తెలంగాణ

ఇక వారంలో మూడు రోజులే హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: తెలంగాణ హైకోర్టు ఇక మీదట వారంలో మూడు రోజులే పనిచేయాలని నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ జనరల్ సర్క్యులర్ జారీ చేశారు. కోవిడ్ ఉత్పాతం నేపథ్యంలో కరోనా అరికట్టేందుకు పటిష్టమైన చర్యలను తీసుకున్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకూ సోమవారం, బుధవారం, శుక్రవారం మాత్రమే హైకోర్టు పనిచేస్తుంది. ఒక డివిజన్ బెంచ్, నాలుగు సింగిల్ జడ్జి బెంచ్‌లు అత్యవసర కేసులను పరిశీలిస్తాయి. కొన్ని కేసుల్లో స్టే ఉత్తర్వులు ఉంటే అవి ఆటోమెటిక్‌గా పొడిగించినట్టు భావించాలని కూడా హైకోర్టు పేర్కొంది. దాంతో పాటు జిల్లా కోర్టులు, ఇతర కోర్టులకు మార్గదర్శకాలను జారీ చేసింది. అత్యవసర కేసులకే కోర్టులు పరిమితం కావాలని, కక్షిదారులు, న్యాయవాదులు, ఇతరులు కోర్టు ప్రాంగణాల్లోకి రావడాన్ని నియంత్రించాలని, అతి ముఖ్యమైన బెయిల్ దరఖాస్తులు, రిమాండ్ అంశాల్లో తప్ప మిగిలిన అన్ని కేసులను మూడు వారాల పాటు వాయిదా వేసుకోవాలని సూచించింది. కక్షిదారుల్లో అందరూ రావాలనే నిర్బంధాన్ని పాటించవద్దని, మినహాయించుకోవాలని పేర్కొంది. న్యాయవాదుల వెంట వారి కేసులకు సంబంధించిన వారు ఎక్కువగా రాకుండా సలహా ఇవ్వాలని, నిందితులు, దోషులను కోర్టు ప్రాంగణాలకు తీసుకురాకుండా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారానే కేసుల విచారణ జరపాలని సూచించింది. కోర్టు ప్రాంగణాల్లో తాత్కాలికంగా మెడికల్ డిస్పెన్సరీలను నెలకొల్పాలని, పారామెడికల్ సిబ్బందిని కూడా నియమించాలని పేర్కొన్నారు. జలుబు ఇతర రుగ్మతలతో బాధపడుతున్న వారు వైద్యుల సూచనలను పాటించాలని, పారిశుద్ధ్యాన్ని పాటించాలని, మరుగుదొడ్లను ఎప్పటికపుడు శుభ్రం చేసే ఏర్పాట్లు చేసుకోవాలని, చేతులను పరిశుభ్రంగా కడుక్కునేందుకు చర్యలు చేపట్టాలని హైకోర్టు సూచించింది.
వినియోగదారుల కమిషన్ ఆదేశాలు
వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సైతం కోవిడ్ చర్యలను చేపట్టింది. అత్యవసర కేసులను సోమవారం, గురువారం మాత్రమే విచారించనున్నారు. 17వ తేదీ కేసులను ఏప్రిల్ 21కి, 18వ తేదీవి ఏప్రిల్ 22కు వాయిదా వేశారు. అదే క్రమంలో మార్చి 19 కేసులు ఏప్రిల్ 23కు, మార్చి 20 నాటి కేసులు ఏప్రిల్ 24కు, మార్చి 23 నాటి కేసులు ఏప్రిల్ 27కు, మార్చి 24 కేసులు ఏప్రిల్ 28కి, మార్చి 26 కేసులు ఏప్రిల్ 30 నాటికి, మార్చి 27 నాటి కేసులు మే 1వ తేదీకి, మార్చి 30 నాటి కేసులు మే 4వ తేదీ నాటికి, మార్చి 31 నాటి కేసులు మే 5వ తేదీ నాటికి వాయిదా వేశారు.