తెలంగాణ

పార్లమెంటు సమావేశాల్లో ఆర్టీసీ సమ్మె అంశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఆర్టీసీ సమ్మె అంశాన్ని లేవనెత్తుతామని సీపీఐ జాతీయ కార్యదర్శి, ఎంపీ బినయ్ విశ్వం చెప్పారు. సమ్మెను తెలంగాణ ప్రభుత్వం ఆటవికంగా అణచివేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అప్రజాస్వామికమని పేర్కొన్నారు. న్యాయమైన డిమండ్ల కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను సీపీఐ , ఎఐటీయూసీ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాయని చెప్పారు. నిరవధిక దీక్షలో ఉండగా పోలీసులు ఆర్టీసీ జాక్ కో కన్వీనర్ కే రాజిరెడ్డిని అరెస్టు చేశారని తెలుసుకున్న విశ్వం పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి పరామర్ళించారు. ఈ సందర్భంగా విశ్వం పాత్రికేయులతో మాట్లాడుతూ పాలకులు అన్ని రకాల హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. ధర్నాచౌక్‌లో సైతం దీక్షలకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని పేర్కోన్నారు. ఎలాంటి నిరసనలకూ అవకాశం ఇవ్వకపోతే ఇక ధర్నా చౌక్ ఎందుకని నిలదీశారు. ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ నిధులను దారిమళ్లించారని , ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని అన్నారు. కేసీఆర్ పాలన చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంతృత్వంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని చెప్పారు.
జాక్ నేతలపై నిర్బంధం తగదు: సీపీఐ కార్యదర్శి చాడ
నిరవధిక దీక్ష చేస్తున్న ఆర్టీసీ జాక్ నేతల పట్ల పోలీసులు, నిర్బంధ కాండను అమలుచేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. జాక్ నేతలను ఇంట్లోనే నిర్బంధించారని, నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న నేతలను కొట్టడం అప్రజాస్వామికమని, అమానుషమని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలకు ఆహ్వానించి కార్మికులు సమ్మె విరమించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
పీఎఫ్ కమిషనర్‌తో
ఆర్టీసీ అధికారుల భేటీ

హైదరాబాద్, నవంబర్ 16: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ కార్మికుల భవిష్యనిధి(పీఎఫ్)కి చెల్లించాల్సిన బకాయిలు దాదాపురూ. 1,660 కోట్లు ఉన్నాయి. ఈ మేరకు ప్రాంతీయ భవిష్యనిధి (పీఎఫ్) కమిషనర్ రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులకు నోటీసులు పంపించారు. నోటీసులకు స్పందించిన ఆర్టీసీ అధికారులు పీఎఫ్ కమిషనర్ ముందు హాజరు అయ్యారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల భవిష్యనిధికి బకాయిలు దాదాపు రూ.760 కోట్లు, ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులకు దాదాపురూ. 900 కోట్లు బకాయిలు ఉన్నట్లు కమిషనర్ వెల్లడించారు. తెలంగాణ అధికారులు బకాయిలను చెల్లించడానికి గడువుకోరారు. ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు మాత్రం బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని కమిషనర్‌కు తెలిపారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కారణంగా పీఎఫ్ బకాయిలను చెల్లించడానికి నిధులు లేవని చెప్పారు. గడువుఇస్తే బకాయిలను చెల్లిస్తామని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.
పీసీసీ పదవి ఇస్తే
2023 ఎన్నికల్లో పోటీ చేయను
* 20 తర్వాత ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌ను కలుస్తా
* కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

హైదరాబాద్, నవంబర్ 16: పీసీసీ అధ్యక్ష పదవిని తనకు అప్పగిస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇప్పటి నుంచే పార్టీ గెలుపునకు కృషి చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా కొత్త నేతను నియమిస్తారనే ఏఐసీసీ ఆలోచనలతో రాష్ట్ర కాంగ్రెస్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ నెల 20వ తేదీన తాను ఢిల్లీకి వెళ్లి పార్టీ హైకమాండ్‌ను కలసి పీసీసీ పదవిని ఇవ్వాలని కోరనున్నట్లు చెప్పారు. తనకు అధికార పదవుల పట్ల వ్యామోహం లేదని, పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి మంచి చేస్తారని ప్రజలు భావించి రెండోసారి ఎన్నుకుంటే నియంతగా మారి ప్రజలను హింసిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. గత 40 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా పట్టించుకోకుండా సీఎం కాలయాపన చేస్తున్నారన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. ఆర్టీసీ సమస్య కేవలం ఆ సంస్థ ఉద్యోగులది కాదన్నారు. ప్రైవేటీకరణ చేస్తే బస్సు ఆపరేటర్లు లాభాపేక్షతో పనిచేస్తారన్నారు. ప్రజలు కూడా ముందుకు వచ్చి ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలియజేయాలన్నారు. కాగా, ఆర్టీసీ కార్మికులు ఈ నెల 19వ తేదీన చేపట్టనున్న సడక్ బంద్‌ను విజయవంతం చేస్తామన్నారు. సంగారెడ్డి వద్ద జాతీయ రహదారిని దిగ్బంధనం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
సీఎం వైఖరి అప్రజాస్వామికం
*ఏఐటీయూసీ, సీఐటీయూ నేతల ధ్వజం

హైదరాబాద్, నవంబర్ 16: ఆర్టీసీ కార్మికులు 43 రోజులుగా సమ్మె చేస్తున్నా వారి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని, సీఎం వైఖరి అప్రజాస్వామ్యమని, నియంతలా వ్యవహరిస్తున్నారని ఎఐటీయూసీ, సీఐటీయూ నేతలు వేర్వేరుగా విడుదల చేసిన ప్రకటనల్లో పేర్కొన్నారు. ఎఐటీయూసీ అధ్యక్షుడు ఎస్ బాలరాజ్, ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, సీఐటీయూ అధ్యక్షుడు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి ఎ సాయిబాబు, రాష్ట్ర కమిటీ సభ్యుడు వై సోమన్న ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఆర్టీసీలో విలీనం డిమాండ్‌ను పక్కన పెట్టినట్టు జాక్ నేతలు ప్రకటించినా, ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రావడం లేదని అన్నారు. నిరవధిక దీక్షకు అనుమతి కోరితే దానిని కూడా ప్రభుత్వం నిరాకరించిందని, దీంతో జాక్ నేతలు ఎంప్లాయిస్ యూనియన్ ఆఫీసులోనే దీక్షలు ప్రారంభించాలని చూస్తే ఆ ప్రయత్నాలను కూడా పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలు దీక్షలు కొనసాగిస్తుంటే దానిని కూడా భగ్నం చేయాలని పెద్ద సంఖ్యలో పోలీసులు వారిళ్ల వద్దకు చేరుకున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా అడ్డుకున్నా తామంతా న్యాయం కోసం పోరాడతామని చెప్పారు.
నియమావళి పరిధిలో పనిచేయండి
*వీఆర్‌ఓలకు రెవెన్యూ సెంట్రల్ కమిటీ సూచన

హైదరాబాద్, నవంబర్ 16: గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌ఓ) నియమావళికి లోబడే పనిచేయాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రస్తుతం భూరికార్డుల అప్‌డేట్ ప్రోగ్రాం (ఎల్‌ఆర్‌యూపి) జరుగుతోందని కమిటీ నేతలు గుర్తుచేశారు. భూములకు సంబంచిన సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు. భూసమస్యల వల్లనే రెవెన్యూ సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయని, ఈ సమస్యలకు కారణం రెవెన్యూ సిబ్బంది కాదని స్పష్టం చేశారు. గ్రామ, మండల రెవెన్యూ కార్యాలయాలకు అవసరం లేనివారు కూడా వస్తూ సమస్యలు సృష్టిస్తుంటారని అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీఆర్‌ఓ పరిధిలో లేని అంశాలకు సంబంధించిన విషయాలు ఏవైనా ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా తెలియచేయాలని సూచించారు. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే భూపరిపాలన ప్రధాన అధికారి (సీసీఎల్‌ఏ) సూచనల మేరకు సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే ఈ విషయాన్ని రెవెన్యూ ఉద్యోగుల జిల్లా, రాష్ట్ర కమిటీలకు తెలియచేయాలని కోరారు.