తెలంగాణ

చదువు చెప్పాల్సిన బాధ్యత టీచర్లదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల వికాసమే ధ్యేయంగా, వారి అభ్యున్నతి, అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిపై ఉంటుందని సాంఘిక సంక్షేమ పాఠశాలల కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమంపై ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ, మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నూతన ఆధునిక పోకడలతో చదువు చెప్పాల్సిన కర్తవ్యం టీచర్లపై ఉంటుందని, ఆ కర్తవ్యాన్ని విస్మరించినపుడు కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఎవరిపైనా కక్ష సాధింపు ఉండదని, నాలుగేళ్లుగా టీచర్ల బోధనా పద్ధతుల్లో మార్పు తెచ్చేందుకు సొసైటీ అహర్నిశలూ కృషిచేస్తోందని, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని సిబ్బంది సైతం సహకరించాలని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా మా అంతిమ లక్ష్యం విద్యార్థులే. వారికోసం అందరం కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. రూల్ 28 ఇటీవల తీసుకువచ్చింది కాదని, 1995-96లోనే ఆ నిబంధన అమలులోకి వచ్చిందని, శిక్షిస్తేనే పనిచేస్తాం అనే మనస్థత్వం నుండి సిబ్బంది బయటపడాలని, సహజసిద్ధంగా కాలానుగుణంగా వారు ప్రతిభాపాటవాలను పెంచుకోవాల్సి ఉంటుందని సూచించారు. టీచర్లు ఎవరికీ బలవంతపు ట్రైనింగ్‌లు ఇవ్వడం లేదని, రిటైర్మెంట్ దశలో ఉన్నవారిని ఎన్‌క్యూపి నుండి మినహాయించామని కూడా ఆయన వివరించారు.

పాత పాస్‌పోర్ట్‌లను
ఎలక్ట్రానిక్‌కు మార్చుకోండి
ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిణి అశ్విని
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 7: చేతి రాతతో జారీ కాబడిన పాస్‌పోర్ట్‌లను వెంటనే ఎలక్ట్రానిక్ మిషన్‌కు కన్వర్ట్ చేసుకోవాలని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిణి ఎస్ అశ్విని ఒక ప్రకటనలో తెలిపారు. 2015 నవంబర్ నాటికి 20 సంవత్సరాల వ్యాలిడిటీతో కూడిన సుమారు 2.5 లక్షల పాస్‌పోర్టులు జారీ అయ్యాయని, వీటిని వెంటనే రీడబుల్ మిషన్‌కు కన్వర్ట్ చేసుకోవాలని ఆమె సూచించారు.
రియల్టర్ కిడ్నాప్
లంగర్‌హౌస్ పిఎస్‌లో ఫిర్యాదు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 7: నగరంలోని ఓ రియల్టర్ కిడ్నాప్‌కు గురయ్యాడు. లంగర్‌హౌజ్‌కు చెందిన దావూద్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని అతని ఇంటి సమీపంలో కొందరు అతని కారును అడ్డగించి, కళ్ళలో పెప్పర్ కొట్టి కిడ్నాప్ చేశారు. దావూద్ బంధువులే కిడ్నాప్‌కు పాల్పడినట్టు అతని కుటుంబ సభ్యులు లంగర్‌హౌజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
‘బక్రీద్ దృష్ట్యా జెఎన్‌టియు
పరీక్షలు వాయిదా వేయండి’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 7: బక్రీద్ దృష్ట్యా జెఎన్‌టియు పరీక్షలను వాయిదా వేయాలని టి.పిసిసి అధికార ప్రతినిధి సయ్యద్ నిజాముద్దీన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 12న బక్రీద్ (ఈద్-ఉల్-అదహ)ను ముస్లింలు పెద్ద ఎత్తున జరుపుకోనున్నారని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. కాగా 13వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు జెఎన్‌టియు సమాయత్తమైందని అన్నారు. ముస్లింలకు రంజాన్, బక్రీద్ ముఖ్యమైన పండుగలని ఆయన తెలిపారు. కాబట్టి జెఎన్‌టియుతో పాటు ఇంకా ప్రభుత్వం ప్రకటించిన ఇతరత్రా పరీక్షలన్నింటినీ మరో తేదీకి వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
టెక్స్‌టైల్, హ్యాండ్లూమ్ రంగాలపై
ముఖ్య కార్యదర్శి సమీక్ష
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 7: టెక్స్‌టైల్, హ్యాండ్లూమ్ సహకార సంఘాల గురించి, చేనేత వస్త్రాల నిల్వ, ఇతరత్రా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్ లైన్‌లో పెట్టాలని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సంబంధిత అధికారులతో సమావేశమై సమీక్షించారు. సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్కు నిర్మాణం ఏ దశలో ఉన్నదని ఆయన అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మల్కనూరులో, వరంగల్‌లో నిర్మించాలనుకున్న మినీ టెక్స్‌టైల్ పార్కుల గురించి, నల్లగొండ జిల్లా కనుకులలో నిర్మించాలనుకున్న పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కు గురించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల సంక్షేమానికి అందిస్తున్న సహాయం, ప్రోత్సహాకాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు.

సిట్ కాదు సిబిఐ విచారణ
నరుూం కేసుపై విహెచ్ డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 7: నరుూం కేసు విచారణ సిట్‌తో సాధ్యం కాదని, సిబిఐతో జరిపించాలని ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాసినట్లు విహెచ్ బుధవారం విలేఖరులకు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా పనిచేస్తోందని హనుమంత రావు విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు 50వేల కోట్ల రూపాయలు మాఫీ చేసి, రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోనూ ప్రభుత్వం అలాగే ఉంది, రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి టి.హరీశ్‌రావు ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని ఎందుకు డిమాండ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. నాబార్డు నుంచి 7వేల కోట్లు తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. పోలవరానికి అన్ని నిధులూ కేంద్రమే ఇస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం అప్పులు తెస్తున్నదని దుయ్యబట్టారు.