తెలంగాణ

సమ్మె విరమణకు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా ముందుకు వస్తే సమ్మె విరమించడానికి తాము సిద్ధమేనని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆహ్వానం కోసం వేచిచూస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలికినట్లేనని ఆయన ప్రకటించారు. ఎలాంటి నిబంధనలకు తావులేకుండా కేసీఆర్ పిలుపు ఇస్తే సమ్మెకు గుడ్‌బై చెప్పడానికి జేఏసీ సానుకూలంగా ఉందన్నారు. గత రెండు రోజులుగా కార్మికుల అభిప్రాయం తీసుకున్నామని, వారి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని సమ్మెను విరమించడానికి ఆర్టీసీలోని అన్ని కార్మిక సంఘాల జేఏసీ నేతలు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటిస్తున్నానని ఆయన వెల్లడించారు. బుధవారం సాయంత్రం ఆర్టీసీ ఈయూ కార్యాలయంలో జేఏసీ నేతలు మీడయాతో మాట్లాడారు. రాష్ట్ర హైకోర్టు సూచనలను జేఏసీ స్వాగతిస్తోందన్నారు. ఆదర్శవంతమైన యజమానిగా ముఖ్యమంత్రి
కేసీఆర్ కార్మికులను చూస్తారని హైకోర్టు ధర్మాసనం భావిస్తోందని న్యాయమూర్తులు పేర్కొన్న అంశాలను జేఏసీ నేతలు గుర్తు చేశారు. రెండు వారాల్లో కార్మికులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచనలను జేఏసీ పాటిస్తుందన్నారు. కార్మికుల ఆత్మగౌరవాన్ని జేఏసీ నిలబెడుతుందన్నారు. కార్మిక శాఖ కోర్టులో తమ సమస్యలను తేల్చుకోవాలని అంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తమ జేఏసీ తప్పక పాటిస్తుందని చెప్పారు. సమ్మె కాలానికి జీతాలు చెల్లించాలని లేబర్ కోర్టును అడుగుతామని ఆయన చెప్పారు. సమ్మె విరమించడానికి జేఏసీ ముందుకు వచ్చిందని, అందుకు ప్రభుత్వం ఆంక్షలు లేకుండా ముందుకు వస్తే కార్మికులు విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ సూచనలు వచ్చే వరకు కార్మికులు వేచిచూస్తారని ఆయన చెప్పారు. బుధవారం హైదరాబాద్ ప్రధాన బస్‌స్టాండ్‌లో (ఎంజీబీఎస్)లో జేఏసీ నేతలంతా కలసి సమ్మె కొనసాగించాలా? వద్దా? అన్న అంశాలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. ప్రజలు, ఆర్టీసీని దృష్టిలో పెట్టుకుని సమ్మెను విరమించడానికి మెజారిటీ కార్మిక సంఘాలు ఆమోదం తెలిపాయన్నారు. అక్టోబర్ 4వ తేదీన ఆర్టీసీలో ఎలాంటి వాతావరణం ఉందో అదే వాతావరణం కల్పిస్తే కార్మికులు విధుల్లో చేరడానికి సుముఖంగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఆర్టీసీ యాజమాన్యం ఆ దిశగా ప్రయత్నించాలని కార్మికులు విశ్వసిస్తున్నారని ఆయన చెప్పారు. కార్మికులు సమ్మె చేసింది పరిస్థితిని చక్కదిద్దడానికేనని, కానీ సంస్థను ఇబ్బంది పెట్టడానికి కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే, కార్మికులు డ్యూటీ చార్ట్‌లో సంతకాలు చేస్తారే తప్ప, పత్రాలపై ఆంక్షల సంతకాలు చేయబోరని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. డ్యూటీలో చేరిన తర్వాత కార్మికుల పట్ల అమానుష చర్యలకు యాజమాన్యం ప్రయత్నించకూడదని ఆయన అన్నారు. గత 48 రోజులుగా సమ్మెలో పాల్గొన్న కార్మికులు అనేక ఒడిదుడుకులకు గురయ్యారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మెపై ప్రభుత్వ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆందోళనకు గురైన ఎంతోమంది కార్మికులు బలిదానాలను చేసుకున్నారన్నారు. మరికొంతమంది సమ్మెతో తమ కుటుంబాలను ఎలా పోషించాలోనని గుండెలు బాదుకుని ఆత్మహత్యలు చేసుకోవడం చూశామన్నారు. సమ్మె ప్రభావంతో మృతి చెందిన కుటుంబాలను జేఏసీ ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.

*చిత్రం... హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఈయూ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతున్న జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి