తెలంగాణ

తెలంగాణలో కొత్త జిల్లాలకు జై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 12: మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలకు ఆ జిల్లాల ప్రజాప్రతినిధులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకోసం భూపరిపాలనశాఖ ప్రభుత్వానికి అందజేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో శుక్రవారం కొత్త జిల్లాల అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం వీరి నుంచి అభిప్రాయాలు సేకరించింది. నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ప్రతిపాదించిన కామారెడ్డి జిల్లాకు ఆ జిల్లా ప్రజా ప్రతినిధులంతా అంగీకారం తెలిపారు. అయితే తమ జిల్లాలోని మండలాలన్నింటినీ తమ జిల్లాలోనే కొనసాగించాలని కోరారు. నిజామాబాద్ జిల్లాలో ఐదు నియోజకవర్గాలను, కామారెడ్డి జిల్లాలో నాలుగు నియోజకవర్గాలను చేర్చాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం భౌగోళికంగా మెదక్ జిల్లాకు అందుబాటులో ఉండటంతో ఆ నియోజకవర్గాన్ని మెదక్‌లో చేర్చాలన్న ప్రతిపాదనకు సానుకూలత వ్యక్తం చేశారు.
మెదక్ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయబోయే సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఆ జిల్లా ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేసే అవకాశం లేనిపక్షంలో కరీంనగర్ జిల్లాలోని ముస్తాబాద్, గంభీరావుపేట మండలాలను సిద్దిపేట జిల్లాలో కలుపాలని సూచించారు. అలాగే వరంగల్ జిల్లాలోని చేర్యాల, మద్దూరు మండలాలు సిద్దిపేటకు చేరువలో ఉండటంతో ఈ రెండు మండలాలను సిద్దిపేట జిల్లాలో చేర్చాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మంచీర్యాల జిల్లాతో పాటు తాజాగా ప్రతిపాదించిన నిర్మల్ జిల్లా ప్రతిపాదన పట్ల హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో కొత్తగా ప్రతిపాదించిన రెవిన్యూ డివిజన్లు, మండలాలకు అంగీకారం తెలిపారు.
ప్రభుత్వానికి నివేదిస్తాం: కడియం
కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రజాప్రతినిధులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను తమ నివేదికలో ప్రభుత్వానికి తెలియజేస్తామని మంత్రివర్గ ఉప సంఘం సభ్యుడు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. వీరి సూచనలు, సలహాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నుంచి వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.