తెలంగాణ

రాజకీయ లబ్ధి కోసమే బిజెపి రాద్ధాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, సెప్టెంబర్ 7: రాజకీయంగా లబ్ధి పొందాలనే దురుద్దేశ్యంతోనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ రాద్ధాంతం చేస్తోందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ విమోచనంపై గత ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో ప్రస్తుత కేంద్రం మంత్రి వెంకయ్యనాయుడు విమోచన దినం గురించి ఎందుకు మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని దుయ్యబట్టారు. బుధవారం నిజామాబాద్‌లో టిఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 70 వసంతాల ఉత్సవాల్లో ఎంపి కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజకీయంగా లబ్ధి పొందాలనే వ్యూహంతోనే సెప్టెంబర్ 17ను ప్రభుత్వమే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని బిజెపి డిమాండ్ చేస్తోందన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోనూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని ఎందుకు అడుగలేకపోయారని ప్రశ్నించారు. తెలంగాణ విమోచనం పేరుతో బిజెపి సాగిస్తున్న విషపు ప్రచారం వెనుక ఆంతర్యం గురించి ప్రజలకు వివరించి చెప్పాలని ఎంపి కవిత టిఎన్జీవోలను, పార్టీ శ్రేణులను కోరారు. తెలంగాణ ఉద్యమం ఫలించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన అనంతరం తెరాస పార్టీ అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్న బిజెపి తెరాస ప్రభుత్వంపై నిందారోపణలు మోపుతోందని, ఇందుకు విమోచన దినాన్ని వేదికగా మల్చుకోవడం శోచనీయమని అన్నారు.
ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రభుత్వమే అధికారికంగా విమోచన దినం జరపాలని, ఒక వర్గం వారిని సంతృప్తిపర్చేందుకే నిర్వహించడం లేదని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. తెలంగాణ సాధన కోసం తెరాస అధ్యక్షుడు కెసిఆర్, శ్రీకాంతచారిలు చేసిన త్యాగాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా విమోచన దినం పేరిట రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. నిజానికి 1999లోనే కాకినాడలో చేసిన తీర్మానానికి బిజెపి తిలోదకాలిచ్చి తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన విద్యార్థుల త్యాగాల గురించి ప్రస్తుతం ప్రస్తావించకుండా వారిని అవహేళనకు గురి చేస్తోందని దుయ్యబట్టారు. కాగా, ఉద్యోగులను ముఖ్యమంత్రి కెసిఆర్ తన సొంత బిడ్డల్లా చూసుకుంటారని, తమది ఎంప్లాయి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ప్రకటించిన కెసిఆర్ నిజాయితీ గురించి ఉద్యోగులందరికీ తెలుసు అని అన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటిన ఉద్యోగులంతా ప్రభుత్వానికి అండగా నిలువాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు డాక్టర్ భూపతిరెడ్డి, విజి.గౌడ్, జడ్పీ చైర్మెన్ దఫేదార్ రాజు, నగర మేయర్ ఆకుల సుజాత, తెరాస జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, టిఎన్జీవోస్ కేంద్ర సంఘం గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు కె.రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్, మాజీ కార్యదర్శి హమీద్, టిఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్, ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాగా, టిఎన్జీవోల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న నరేందర్‌ను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా నరేందర్‌ను ఎంపి కవితతో పాటు పలువురు పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు.

టిఎన్జీవోల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో
ప్రసంగిస్తున్న ఎంపి కవిత