తెలంగాణ

సర్కారుపై సమరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 25: తెలంగాణలో పోగొట్టుకున్న బలాన్ని తిరిగి సాధించే ప్రయత్నాల్లో తెలుగుదేశం మునిగింది. దానికోసం ప్రభుత్వంపై పోరాట కార్యక్రమాలకు పదును పెడుతోంది. ప్రతి శనివారం పార్టీ నేతలతో ప్రత్యేక భేటీ అవుతున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ప్రజాసమస్యలపై దృష్టి సారించే కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా వేసిన పది కమిటీలు పది ముఖ్యమైన సమస్యలను గుర్తించాయి. రైతు రుణ మాఫీ, డబుల్‌బెడ్రూమ్, హైదరాబాద్ నగర సమస్యలు, ఇరిగేషన్ వంటి కీలక సమస్యల విషయంలో తెరాస ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్ రూము, రైతు రుణ మాఫీపై ఎక్కువ దృష్టి సారించాలని నిర్ణయించారు.
వివిధ యూనివర్శిటీలు, కాలేజీ విద్యార్థులను సమీకరించి విద్యార్థి సమస్యలపై పోరాడేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని లోకేష్ ఆదేశించారు. సాధారణంగా వివిధ సంఘాలు, వ్యక్తులు నిర్వహించే ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించడంతోపాటు, సొంతగా ఉద్యమాలు నిర్మించి, వాటికి ఆయా వర్గాలకు చెందిన సంఘాలతో సమన్వయం చేసుకోవాలని నిర్ణయించారు. ఇటీవల ఉస్మానియాలో జరిగిన సభ విజయవంతమయినప్పటికీ, ఇకపై అలాంటి ఉద్యమాలను సొంతంగా నిర్వహిస్తే బాగుంటుందని లోకేష్ తెలంగాణ తెదేపా నేతలకు సూచించారు.
డబుల్‌బెడ్ రూములపై ప్రజల్లో ఎక్కువ ఆసక్తి, డిమాండు ఉందని, దానిని ప్రభుత్వం పూర్తి చేయటం అసాధ్యమయినందున డబుల్ బెడ్‌రూములపై నియోజకవర్గాల వారీగా నేతలు దృష్టి సారించాలని ఆదేశించారు. అదే సమయంలో రైతు రుణమాఫీ హామీలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు, నియోజకవర్గాల వారీగా బ్యాంకుల ముందు ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ రెండు హామీలపైనే ఎక్కువ దృష్టి సారించాలని, ఆ మేరకు ఉద్యమ ప్రణాళికలపై చర్చించే బాధ్యతను సీనియర్ నేత, మాజీ ఎంపి రావుల చంద్రశేఖరరెడ్డికి అప్పగించారు. మొత్తం 10 కమిటీలను ఆయనే సమన్వయం చేస్తున్నారు. వివిధ అంశాలపై పూర్తి స్థాయి కసరత్తు చేసి, సమాచారం రాబట్టడంలో విశేష అనుభవం ఉన్నందున, ఆ బాధ్యతను రావులకే అప్పగించినట్లు కనిపిస్తోంది. డబుల్‌బెడ్ రూము పథకం బూమెరాంగయి, చివరకు అదే తెరాస సర్కారుకు గుదిబండగా మారుతుందని అప్పటివరకూ ప్రజల మధ్యనే ఉండి, అన్ని రూపాల్లో పోరాటం చేయాలని లోకేష్ నేతలకు స్పష్టం చేశారు.
తెలంగాణలో పార్టీని పటిష్టం చేసేందుకు, మునుపటి మాదిరిగా జిల్లా ఇంచార్జిల వ్యవస్థకు పదునుపెట్టాలని లోకేష్ నిర్ణయించారు. అందులో భాగంగా ఇకపై జిల్లాలో జరిగే అన్ని పోరాట కార్యక్రమాలు, ఉద్యమాలన్నీ జిల్లా ఇంచార్జి పర్యవేక్షణ, బాధ్యతతోనే అమలుకానున్నాయి.
అయితే, హైదరాబాద్‌పై మాత్రం ప్రత్యేక వ్యూహం అనుసరించాలని లోకేష్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రజలు తెరాసకు ఒక అవకాశం ఇవ్వాలని భావించి గెలిపించినందున, ప్రజల్లో వ్యతిరేకత వచ్చే వరకూ వేచి చూడటం మంచిదన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రోడ్లు, మంచినీటి సరఫరా, మురుగునీరు వ్యవస్థ అధ్వానంగా మారిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నందున, వారిలో మార్పు వచ్చే వరకూ వేచి ఉండటమే మంచిదని, ఈలోగా హైదరాబాద్ విశ్వనగరం చేస్తామన్న హామీల అమలుకు సంబంధించి, తరచూ మీడియా ద్వారా తెరాస సర్కారుకు గుర్తు చేయాలని భావిస్తున్నారు. కాగా మల్లన్నసాగర్ ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ కంటే తెదేపాకే ఎక్కువ మైలేజీ వస్తుండటం కూడా తెదేపా నాయకత్వానికి సంతోషం కలిగిస్తోంది. రేవంత్‌రెడ్డి చేసిన దీక్ష, తాజాగా అరెస్టు వ్యవహారంతోపాటు, వారికి బాసటగా నిలుస్తున్న వైనం కొంతవరకూ సానుకూలంగా మారిందన్న అంచనా వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తే పార్టీ బలోపేతం కావడం కష్టం కాదన్న ధీమా కనిపిస్తోంది.