జాతీయ వార్తలు

వాయుసేన విమానం గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై / న్యూఢిల్లీ, జూలై 22: చెన్నైలోని తాంబరం ఎయిర్‌బేస్‌నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు శుక్రవారం ఉదయం బయలుదేరిన భారత వైమానిక దళానికి చెందిన ఎఎన్-32 విమానం జాడ తెలియకుండా పోయింది. విమానంలో ఆరుగురు విమాన సిబ్బందితో పాటుగా మొత్తం 29 మంది ఉన్నారు. వీరిలో వైమానిక దళానికి చెందిన అధికారి సహా 11 మంది, ఆర్మీకి చెందిన ఒక అధికారి, ఇద్దరు కోస్ట్‌గార్డు అధికారులు, నౌకాదళానికి చెందిన తొమ్మిది మంది ఉన్నారు. ఈ తొమ్మిది మంది విశాఖలోని నేవల్ ఆర్మ్‌డ్ డిపో (ఎన్‌ఏడి)కి చెందిన వారని తెలుస్తోంది. చెన్నై సమీపంలోని తాంబరం ఎయిర్‌బేస్‌నుంచి బయలుదేరిన 18 నిమిషాలకే అంటే ఉదయం 8 గంటల 46 నిమిషాల సమయంలో విమానానికి ట్రాఫిక్ కంట్రోల్‌తో రేడియో సంబంధాలు తెగిపోయాయి. జాడ తెలియకుండా పోయిన విమానం కోసం గాలించడానికి వైమానిక దళం, నేవీ కోస్ట్‌గార్డుకు చెందిన మొత్తం ఎనిమిది విమానాలు, 13 నౌకలను రంగంలోకి దించారు. ‘విమానం జాడ ఇంకా తెలియలేదు. విమానం, అందులో ప్రయాణిస్తున్న ఆర్మీ సిబ్బంది జాడ తెలుసుకోవడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో చెప్పారు. రొటీన్ కొరియర్ సర్వీసులో ఉన్న ఈ విమానం ఉదయం 8.30 గంటల సమయంలో తాంబరంనుంచి బయలుదేరిందని, 11.30 గంటల సమయంలో పోర్టుబ్లెయిర్ చేరాల్సి ఉందని, అయితే ఈ లోగానే కనిపించకుండా పోయిందని భారత వైమానిక దళం ప్రతినిధి వింగ్ కమాండర్ అనుపమ్ బెనర్జీ చెప్పారు. కాగా, విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయే సమయంలో దాదాపు 23వేల అడుగుల ఎత్తులో ఎగురుతోందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
ఇంధనం నింపుకోవలసిన అవసరం లేకుండా ఈ విమానం ఏకబిగిన నాలుగు గంటలు ప్రయాణించగలదు. వైమానిక దళం వద్ద రష్యాలో తయారైన ఎఎన్-32 విమానాలు వందకు పైగా ఉన్నాయి. అయితే జాడ తెలియకుండా పోయిన ఈ విమానానికి స్వల్ప మరమ్మతులు వస్తే ఇటీవలే ఉక్రెయిన్‌లో సరిచేశారు కూడా. ఈ రకం విమానాలు చాలా దృఢంగా ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోగలవని, అందుకే ఎడారులు, కొండప్రాంతాలకు వీటిని పంపుతుంటారని చెబుతున్నారు.
రంగంలోకి దిగిన తూర్పు నౌకాదళం
జాడ తెలియకుండా ఐఏఎఫ్ విమానం కోసం తూర్పు నౌకాదళం అత్యాధునిక ఎలక్ట్రో ఆప్టిక్స్, రాడార్లు కలిగి ఉండే రెండు పి-8ఐ లాంగ్ రేంజి సముద్ర గస్తీ విమానాలను, రెండు డార్నియర్ విమానాలను, 12 నౌకలను ఇంటిగ్రల్ హెలికాప్టర్లతో రంగంలోకి దించినట్లు నౌకాదళం ఒక ప్రకటనలో తెలియజేసింది. బంగాళాఖాతంలో వివిధ మిషన్లలో నిమగ్నమై ఉన్న నాలుగు నౌకలను గాలింపు జరుగుతున్న ప్రాంతానికి మళ్లించారని, అలాగే దక్షిణ చైనా సముద్రం ప్రాంతంనుంచి తిరిగి వస్తున్న మరో ఎనిమిది నౌకలను కూడా గాలింపు చర్యల్లో పాలు పంచుకోవడానికి గరిష్ఠ వేగంతో అక్కడికి వెళ్లాలని ఆదేశించినట్లు ఆ ప్రకటన తెలిపింది. అలాగే విమానంలోని ఎమర్జెన్సీ లొకేటర్‌నుంచి వెలువడే సిగ్నల్స్‌ను గ్రహించడం కోసం సముద్రంలో ఉన్న ఒక జలాంతర్గామిని సైతం గాలింపు జరుగుతున్న ప్రాంతానికి మళ్లించారు. కాగా, భారత వైమానిక దళ చరిత్రలో ఎఎన్-32 విమానం ఇంత భారీ దుర్ఘటనకు గురి కావడం 1999 తర్వాత ఇదే మొదటిసారి. అప్పుడు ఢిల్లీ సమీపంలో జరిగిన ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. కాగా, 2009లో అరుణాచల్ ప్రదేశ్‌లోని మచుకా అడ్వాన్స్‌డ్ లాండింగ్ గ్రౌండ్‌నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఈ తరహా విమానం ఒకటి కూలిపోయింది.