తెలంగాణ

అశ్వవాహనంపై ఊరేగిన నారసింహుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, మార్చి 8: శివకేశవుల సన్నిధి, భక్తుల పాలిటి పెన్నిధిగా రాష్ట్రంలో పేరెన్నికగన్న హరిహర క్షేత్రమైన ధర్మపురి పట్టణంలో ఆదివారం భక్తి పారవశ్యం పొంగి పొర్లింది. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ (యోగ, ఉగ్ర), శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయాత్పూర్వం నుండే పిల్లా పాపలను చంకల్లో ఎత్తుకుని, మూటాముల్ల్లె నెత్తిన ఉంచుకుని జానపద బాణీలలో పాటలు పాడుకుంటూ క్షేత్రానికి అరుదెంచి, పవిత్ర గోదావరినదిలో మంగళ స్నానాలను ఆచరించి దైవ దర్శనాలకు బారులుతీరి వివిధ ఆలయాల ముందు వేచియున్నారు. అనంతరం ప్రత్యేక పూజాదులలో పాల్గొని స్వామికి పట్టెనామాలు, కోరమీసాల సమర్పణ, కోడె మొక్కు ఆదిగా మొక్కులు చెల్లించు కున్నారు. తల నీలాలు సమర్పించుకున్నారు. దేవస్థాన ఆస్థాన పౌరోహితులు కందాళై పురుషోత్తమాచార్యులు, వేదపండితులు రమేశ శర్మ, ఉప ప్రధానార్చకులు నేరేళ్ళ శ్రీనివాసాచార్య, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్య, నరసింహమూర్తి, వివిధ అర్చకుల ఆధ్వర్యంలో దేవస్థానం ఏసీ, ఈఓ శ్రీనివాస్, సిబ్బంది పర్యవేక్షణలో ప్రత్యేక అర్చనలు చేశారు.
మధ్యాహ్నం దేవాలయాలలో అళ్వారులకు బలిప్రదానం, అష్టదిక్పాలకులకు బలిప్రదానం, రాగ తాళ యుక్తంగా నిర్వహించారు. పట్టణ పురవీధులగుండా అందంగా అలంకరించిన ఉత్సవ మూర్తులను ఊరేగించారు. అనంతరం సుదర్శన, విశ్వక్సేన యాగం, సర్వదేవతా ఆవాహనయాగం, గరుడహోమం, వ్యాహృతి హోమాలు, బలిప్రదాన హారతి, మంత్రపుష్పాది భగవత్సేవా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బ్రహ్మోత్సవాల మూడవ రోజైన ఆదివారం వేలాది మంది భక్తులు టిటిడి కల్యాణ మండపంలో దేవస్థానం పక్షాన నిర్వహించిన ఉచిత అన్నదానాన్ని వినియోగించుకున్నారు. దేవస్థానంలో నిర్వహించిన స్వామి వారల కళ్యాణోత్సవ సందర్భంగా దేవస్థానానికి మొత్తం 4,87,546 రూపాయల ఆదాయం లభించినట్టు దేవస్థానం ఏసీ, ఈఓ శ్రీనివాస్ తెలిపారు.
అలరించిన ఆధ్యాత్మిక ప్రవచనం
ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల కల్యాణోత్సవం, తదనంతరం శేషప్ప కళా వేదిపై శృంగగిరి పీఠాధిపతి ఆస్థాన పౌరాణికులు బాచంపెల్లి సంతోష్ కుమార శర్మ, శేషప్ప కళా వేదికపై గావించిన ఆధ్యాత్మిక పౌరాణిక వ్యాఖ్యానం, ప్రవచనం ఆబాల గోపాలాన్ని అలరించింది. ఆదివారం రాత్రి స్థానిక దైవాలు అశ్వవాహనాలపై ఊరేగారు. ఆదివారం రాత్రి 8 గంటలకు దేవస్థానంలో బలిహరణాలు నిర్వహించిన అనంతరం కల్యాణానంతర కార్యక్రమంలో అంతర్భాగంగా, అశ్వవాహనారూఢులైన యోగానంద, ఉగ్ర నారసింహ మూర్తులను పుర వీధుల గుండా ఊరేగించారు. ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా శ్రీయోగానంద, ఉగ్ర నారసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల తెప్పోత్సవ, డోలోత్సవాలు ఈనెల 9, 10, 11 తేదీలలో జరగనున్నాయి.

*చిత్రం...అశ్వవాహనంపై ఊరేగిన నారసింహుడు