుకుంటూ, కోమటిరెడ్డి సొంత జిల్లా అయిన నల్లగొండ ఫ్లోరైడ్‌తో నిండి ఉండగా, తమ ప్రభుత్వం తాగునీటిని అందిస్తోందన్నారు. బిల్లులు చెల్లించే అంశం ప్రభుత్వం చూసుకుంటుందని నీకెందుకు అంటూ కోమటిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిమాండ్లపైనే కోమటిరెడ్డి మాట్లాడాలని సూచించారు. ఈ దశలో స్పీకర్ మళ్లీ జోక్యం చేసుకుంటూ సభ్యులెవరూ సబ్జెక్ట్‌ను అతిక్రమించి మాట్లాడవద్దని హెచ్చరించారు. రాజగోపాల్‌రెడ్డి మళ్లీ మాట్లాడుతూ, కాళేశ్వరం పనులను సీమాంద్ర కాంట్రాక్టర్ల చేత చేయించారంటూ మండిపడ్డారు. ఈ దశలో రోడ్లు, భవనాల మంత్రి వేముల ప్రశాంతరెడ్డి జోక్యం చేసుకుంటూ కాంట్రాక్ట్‌లు తప్ప ఇతర విషయాలు మాట్లాడరా అంటూ రాజగోపాలరెడ్డిని ప్రశ్నించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పనులకు కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదంటూ కోమటిరెడ్డి ఆరోపించారు.

*చిత్రం... కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి