తెలంగాణ

కేసీఆర్, జగన్ హనీమూన్ ముగిసిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య దోస్తీ ముగిసిందా? వీరి హనీమూన్‌కు ఫుల్‌స్టాప్ పడుతుందా? తాజా పరిణామాలను విశే్లషిస్తే అవునని చెప్పేందుకు అవసరమైన ప్రాతిపదిక ఉంది. తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య బంధం రానున్న రోజుల్లో గతంలో మాదిరిగా సాగుతుందని చెప్పలేమని రాజకీయ విశే్లషకులు సైతం అంటున్నారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి కాళేశ్వరం భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతూ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. కాగా, సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని, అది అక్రమ ప్రాజెక్టు అని పేర్కొంది. ఈ అఫిడవిట్‌కు బదులుగా గట్టి జవాబుతో అఫిడవిట్‌ను ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సాగునీటి శాఖను ఆదేశించినట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఏపీ దాఖలు చేసిన అఫిడవిట్‌ను సంపూర్ణంగా అధ్యయనం చేసి తగు రీతిలో సమాధానం ఇచ్చేందుకు తెలంగాణ సాగునీటి శాఖ సమాయత్తమవుతోంది. వచ్చే వారం ఏపీ అఫిడవిట్‌పై చర్చించి సుప్రీం కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసే విషయమై ఉన్నతాధికారుల సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ విషయమై న్యాయ కోవిదుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరుకావడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయమై ఇప్పటికే జగన్ సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై ఒక హైలెవల్ కమిటీని ఏపీ సర్కార్ నియమించింది. ఈ కమిటీ ఇచ్చే నివేదికపై ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇదిలావుండగా, తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 40 రోజులుగా సమ్మె చేసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఏపీ సర్కారుకు లేని ఇక్కట్లు, తెలంగాణ సర్కారుకు ఎక్కడి నుంచి వస్తాయని ఇక్కడి కార్మిక సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని నిలదీసిన సంగతి విదితమే. కాగా, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం సాధ్యం కాదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదాహరణంగా వివరించిన సంగతి విదితమే. ఆర్టీసీ విలీనంపై చకాచకా అడుగులు పడుతున్నాయని, ఈ విషయమై వెనక్కి వెళ్లే ప్రసక్తిలేదని, ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని పదే పదే ప్రకటించారు. ఇవన్నీ కూడా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెను కొనసాగించేందుకు దోహదం చేశాయి. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ యూనియన్లు

తాత్కాలికంగా ఈ డిమాండ్‌ను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించినా, మిగిలిన డిమాండ్లపై సమ్మెను కొనసాగిస్తున్నాయి. ఇదిలావుండగా, కాళేశ్వరం, ఆర్టీసీ అంశాల పట్ల ఏపీ ప్రభుత్వం అనుసరించిన వైఖరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సహజంగానే ఆగ్రహం తెప్పిస్తాయి. ఈ ఏడాది మే 30వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు వ్యక్తిగతంగా కేసీఆర్ ఇంటికి వచ్చి విజయవాడకు ఆహ్వానించడం, కేసీఆర్ వెళ్లడం రెండూ జరిగాయి. ఆ తర్వాత కూడా సాగునీటి ప్రాజెక్టులు, గోదావరి నుంచి కృష్ణా నదికి నీటి మళ్లింపుపై ఇద్దరు సీఎంలు ఇక్కడ భేటీ అయి కూలంకషంగా చర్చించారు. కాకలుతీరిన రాజకీయవేత్త, రాజకీయ చతురుడైన కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ప్రగతిభవన్‌లో సాదరంగా ఆహ్వానించి అక్కున చేర్చుకున్న విషయం విదితమే. వీరి భేటీకి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత వచ్చింది. ఈ ఇద్దరు సీఎంలు కూడా విభజన చట్టంలోని అంశాలపై చర్చించి పరిష్కారానికి అడుగు వేస్తారని కూడా ఆశించారు. జగన్ సీఎం అయిన తర్వాత సచివాలయంలో ఏపీకి చెందిన భవనాలను మాత్రం తాము ఉపయోగించబోమని అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి అప్పజెప్పారు. ఈ నిర్ణయాన్ని ఆంధ్రాలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఘాటుగా విమర్శించింది. అలాగే సాగునీటి ప్రాజెక్టులపై కూడా రాష్ట్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని వ్యవహరించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోరారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కేసీఆర్ ఉదారతను, సాగునీటి రంగంపై ఉన్న అవగాహనను ప్రశంసించారు. ఇవన్నీ చూసిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య స్నేహబంధం సాగుతుందని విశే్లషకులు అనుకున్నారు. కానీ గత నెలన్నర రోజుల్లో చోటుచేసుకున్న పరిణామాలు మాత్రం కేసీఆర్, జగన్ మధ్య దూరాన్ని పెంచాయి. పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటూ పూర్తి చేస్తుందని కూడా కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో పేర్కొన్న విషయం విదితమే. ప్రస్తుతం సూత్రప్రాయంగా కాళేశ్వరంను జగన్, పోలవరంను తెలంగాణ ప్రభుత్వం అనేక కారణాల దృష్ట్యా వ్యతిరేకించాలి కాబట్టి కోర్టులో వ్యతిరేకిస్తూ అఫిడవిట్‌ను దాఖలు చేశాయా? వీటితో సంబంధం లేకుండా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య స్నేహబంధం భవిష్యత్తులో కొనసాగుతుందా? అనేది వేచి చూడాలి. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ పోలవరం నుంచి శ్రీశైలంకు ఆంధ్ర భూభాగం ద్వారానే గుంటూరు జిల్లా ద్వారా నీటిని మళ్లించే విషయమై డీపీఆర్‌ను రూపొందించాలని సాగునీటి శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. అంతకుముందు దుమ్ముగూడెం నుంచి నాగార్జునసాగర్‌కు నీటిని ఎత్తిపోతల స్కీం ద్వారా మళ్లిస్తూ, అక్కడి నుంచి శ్రీశైలంలోకి మళ్లించాలనే ప్రతిపాదనను, తుపాకుల గూడెం వద్ద గోదావరి నుంచి శ్రీశైలంకు ఎత్తిపోతల ద్వారా నల్లమల అడవుల గుండా నీటిని మళ్లించాలనే ప్రతిపాదనను ఇద్దరు సీఎంలు చర్చించారు. అయితే, ఇవన్నీ ఆచరణయోగ్యం కావని, భవిష్యత్తులో వివాదాలకు దారితీస్తాయని రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు సాగునీటి నిపుణులు అప్పట్లోనే విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తిరుపతిలో మాట్లాడుతూ, రాయలసీమ ప్రయోజనాలకు నీటిని ఇస్తామంటూ భేషైన ప్రకటన చేశారు. అయితే, ఈ ప్రకటనను తెలంగాణ కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. న్యాయపరమైన విషయాల్లో రెండు రాష్ట్రాల వైఖరి ఎలా ఉన్నా, కేసీఆర్, జగన్ మధ్య ఎటువంటి వివాదాలు తలెత్తే అవకాశాలు లేవని, ఆర్టీసీ సమ్మె కొలిక్కి వచ్చిన తర్వాత ఇద్దరు సీఎంల భేటీ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.