తెలంగాణ

నీళ్లొచ్చాకే నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లోకి నీళ్లు వచ్చిన తర్వాతే నీటి పంపకాలపై నిర్ణయం తీసుకోవాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. ప్రాజెక్టుల్లో నీళ్లులేకుండా పంపకాలు చేపట్టలేమని బోర్డు తేల్చి చెప్పేసింది. ఎర్రమంజిల్‌లోని జలసౌధలో బుధవారం కృష్ణా యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ అధ్యక్షతన త్రిసభ్య కమిటీ సమావేశమైంది. సమావేశానికి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన నీటిపారుదల శాఖ అధికారులు హాజరై ఎవరికి వారు తమ వాదనలు వినిపించారు. తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం కుడి కాల్వ ద్వారా నీరివ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో తగినంత నీటి మట్టం లేదని, ఈ పరిస్థితుల్లో నీటి విడుదల ఎలా సాధ్యమని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. నెట్టంపాడు, భీమా, కల్వకుర్తి ప్రాజెక్టులకు ట్రయల్ రన్ నిర్వహించాల్సి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు కోరారు. రెండు రాష్ట్రాలూ జలాలు విడుదల చేయాలని కోరినప్పటికీ ఇంకా ప్రాజెక్టుల్లోకి నీరు చేరకపోవడంతో ప్రస్తుత పరిస్థితుల్లో జలాలు విడుదల చేయడం కుదరదని బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ స్పష్టం చేశారు. ప్రాజెక్టుల్లోకి నీరు చేరిన తర్వాత ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులతో చర్చించి నిర్ణయం తీసుకోగలమని ఛటర్జీ వెల్లడించారు. అయితే హైదరాబాద్ నగరానికి మంచినీటి సరఫరాను మాత్రం కొనసాగించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు బోర్డుకు విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదిలోకి వచ్చే వరద, ప్రాజెక్టుల్లోని నీటి మట్టాన్ని అంచనా వేయడానికి సెన్సార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, అయితే క్షేత్రస్థాయిలో నాగార్జునసాగర్, శ్రీశైలం కాల్వలను పరిశీలించాక వాటిని ఏర్పాటు చేయనున్నట్టు ఛటర్జీ తెలిపారు. నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి 7 నుంచి 8 టిఎంసి నీరు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోర్టును కోరిందని సమావేశం ముగిసిన తర్వాత ఛటర్జీ మీడియాకు తెలిపారు. వారి విజ్ఞప్తిని శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిన తర్వాతనే పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వం సూచించిందని ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాలు మంచినీరు, సాగునీటి వాటాలపై బోర్డు చర్చించినప్పటికీ జలాశయాల్లోకి ఇంకా నీరు చేరకపోవడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయామని ఆయన తెలిపారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటి వాటాలపై ఇరు రాష్ట్రాల వాదనలు వినిపించినప్పటికీ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్‌ల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో ఆ అంశాన్ని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులతో చర్చించాలని బోర్డు నిర్ణయించిందన్నారు. త్వరలోనే ఇరు రాష్ట్రాల కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు ఛటర్జీ తెలిపారు.