తెలంగాణ

రూ. 1,82,914 కోట్ల బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: తెలంగాణ రాష్ట్రానికి 1,82,914.42 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు శాసనసభకు ఆదివారం సమర్పించారు. రెవెన్యూ వ్యయం 1,38,669.82 కోట్ల రూపాయలుగా ఉంటుందని, క్యాపిటల్ వ్యయం 22,061.18 కోట్ల రూపాయలుగా ఉంటుందని తెలిపారు. రెవెన్యూ మి గులు 4,482.12 కోట్ల రూ.లుగా ఉంటుందని, ఆర్థిక లోటు 33,191.25 కోట్ల రూపాయలని వివరించారు.
ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం, పెట్టుబడి వ్యయానికి నిధులు వినియోగించడం అనే ద్విముఖ వ్యూహంతో ఆర్థికాభివృద్ధి సాధిస్తామని హరీష్‌రావు తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా ఆర్థిక మాంద్యాన్ని అధిగమిస్తామన్నారు. సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని వివరించారు. ఈ కారణంగానే సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించే నిధుల్లో కోత విధించలేదని స్పష్టం చేశారు. ప్రజలే కేంద్రంగా రూపొందించిన ప్రగతిశీల బడ్జెట్‌గా ఈ బడ్జెట్‌ను అభివర్ణించారు. వచ్చే నాలుగేళ్ల రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి ప్రణాళికను రూపొందించామని తెలిపారు.
రైతులకు పెట్టుబడి సాయం అందించే ‘రైతుబంధు’ పథకానికి 14 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. 2019-20 సంవత్సరం కేటాయింపుతో పోలిస్తే ఇది రెండు వేల కోట్ల రూపాయలు అధికం. రైతుబీమా పథకం కోసం ఒక్కో రైతు తరఫున 2,271.50 రూపాయల చొప్పున జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)కు ప్రీమియం చెల్లించేందుకు 1,141 కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రి తెలిపారు. రైతులు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి 10 రోజుల్లోగా ఐదు లక్షల రూపాయలు బీమా కింద చెల్లిస్తున్నామన్నారు.
2018లో అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో లక్ష రూపాయల లోపు రుణం ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చి న హామీని దశలవారీగా అమలు చేసేందుకు ఈ బడ్జెట్‌లో 1,198 కోట్ల రూపాయలు కేటాయించారు. 25 వేల రూపాయల లోపు రుణాలున్న 5,83,916 మంది రైతులకు ఒకే దఫా మాఫీ జరుగుతుంది. ఈ నెలలోనే ఈ హామీ అమలు అవుతుందని మంత్రి తెలిపారు. 25 వేల రూపాయల నుండి ఒక లక్ష లోపు రుణాలున్న రైతుల రుణ మొత్తం 24,738 కోట్ల రూపాయలుగా తేలాయని, వీటిని నాలుగు విడతలుగా చెల్లిస్తామన్నారు. రుణమాఫీ కోసం 6,225 కోట్ల రూపాయలు కేటాయించారు. రుణమాఫీకి సంబంధించి చెక్కులను తయారు చేసి ఎమ్మెల్యేల ద్వారా రైతులకు నేరుగా పంపిణీ చేస్తామని వివరించారు. విత్తనాలను సబ్సిడీపై ఇస్తామని, ఉద్యాన పంటలకోసం నాణ్యమైన నారు సరఫరా చేస్తామన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించేందుకు వీలుగా ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్’ కోసం 1,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు.
బిందు, తుంపర సేద్యాన్ని ప్రోత్సహించేంచేందుకు సూక్ష్మసేద్యం పథకం (ఎంఐపీ) కోసం 600 కోట్ల రూపాయలను కేటాయించారు. గత ఐదేళ్లలో దాదాపు రెండున్నర లక్షల మంది రైతులకు ఈ పథకం కింద 1,819 కోట్ల రూపాయలు సబ్సిడీగా ఇచ్చామన్నారు.
‘రైతుబంధు సమితులు’గా మారిన రైతు సమన్వయ సమితిల తరఫున రైతు వేదికలను నిర్మించేందుకు 350 కోట్ల రూపాలు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా మార్చామని, ఒక్కో క్లస్టర్‌కు ఒకటి చొప్పున రైతు వేదికలను నిర్మిస్తామని గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశా రు. ఈ హామీకి అనుగుణంగా నిధులు కేటాయిస్తున్నామన్నారు. పాడిపరిశ్రమ అభివృద్ధిలో భాగంగా విజయడైరీకి ప్రోత్సా హం ఇస్తున్నామని, పాడి రైతుల కోసం వంద కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రి తెలిపారు.
కోటి ఎకరాల మాగాణం
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ మహాకవి దాశరథి నినదిస్తే, ‘నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం’ కావాలంటూ కేసీఆర్ పరితపిస్తున్నారని హరీష్‌రావు తెలిపారు. ఇందులో భాగంగా

చిన్న, మధ్య, భారీ తరహా నీటిపారుదల ప్రాజెక్టుల కోసం 11,054 కోట్ల రూపాయలు కేటాయించామని ఆర్థిక మంత్రి తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడం వల్ల 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నామని, గత ఆరేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఫ్లోరొసిస్ బారిన పడలేదని ‘ఇండియన్ నేచురల్ రిసోర్సెస్ ఎకనమిక్ అండ్ మేనేజ్‌మెంట్ ఫౌండేషన్’ ప్రకటించిందని గుర్తు చేశారు.
సంక్షేమానికి 11,758 కోట్లు
ప్రభుత్వం చేపట్టిన వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు తదితరులకు అందించాల్సిన ఆసరా పింఛన్లకోసం 11,758 కోట్ల రూపాయలు ప్రతిపాదించామని హరీష్‌రావు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ గురుకులాల నిర్వహణ, కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే రుణాలు, ఎంఐపీ కింద సబ్సిడీకి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇందుకు అనుగుణంగా ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధికి 16,534.97 కోట్ల రూపాయలు, ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధికి 9,771.27 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే మైనారిటీల సంక్షేమం కోసం 1,369 కోట్ల రూపాయలు, బీసీల సంక్షేమం కోసం 4,356.82 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో ఎంబీసీ కార్పొరేషన్‌కు 500 కోట్ల రూపాయలు కేటాయించారు. కల్యాణలక్ష్మి పథకం కోసం గత ఏడాది 650 కోట్ల రూపాయలు కేటాయించగా, ఈ ఏడు 1,350 కోట్ల రూపాయలు కేటాయించారు.
మహిళా, శిశు సంక్షేమానికి, మహిళా స్వయం సహాయ గ్రూపులకు వడ్డీలేని రుణాల కోసం 1,200 కోట్ల రూపాయలు కేటాయించారు. గర్భిణులు, బాలింతలు, శిశువులకు పోషకాహారం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి 23,005 కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రి తెలిపారు. ‘పల్లెప్రగతి’ పనులు, జాతీయ ఉపాధి హామీ పనులు, పారిశుధ్యం తదితర పనులకు ఈ నిధులను వినియోగిస్తారు. రెండు గదుల ఇళ్ల నిర్మాణం పథకానికి 11,917 కోట్ల రూపాయలు కేటాయించారు. సొంత స్థలం ఉన్నవారు ఇళ్లు నిర్మించుకునేందుకు లక్ష మందికి ఆర్థిక సాయం చేస్తామన్నారు.
నూతన మున్సిపల్ చట్టం కింద భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేందుకు టీఎస్ బీ-పాస్ విధానం అమలు చేస్తున్నామని తెలిపారు. మూడు నెలలల్లో అన్ని పట్టణాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. డంపింగ్ యార్డుల ఏర్పాటు, చిన్నవ్యాపారం, , ఆటోలు, టాక్సీలు నిలుపుకొనేందుకు స్థలం సేకరణ తదితర పనులను పట్టణ ప్రగతి ద్వారా చేపట్టామన్నారు. మున్సిసల్ శాఖకు 14,809 కోట్ల రూపాయలు కేటాయించారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి, మూసీ ప్రక్షాళన తదితర పనుల కోసం 10 వేల కోట్ల రూపాయలు కేటాయించారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ఇప్పటివరకు ఉన్న లైన్లతో పాటు, ఎంజీబీఎస్ నుండి పాతనగరం వరకు ఐదు కిలోమీటర్లు, రాయదుర్గం నుండి శంషాబాద్ వరకు, మియాపూర్ నుండి బీహెచ్‌ఈఎల్ వరకు పొడిగించే ప్రణాళికలు ఉన్నాయని మంత్రి వివరించారు.
విద్యారంగానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం 2,650 కోట్ల రూపాయలు కేటాయించారు. పాఠశాల విద్యకు 10,421 కోట్ల రూపాయలు, ఉన్నత విద్యకు 1,723.27 కోట్ల రూపాయలు కేటాయించారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించే కార్యక్రమానికి వంద కోట్ల రూపాయలు కేటాయించారు.
ఆరోగ్య రంగాన్ని ప్రస్తావిస్తూ, వైద్య, ఆరోగ్య రంగానికి 6,186 కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న 118 బస్తీ దవాఖానాల సంఖ్యను 350 కి పెంచుతామన్నారు. కంటి వెలుగు తరహాలో చెవి, ముక్కు, గొంతు, దంత సంబంధిత వ్యాధుల నిర్ధారణ కోసం ప్రత్యేక కార్యాచరణను చేపడతామన్నారు. రాష్ట్రంలో ప్రతిపౌరుడికి వైద్య పరీక్షలు నిర్వహించి, తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామన్నారు.
విద్యుత్తు
విద్యుత్తు సరఫరాలో గతంలో ఎదురైన ఇబ్బందులను అధిగమించామని, ప్రస్తుతం నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా, విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు తదితర అవసరాల కోసం 10,416 కోట్ల రూపాయలు కేటాయించారు. జాతీయ స్థాయి విద్యుత్తు తలసరి వినియోగం 1,181 యూనిట్లు కాగా, తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 1,896 యూనిట్లుగా నమోదైందన్నారు.
పారిశ్రామిక రంగం అభివృద్ధి కోసం 1,998 కోట్ల రూపాయలు కేటయించారు. ఇండస్ట్రియల్ ఇనె్సంటివ్ కోసమే ఇందులో 1,500 కోట్ల రూపాయలు వినియోగిస్తారు. అంతర్జాతీయ కంపెనీలు స్టార్టప్ కంపెనీలు రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వాటిని ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత అంటూ వివరించారు. ఐటీని హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా వరంగల్, కరీంనగర్ తదితర పట్టణాలకు విస్తరిస్తామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ‘వీ హబ్’ను ఏర్పాటు చేశామన్నారు.
ఆర్టీసీ ఎంప్లారుూస్ బోర్డ్
ఆర్టీసీని బలోపేతం చేసేందుకు 1,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ‘ఎంప్లారుూస్ బోర్డు’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. కార్గో, పార్సిల్ సర్వీసులను ఆర్టీసీ ప్రారంభించిందని మంత్రి గుర్తు చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచామన్నారు.
పర్యావరణం, అటవీ శాఖకు 791 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. గ్రామాలు, పట్టణాల్లో మొక్కల పెంపకానికి హరితహారం ద్వారా ప్రాధ్యాన్యత ఇస్తున్నామన్నారు.
దేవాలయాల అభివృద్ధికి 500 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. ధూపదీప నైవేద్యాల కోసం 50 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. రోడ్లు, భవనాల శాఖకు 3,494 కోట్ల రూపాయలు కేటాయించారు. కలెక్టరేట్లు, డీపీఓలు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాలకే 500 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, రోడ్ల నిర్వహణకు 750 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేశారు.
శాంతి, భద్రతల కోసం 5,852 కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. పోలీస్ శాఖ ఆధునీకరణ, శిక్షణ, జీవన ప్రమాణాలు పెంపుదల, వాహనాల కొనుగోలు తదితర అవసరాలకు ఈ నిధులను వాడతారు.
ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఒక్కొక్కరికి మూడు కోట్ల రూపాయల చొప్పున ఇస్తామని, ఇందుకోసం 480 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని హరీష్‌రావు తెలిపారు.

*చిత్రం... బడ్జెట్ ప్రతితో అసెంబ్లీలోకి అడుగుపెడుతున్న సీఎం కేసీఆర్