తెలంగాణ

సేద్యానికి ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో సేద్యం రంగానికి పెద్దపీట వేశారు. ఆర్థిక మంత్రి హరీష్‌రావు ఆదివారం శాసనసభకు సమర్పించిన బడ్జెట్‌లో సేద్యం రంగం గురించి ప్రత్యేకం గా ప్రస్తావించారు. వ్యవసాయం, మార్కెటింగ్, పశుసంవర్థక రంగాలకు కలిపి 25,812 కోట్ల రూపాయలను కేటాయించారు. జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా అనేక పథకా లు, కార్యక్రమాలను ఈ రంగం అభివృద్ధికి చేపట్టామని వెల్లడించారు. శాసనసభకు ప్రతిపాదించిన
బడ్జెట్ కేటాయింపులో సేద్యం రంగం వివరాలు ఇలా ఉన్నాయి.
రైతుల సంక్షేమానికి ఇప్పటికే చేపట్టిన రైతుబంధు పథకం కింద ఎకరాకు ఏటా 10 వేల రూపాయల చొప్పున ఇస్తున్నారు. ఈ పథకాన్ని 2020-12 లో అమలు చేసేందుకు 14 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. రైతులు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రైతు బీమా పథకం కింద ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎల్‌ఐసీకి ప్రీమియంగా చెల్లించేందుకు 1,141 కోట్ల రూపాయలు కేటాయించారు. రైతులు తీసుకున్న రుణాల్లో లక్ష రూపాయల లోపు మాఫీ చేస్తామని 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు చేసేందుకు తొలుత 25 వేల రూపాయల వరకు ఉన్న రుణాలను ఒకే దఫా వెంటనే మాఫీ చేస్తారు. ఇందుకోసం తాజా బడ్జెట్‌లో 1,198 కోట్ల రూపాయలు కేటాయించారు. 25 వేల నుండి లక్ష రూపాయల వరకు ఉన్న 24,738 కోట్ల రూపాయల రుణాలను నాలుగు దశల్లో తిరిగి చెల్లిస్తారు. మొత్తం రుణమాఫీ కోసం ఈ బడ్జెట్‌లో 6,225 కోట్ల రూపాయలు కేటాయించారు. విత్తనాలు, ఎరువులను సబ్సిడీ కింద రైతులకు అందించేందుకు నిధులు కేటాయించారు. ఉద్యాన పంటలకు కూడా సహకారం అందిస్తారు. మైక్రో ఇరిగేషన్ కోసం 600 కోట్ల రూపాయలు కేటాయించారు. పంటల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇచ్చేందుకు వీలుగా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కోసం 1,000 కోట్ల రూపాయలను కేటాయించారు. రైతు సమన్వయ సమితిల పేరును రైతుబంధు సమితిలుగా మార్చారు. ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తూ ఒక్కో క్లస్టర్‌కు ఒక రైతు వేదికను నిర్మించేందుకు 12 లక్షల చొప్పున కేటాంచారు. ఈ మొత్తం కోసం 350 కోట్ల రూపాయలు కేటాయించారు.
విజయ డైరీని మరింత ప్రోత్సహించనున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో గతంలో 30 కోట్ల రూపాయల నష్టాలను చవిచూసిన విజయడైరీ 35 కోట్ల రూపాయలు లాభాలను ఆర్జించింది. పాడి రైతులకు ప్రోత్సాహం అందించేందుకు 100 కోట్ల రూపాయలు కేటాయించారు. పశుసంవర్థక, మత్స్య శాఖల అభివృద్ధికి బడ్జెట్‌లో 1,586 కోట్ల రూపాయలు కేటాయించారు.
ధన్యవాదాలు
వ్యవసాయం, అనుబంధ రంగాలకు భారీగా నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్‌రావుకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ సమైక్య పాలనలో వ్యవసాయం దండగ అంటూ రైతుల వెన్ను విరిచారని తెలిపారు. గత ఆరేళ్లలో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో రైతుల ఆదాయం పెరిగిందని, రాష్టమ్రంతా పచ్చదనంతో అలరారుతోందన్నారు. వ్యవసాయ రంగానికి కేటాయింపులతో పాటు ఉచిత విద్యుత్‌కు 5,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం భరిస్తోందని, సాగునీటికి 11,054 కోట్ల రూపాయలు కేటాయించడంతో వేగంగా సాగునీటి ప్రాజెక్టుల పనులు సాగుతాయన్నారు.