ఆంధ్రప్రదేశ్‌

11న లాంఛనంగా పుష్కరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 9: మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న కృష్ణ పుష్కరాలకు ఏర్పాట్లు దాదాపూ పూర్తయ్యాయని పుష్కరాల ప్రత్యేక అధికారి రాజశేఖర్ తెలియచేశారు. మంగళవారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ 11వ తేదీన ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న పవిత్ర సంగమంలో పుష్కరాలు లాంఛనంగా ప్రారంభమవుతాయని తెలిపారు. ఆరోజు సాయంత్రం 4.30 గంటలకు ఇబ్రహీంపట్నం జంక్షన్ నుంచి పుష్కర ఘాట్‌ల వరకూ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఇందులో ప్రముఖలంతా పాల్గొనబోతున్నారు. వందేమాతరం శ్రీనివాస్ పాటలకు ఎల్లా వెంకటేశ్వరరావు బృందం నృత్యంతో ఈ శోభాయాత్ర ముందుకు సాగుతుంది. అదే రోజు సాయంత్రం రాజమండ్రిలోని గోదావరి అంత్య పుష్కరాల్లో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవిత్ర సంగమం వద్దకు చేరుకుంటారు. కన్నులపండువగా జరగనున్న హారతి కార్యక్రమంలో సిఎం పాల్గొంటారు. 12వ తేదీ సూర్యోదయం నుంచే పుణ్య స్నానాలు ప్రారంభం కానున్నాయి. కృష్ణ పుష్కరాల్లో ఆరు కిలో మీటర్ల నిడివిగల ఘాట్‌లను నిర్మించారు. కృష్ణా జిల్లాలో ఎనిమిది కిలో మీటర్లు, గుంటూరు జిల్లాలో నాలుగు, కర్నూలు జిల్లాలో ఒక కిలో మీటరు ఘాట్‌లు ఉన్నాయి. విజయవాడ నగరంలోని కృష్ణవేణి, పద్మావతి ఘాట్‌లే 1.2 కిలో మీటర్ల నిడివిలో విస్తరించి ఉన్నాయి. కేవలం పుష్కరాల కోసమే కాకండా, ముందు చూపుతో ఈ ఘాట్‌ను నిర్మించారు. ఘాట్‌ల నిర్మాణంలో రెండు శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని ప్రత్యేక అధికారి రాజశేఖర్ వివరించారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 163 ఘాట్‌లను నిర్మించారు. ఇందులో లక్ష మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు వీలుగా ఎ ప్లస్ ఘాట్‌లు కృష్ణా జిల్లాలో 21, గుంటూరు జిల్లాలో ఆరు, కర్నూలు జిల్లాలో ఒకటి ఉన్నాయి. పుష్కరాల్లో విధులు నిర్వర్తించేందుకు అన్ని స్థాయిలోని అధికారులు, ఉద్యోగులు కలిపి లక్ష మందికి పైగా సిద్ధంగా ఉన్నారు. ఒక్కో ఘాట్ వద్ద డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు పనిచేస్తారు.
వీరంతా భక్తులకు సేవలందించేందుకు నిరంతరం సిద్ధంగా ఉంటారు. కృష్ణా జిల్లాలో 62,858 మంది, గుంటూరు జిల్లాలో 33,897 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా కృష్ణ, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 136 పుష్కర నగర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే భోజన సౌకర్యం కూడా కల్పించనున్నారు. కృష్ణా జిల్లాలో 72 స్వచ్ఛంద సంస్థలు ఎనిమిది లక్షల మందికి ఉచితంగా భోజన సదుపాయం కల్పించనున్నారు. 40 సంస్థలు ఆయా సంస్థలు ఉన్న ప్రదేశంలోనే సుమారు 64 వేల మందికి భోజన సదుపాయం కల్పించనున్నాయి. ప్రతి ఘాట్‌లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో ఘాట్ దగ్గర 10 పడకల ఆసుపత్రి ఉంటుంది. ఇందులో ఒక ఫిజీషియన్, ఒక సర్జన్, ఒక ఎనస్థీషియన్ ఉంటారు. బేస్ మెడికల్ క్యాంపులో వైద్యం సరిపోక, ఇంకా అత్యవసర వైద్యం అందించాల్సి వస్తే, హెలికాప్టర్ ద్వారా ఆ రోగిని తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ప్రతి ఘాట్ వద్ద రెండు అంబులెన్స్‌లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. పుష్కరాల 12 రోజుల్లో రోజుకు 1.80 లక్షల మంది దుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. విఐపిలకు ప్రత్యేక దర్శనం లేదు.
ఇదిలా ఉండగా కృష్ణా నదిలో క్రూయిజ్‌లను ప్రవేశపెడుతున్నారు. ఆసక్తి ఉన్న యాత్రికులు నదిలో విహార యాత్రకు వెళ్లొచ్చు. అలాగే రెండు హెలికాప్టర్లను కూడా యాత్రికులకు అందుబాటులో ఉంచుతున్నారు. కొంత మొత్తాన్ని చెల్లించి 10 నిముషాల పాటు ఘాట్‌ల మీదుగా ఈ హెలికాప్టర్‌లో తిరిగి రావచ్చు.