తెలంగాణ

నేడు సంజయ్ బాధ్యతల స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ ఆదివారం నాడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు నుండి సంజయ్‌కుమార్‌కు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు సన్నాహాలు చేశారు. అయితే, భారీ ర్యాలీలు నిర్వహించవద్దని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచన మేరకు ఎయిర్‌పోర్టు నుండి నిర్వహించతలపెట్టిన ర్యాలీని రద్దు చేసుకున్నట్టు నేతలు చెప్పారు. ఆదివారం నాడు ఆయన నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుని పార్టీ సీనియర్లతో భేటీ అవుతారు, మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని పార్టీ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ఇంతకాలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న డాక్టర్ కే లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి పీ మురళీధరరావు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి, ఎంపీ గరికపాటి మోహనరావు, సోయం బాపూరావు, ఎన్ రామచందర్‌రావు, రాజాసింగ్ తదితరులు పాల్గొంటారు. ఇప్పటికే బండి సంజయ్‌కుమార్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఇతర ప్రముఖ నేతలను ఢిల్లీలో కలుసుకుని వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. రాష్ట్రంలో 17 జిల్లాలకు ఇప్పటికే పార్టీ అధ్యక్షుల నియామకాలు జరుగగా, మిగిలిన జిల్లాలకు సైతం ఒకటి రెండు రోజుల్లో అధ్యక్షుల నియామకాలు జరుగుతాయి. అనంతరం పార్టీ కార్యవర్గం, వివిధ మోర్చాల అధ్యక్షులు, కమిటీల నియామకాలు జరుగుతాయని చెబుతున్నారు. రానున్న రోజుల్లో స్థానిక ప్రభుత్వాన్ని ఎదుర్కొని 2023 నాటికి అసెంబ్లీ ఎన్నికల సమరానికి పార్టీని
సన్నద్ధం చేసేలా బండి సంజయ్ సేవలు వినియోగించుకోవాలని పార్టీ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ పార్టీకి జవసత్వాలు అందించి మరింత బలోపేతం చేయడం ద్వారా తెలంగాణలో బీజేపీకి ఉజ్వల భవిష్యత్ ఉందని అమిత్ షా వ్యాఖ్యానించడంతో పార్టీ నేతల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి మరింత కష్టపడాలని అమిత్ షా నేతలకు సూచించారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలని ఆయన మార్గదర్శనం చేశారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోందని, ఆ దిశగా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయాలని జాతీయ నాయకత్వం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్న తీరును ప్రజలకు వివరించాలని, పోలీసుల అక్రమ కేసులకు భయపడవద్దని, ప్రభుత్వ దాడులకు భయపడవద్దని జాతీయ నాయకత్వం ధైర్యాన్ని నూరిపోస్తోంది. ఈ క్రమంలో బండి సంజయ్ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.