తెలంగాణ

బోసిపోయిన టి-సచివాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: వరుస సెలవులు, ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా హరిత హారంలో పాల్గొనడంతో తెలంగాణ సచివాలయం బోసి పోయింది. రంజాన్‌కు రెండు రోజుల సెలవు ఇచ్చారు. ఆ వెంటనే రెండవ శనివారం, ఆదివారం రావడంతో వరుసగా ప్రభుత్వ కార్యాలయాలు పని చేయలేదు. వరుసగా నాలుగు రోజుల సెలవులు అని ఒక రోజు ముందుగానే కొందరు వెళ్లిపోయారు. ఇక మంత్రులు రంజాన్ కన్నా ముందు నుంచే హరిత హారం ఏర్పాట్ల కోసం జిల్లాల్లో మకాం వేశారు. దాదాపు వారం రోజుల నుంచి సచివాలయంలో కార్యకలాపాలు మందగించాయి. ఉన్నతాధికారులు, మంత్రులు సచివాలయానికి రాకపోవడం వల్ల అధికారిక కార్యకలాపాలు జరగలేదు. ఉద్యోగులు సైతం ముందస్తుగానే సెలవుల మూడ్‌లోకి వెళ్లడంతో పనులు నత్తనడక నడిచాయి. ఇక హరిత హారంతో మంత్రులు సచివాలయానికి వారం రోజుల వరకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఎమ్మెల్యేలు సైతం హరిత హారంలో బిజీగా ఉంటున్నారు. తొలి విడత హరిత హారం పెద్ద ఎత్తున చేపట్టినా వర్షాలు లేకపోవడం వల్ల అనుకున్న స్థాయిలో విజయం కాలేదు. ఇప్పుడు మంచి వర్షాలు కురుస్తుండడంతో ముందుగానే హరిత హారంకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మంత్రులు, ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి ముందే సూచించడంతో మంత్రులు ఏర్పాట్లలో మునిగిపోయారు.
230 కోట్ల మొక్కల లక్ష్యం
మొత్తం 230 కోట్ల మొక్కలు నాటాలనేది ప్రభుత్వ లక్ష్యం. గత సంవత్సరం భారీ ఎత్తున హరిత హారం ప్రారంభించినా వర్షాలు కురవక పోవడం వల్ల నిరాశ కలిగించింది. దాంతో గత సంవత్సరం మధ్యలోనే నిలిపివేశారు. ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో మొక్కలు నాటాలని నిర్ణయించారు. వారం రోజుల పాటు జరిగే హరిత హారంపై అందరి దృష్టి పడే విధంగా ఒక్కో చోట ఒక్కో ప్రత్యేకతతో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 165 కిలో మీటర్ల దూరం వరకు ఒకేసారి మొక్కలు నాటి అరుదైన రికార్డు సృష్టించారు. పంచాయితీరాజ్ శాఖ ద్వారా ఈనెల 12న మహిళల ద్వారా ఒకే రోజు కోటి మొక్కలు నాటించనున్నారు. మహిళా సంఘాల సభ్యులు ఒక్కొక్కరు ఐదు మొక్కలు నాటే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక 11న హైదరాబాద్‌లో రికార్డు సృష్టించే విధంగా ఒకే రోజు 25లక్షల మొక్కలు నాటేందుకు ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు ఏర్పాట్లు చేశారు. సోమవారం ముఖ్యమంత్రి కెసిఆర్ నిమ్స్‌లో మొక్కలు నాటుతారు. ఇక కెటిఆర్‌తో పాటు నగర మంత్రులు వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటనున్నారు. ప్రధానంగా ఐటి కారిడార్‌పై దృష్టిసారించారు. ఐటి ఉద్యోగులను సైతం భాగస్వాములను చేసి భారీ ఎత్తున హైటెక్ సిటీలో మొక్కలు నాటనున్నారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్‌లో, నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలో, మహేందర్‌రెడ్డి రంగారెడ్డిలో ఆదివారం భారీ ఎత్తున మొక్కలు నాటారు. మొత్తం 105 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సోమవారం హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నాయి. బయోడైవర్సిటీ పార్క్, రాయదుర్గం ఇంటర్నల్ రోడ్, సాఫ్ట్‌వేర్ యూనిట్స్ లే ఔట్ నుంచి గచ్చిబౌలి వరకు మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రులు పాల్గొంటారు.
టిసిఎస్ క్యాంపస్, బయోడైవర్సిటీ పార్క్, మూసీ పరివాహక ప్రాంతంలో ఉప్పల్‌లో భగాయత్ భూముల్లో, జవహర్‌నగర్, మల్లారెడ్డి కాలేజీలో కెటిఆర్ మొక్కలు నాటుతారు. బిహెచ్‌ఇఎల్‌లో గవర్నర్ నరసింహన్‌తో కలిసి కెటిఆర్ మొక్కలు నాటుతారు.