తెలంగాణ

ఆగని నిరసనల హోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్/వరంగల్/ఆదిలాబాద్, సెప్టెంబర్ 6: ఓ వైపు కొత్త జిల్లాల ప్రక్రియ వేగంగా జరుగుతుంటే.. మరోవైపు నిరసనల హోరు కూడా అదే జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లాల పునర్విభజనపై వివిధ జిల్లాల్లో నిరసనల హోరు రోజురోజుకూ ఉధృతమవుతోంది. సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతోపాటు వీర్నపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. బిఎస్పీ, విద్యార్థి సంఘాలు, అఖిలపక్షం నాయకులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. సిరిసిల్లను జిల్లా జాబితాలో నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జెఏసి ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలంటూ ఇల్లంతకుంట మండలంలో టిడిపి, కాంగ్రెస్, బిజెపి, వామపక్షాల ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాటారాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. అలాగే కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కోరుట్లలో చేపట్టిన దీక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అటు కరీంనగర్‌లోనే కొనసాగించాలంటూ హుస్నాబాద్‌లో, సిరిసిల్లను జిల్లాగా చేయాలంటూ వేములవాడలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. కొత్త జిల్లాల ఏర్పాటు రగడ వరంగల్ జిల్లాలో చల్లారడం లేదు. జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని చేస్తున్న ఆందోళనలు రోజురోజుకూ ఉద్ధృతం అవుతున్నాయి. జనగామ జిల్లా చేయాలని కోరుతూ మంగళవారం నెల్లుట్లలో పెద్ద ఎత్తున ఆందోళన చేసారు. రోడ్లపై వంటవార్పులతో తీవ్ర నిరసన తెలిపారు. కళాకారులు ధూంధాం కార్యక్రమాలతో నిరసన తెలిపారు. అదేవిధంగా జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని చేర్యాలలో కూడా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. బుధవారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ బహిరంగ సభకు పొలిటికల్ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హాజరుకానున్నారు.
కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు నోటిఫికేషన్‌పై అఖిలపక్ష సంఘాల నిరసనలు మంగళవారం కూడా ఆదిలాబాద్ జిల్లాలో హోరెత్తాయి. ప్రభుత్వం ప్రకటించిన పునర్విభజన ముసాయిదా ప్రకటనలో తమ మండలాలను చేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఇచ్చోడ మండల కేంద్రంలో భారీఎత్తున నిరసనలు, ర్యాలీలు, రాస్తారోకోలు చేపట్టారు. ఇచ్చోడ మండలానికి సుమారు 15 నుండి 20 కి.మీ. దూరంలో ఉండే గ్రామాలకు అనువైన సిరికొండ గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై రెండున్నర గంటల పాటు రాస్తారోకో నిర్వహించి, రహదారిని దిగ్బంధించారు. గ్రామస్తులంతా మోటారుసైకిళ్లపై ర్యాలీగా వచ్చి ఇచ్చోడ క్రాస్‌రోడ్డు వద్ద బైఠాయించి, నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హైదరాబాద్, నాగపూర్ వైపు వెళ్ళాల్సిన వందలాది వాహనాలు ఐదు కిలోమీటర్ల పొడవునా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. మరోవైపు అశాస్ర్తియంగా ప్రకటించిన మూడు జిల్లాల ఏర్పాటును వెనక్కితీసుకొని, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలను మాత్రమే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉట్నూరులో అఖిలపక్షం అధ్వర్యంలో భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించి, అందోళన చేపట్టారు. ఖానాపూర్ మండలం పెంబిని కొత్త మండలంగా ప్రకటించాలని, ముథోల్ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్‌గా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీలు కొనసాగాయి.

చిత్రం.. లింగాల ఘన్‌పూర్‌లో రోడ్డ్డుపై వంటావార్పు నిర్వహిస్తున్న దృశ్యం